పరీక్ష

పరీక్ష

- రుక్మిణీబాయి, నంద్యాల

పూర్వం వేదారణ్యుడు అనే సన్యాసి పరశురామక్షేత్రంలో నివాసముండేవాడు. దానినే ప్రస్తుతం కేరళ రాష్ట్రంగా పిలుచుకుంటున్నాం. ఆ సన్యాసిన నిత్యం శ్రీహరి నామజపం చేస్తూ అరిషడ్వర్గాను జయించాలని చెబుతూ వాటిని తాను త్యజించినట్లుగా భావించేవాడు. అయితే ఒకనాడు శ్రీహరి అతనికి స్వప్నంలో సాక్షాత్కరించి బదరీనాద సందర్శనానికి రమ్మని ఆజ్ఞాపించాడు.

అంతే ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని వూరూరూ తిరుగుతూ శ్రీహరి మహిమలను ప్రజలకు వివరిస్తూ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. మార్గమధ్యంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు వేదారణ్యుని శిష్యులు. కానీ వేదారణ్యుడు మాత్రం శ్రీహరిగానం చేస్తూ అతీతమైన ఆనందాన్ని పొందుతూ ముందుకు సాగిపోతున్నాడు. శిష్యులు కూడా గురువుని అనుసరించక తప్పింది కాదు.

శిష్యులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన వేదారణ్యుడు ‘‘ ఆత్మస్వరూపులారా ! మీరు ఇబ్బంది పడుతూ నాతో రావాల్సిన అవసరంలేదు. మీలో ఎవరికైతే నేను నడిచేమార్గంలో నడవటం ఇబ్బందిగా వుంటుందో వారు నన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. ఇది భగవంతుడు నాకు చూపిన మార్గం.. నేను ఆయన ఆజ్ఞానుసారం ఆయన వద్దకు వెళుతున్నాను. ’’ అని చెప్పాడు.

దానికి శిష్యులు గురువుకి నమస్కరించి వెనుదిరిగారు. ఇద్దరు శిష్యులు మాత్రం వేదారణ్యుని అనుసరించారు. దట్టమైన అడవిలో ముళ్ళతో నిండిన బాటలో పాదరక్షలు లేకుండా శ్రీహరి నామస్మరణతో వేదారణ్యుడు నడుస్తున్నాడు. మిగిలిన ఇద్దరు శిష్యులు కూడా గురువుకి నమస్కరించి వెనుదిరిగారు. వేదారణ్యుడు ఒక్కడే ముందుకు కొనసాగుతున్నాడు. అలా వెళుతున్న వేదారణ్యుని పరీక్షించాలని శ్రీహరి అనుకున్నాడు. ఎందుకంటే వేదారణ్యునికి శ్రీహరి ముక్తి కల్పించాలని భావించాడు.

అలా భావించి పెద్ద బ్రహ్మరాక్షసుడు నివాసముంటున్న ప్రదేశంవైపు వేదారణ్యునికి మార్గనిర్దేశం చేశాడు. ఆ బ్రహ్మరాక్షసుడు చాలాకాలంగా ఆ అడవిలోకి వచ్చిపోయే మనుషులను తింటూ తన కడుపు నింపుకుంటున్నాడు. అలా వెళ్ళిన వేదారణ్యుని చూస్తూనే బ్రహ్మరాక్షసుడు ఆహా ఎన్నినాళ్ళకి నరమాంసం తినే అవకాశం నాకు లభించింది. నేడు కడుపారా ఈతనిని తింటాను. అనుకుంటూ పెద్దపెద్ద అంగలతో వేదారణ్యుని ముందుకు వచ్చి నిలబడ్డాడు.

వేదారణ్యుడు ఆ బ్రహ్మరాక్షసుని చూసి భయపడలేదు. చిరునవ్వుతో ‘‘ హే ఆత్మస్వరూపా! ఏ నిమిత్తమై నువ్వు నా మార్గమునకు వచ్చావు?’’ అని ప్రశ్నించాడు.

దానికి రాక్షసుడు ‘‘ నేను నిన్ను చంపి తినబోతున్నాను. నా ఆకలి తీర్చుకుంటాను’’ అంటూ వేదారణ్యుని తన చేతిలో పట్టుకొని నోటిలో వేసుకోబోయాడు.

అప్పుడు వేదారణ్యుడు ‘‘ ఆత్మస్వరూపా.. ! శ్రీహరి నన్ను బదరీనాధ సందర్శనమునకు రమ్మని ఆజ్ఞాపించారు. నేను అచటికే వెళుతున్నాను. మార్గమధ్యంలో నీకు నేను చిక్కితిని. శ్రీహరి తలంపు ఏదైతే వుందో అదే జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ’’ అని కనులు మూసుకున్నాడు.

రాక్షసుడు వేదారణ్యునితో ‘‘ అలాగా.. చాలా కాలంతర్వాత నాకు దొరికిన నరుడివి నువ్వు. నాకంట పడిన నరుడిని తినమని పరమేశ్వరుడు నాకు వరాన్నిచ్చి వున్నాడు. అలాగే నాకు దొరికిన వారిని దొరికినట్లు తింటూ వచ్చాను. నువ్వేమో శ్రీహరి చెప్పాడంటూ బదరీనాధ సందర్శనానికి వెళుతున్నానంటివి. నిన్న వదిలేస్తే శివయ్య మాట తప్పినవాడవుతాను. తినేత్తే శ్రీహరి మాట నువ్వు తప్పినవాడవౌతావు.. ఇప్పుడేంటి దారి?’’ అన్నాడు

‘‘ రాక్షసా.. నువ్వూ నేనూ ఇద్దరం మాట తప్పినవారం కాకుండా వుండాలంటే ఒక పని చెయ్యచ్చు. నువ్వు కూడా నాతో పాటు బదరీనారాయణ దర్శనానికి రా.. నేను బదరీనారాయణుని దర్శనం చేసుకున్నంతనే నన్ను తిని పరమేశ్వరుని మాట చెల్లించు. అప్పుడు ఇద్దరం మాట తప్పిన వారం కాము.’’ అన్నాడు వేదారణ్యుడు.

దానికి రాక్షసుడు కూడా సంతోషించాడు. అయితే కాలినడకన వేదారణ్యునితో నడిస్తే కనీసం నెలరోజులు పడుతుంది బదరీక్షేత్రానికి అందుకు రాక్షసుడు వేదారణ్యుని చేతిలోకి తీసుకొని వారం రోజుల్లో బదరీక్షేత్రానికి తీసుకుపోతానన్నాడు.

అలా బయల్దేరిన రాక్షసుడూ, వేదారణ్యుడు మార్గమధ్యంలో ఎన్నో దేవునికి సంబంధించిన విశేషాలు మాట్లాడుకుంటూ వెళ్ళారు.

మార్గమధ్యంలో వీరికి బంగారు కాసులు కనబడ్డాయి..

అందమైన వనితలు కనబడ్డారు.

షడ్రసోపేతమైన వంటకాలు కనిపించాయి.

మధ్య,మాంసాలు కనిపించాయి..

ప్రతివిషయంలో రాక్షసుడు వేదారణ్యుని ప్రలోభపెట్టేలా మాట్లాడాడు.

కానీ వేదారణ్యుడు ‘‘ అవేవీ శాశ్వతం కావనీ... శ్రీహరి ఇచ్చనేనూ, పరమేశ్వరుని వాక్కుని నీవు నెరవేర్చటానికే ముందుకు సాగుతున్నామనీ.. ఈ విషయం మరచిపోరాదనీ, మధ్యలో వచ్చే ఇలాంటి ప్రలోభాలకు మనసు లొంగకూడదనీ.. భగవన్నామస్మరణ మాత్రమే ముఖ్యమనీ’’ వేదారణ్యుడు రాక్షసునితో చెప్పి రాక్షసుని బుద్ధిని పరమాత్మునివైపు మరల్చాడు.

 రాక్షసుడు బదరీక్షేత్రంలో వేదారణ్యుని దించి దర్శనం చేసుకురమ్మన్నాడు. కలిసి దర్శనం చేసుకుందాం రమ్మంటూ వేదారణ్యుడు రాక్షసుని ఆహ్వానించాడు. అలా ఇద్దరూ ఉష్ణకుండంలో స్నానం చేసి బదరీనారాయణుని దర్శనం చేసుకొన్నారు.

వేదారణ్యుడు శిరసు వంచి ‘‘ శ్రీహరి సంకల్పం నెరవేరింది. ఇప్పుడు ఈశ్వరుడు నీకిచ్చిన వరాన్ని అనుసరించి నన్ను భుజించు’’ అన్నాడు.

దానికి రాక్షసుని స్థానంలో గరుత్మంతుడు ప్రత్యక్షమై.. ‘‘ వేదారణ్యా.. ఇది శ్రీహరి నీకు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో నీవు నెగ్గావు. అరిషడ్వర్గాలను గెలిచిన నీవు ముక్తికి అర్హుడవు. ఎప్పుడైతే నీ ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా భావించి బ్రహ్మరాక్షసుని ఆకలి తీర్చేందుకు సమర్పించావో అప్పుడే నీవు మోహరహితుడివైనావు. నువ్వు పూజించే శ్రీహరి మాట చెల్లించటం నీకు ఎంత ముఖ్యమో బ్రహ్మరాక్షసుడికి వరదానం చేసిన పరమేశ్వరుని మాట చెల్లించటమూ అంతే ముఖ్యమని భావించావు. అంటే భగవంతుని మాట చెల్లించాలన్న నీ ఆకాంక్ష అభినందనీయం. శ్రీహరి తప్ప అన్యులు ఎక్కజాలని నా భుజములపై నిన్ను తనవాసమైన హరివాసానికి తీసుకు రమ్మని శ్రీహరి ఆజ్ఞఅయినది.’’ అని చెప్పి తన భుజాలపై వేదారణ్యుని ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుపోయాడు.

అలా వేదారణ్యునికి వైకుంఠ ప్రాప్తి లభించింది.

వేదారణ్యుని తో ముందు నుంచి అనుసరించి వెనుదిరిగిన శిష్యులు అదే అడవిలో దారీ తెన్నూలేక కొట్టుమిట్టాడుతూ క్రూరమృగాలబారిన పడి అశువులు బాసిన వారు కొందరైతే, మరికొందరు బందిపోటు దొంగల చేతికి చిక్కి చిత్రహింసలు అనుభవిస్తూ వారికి బానిసలుగా మారారు మరికొందరు. కొంతదూరం వచ్చి ముళ్ళమార్గంలో నడవ లేక వెనుదిరిగి పోయిన ఆ ఇద్దరు శిష్యులూ అందమైన గయ్యాళీ కన్యలను పెళ్ళాడి సంసారలంపటములో మనశ్శాంతి లేక మరణం వచ్చే వరకూ ఎదురుచూస్తూ గురువుతో వెళ్ళివుంటే శ్రీహరి దర్శనం అయివుండేదనీ, కాస్త కష్టానికి వెనుదిరిగిన తమ బుద్ధిని తామే నిందించుకుంటూ జీవించారు.

నీతి : గురువుని గుడ్డిగా నమ్మితే తను దర్శించింది మనకు దర్శింపచేస్తాడు. సగం నమ్మీ సంగం నమ్మకపోతే వేదారణ్యుని శిష్యులవలే ఎటూ కాకుండా పోతారు.

6 కామెంట్‌లు:

  1. కథావస్తువు భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచింది. గురువు గొప్పతనాన్ని వివరించింది. అన్నింటికంటే గురువుని నమ్మినవాడు వెలుగును పొందుతాడనే సందేశం చాలా బాగుంది. గురువు విలువని తెలియజేసింది.

    రిప్లయితొలగించండి
  2. chandamama kadhani gurthu chesindi.. kadh bagundi.. neethi bavundi.

    రిప్లయితొలగించండి
  3. సంజన వాడపల్లి19 జులై, 2023 12:57 PMకి

    భారతీయతలో భక్తి ప్రధానమైంది. గురుభక్తి, దైవభక్తి అన్నీ కలగలిసి మన సంప్రదాయాన్ని చూపించిన కధ. నేను చదివిన పోటీకధల్లో ఈ కథ మన విలువలను తెలియజేసేలా వుంది. దీనికి బహుమతి రావాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. పైడిపల్లి వంశీమోహన్19 జులై, 2023 1:25 PMకి

    ప్రతి ఒక్కరిలోనూ తనను తాను చూసుకోవటం భారతీయత నేర్పిన సంస్కారం. ఈ కధా రచయిత్రి భారతీయ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబించేలా రచనచేయటం అభినందనీయం.

    రిప్లయితొలగించండి
  5. Guruvu nadichina batalo nadiste gamyanni cheratam. lekapothe nastapotam. message bagundi.

    రిప్లయితొలగించండి
  6. గురుదేవులు వేదారణ్యుడు శ్రీహరి ఆజ్ఞను శిరము దాల్చి, శివుని వరాన్ని గౌరవించి చేసిన పరిష్కారం లో ధర్మం పట్ల , దైవం పట్ల అయనకు గల చిత్తశుద్ధి తెలుస్తుంది.
    ఆధ్యాత్మిక విషయ ప్రధానంగా సాగిన పరీక్ష’ కథ బాగుంది. రచయిత్రి సరళమైన భాషలో చక్కగా వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి