నవగ్రహాల పురాణం 2

 2 వ అధ్యాయం

పురాణ ప్రారంభం - 2 వరోజు


నవగ్రహ వీక్షణం సూక్ష్మపరిధిలోనూ , స్థూల పరిమాణంలోనూ మానవుణ్ని నియంత్రిస్తూ , అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. ఆహారం , ఆరోగ్యం , సంతానం , సంపద , విద్య , విజ్ఞానం , వైభవం - ఇవన్నీ కూడా గ్రహవీక్షణను అనుసరించి మనిషికి లభిస్తాయి. 

మానవుడి జాతక చక్రంలో కొలువుదీరి , అతని జీవిత చక్రాన్ని తిప్పే అశేష శేష శక్తి స్వరూపాలే నవగ్రహాలు. అంతరిక్షంలో తేజోమండలాలలో సంచరిస్తూ వుండే నవగ్రహ దేవతా మూర్తులే ఆలయాలలో అర్చామూర్తులుగా మనకు దర్శనమిస్తున్నారు. మానవుడి త్రికరణాలనూ - అంటే మనసునూ , మాటనూ , చేతనూ నియంత్రించే అతీత శక్తులే ఆ నవగ్రహాలు. విడమరచి చెప్పాలంటే , మన ఆలోచనలకూ ,అభివ్యక్తీకరణకూ , ఆచరణకూ మూలం ఆ గ్రహాల ప్రభావమే అని అర్థం..

అంటే... గురువుగారూ... ఆ గ్రహాలు తిన్నగా చూడకపోతే...విమలానందుడు ఏదో అడగబోయాడు. 

అదే చెప్పబోతున్నాను నాయనా ! గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ దృష్టిని సారిస్తే ,మనిషిజీవితంసుఖసంతోషాలతో సాగుతుంది. 

ఆ గ్రహాలు ఆగ్రహిస్తే మనిషి జీవితం కన్నీటి కడలిలో కష్టాలయాత్రే అవుతుందిగురువుగారూ ! నవగ్రహాల ప్రభావం సామాన్య మానవుల మీద మాత్రమే వుంటుందా ?"* శివానంద అడిగాడు.

మానవులే కాదు ; దానవులు , దేవతలు - ఒక్కమాటలో చెప్పాలంటే - సృష్టిలోని సకల ప్రాణుల మీదా గ్రహాల ప్రభావం వుంటుంది.అంటే... మహామహులైన పురాణ పురుషుల మీద కూడా నవగ్రహాల ప్రభావం వుంటుందా , గురువుగారూ? శివానందుడు అడిగాడు.

ఒక్క పురాణ పురుషులే ఏమిటి , నాయనా... అవతార పురుషులు కూడా గ్రహాల ప్రభావాలకు లోనైన వారే నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. 

అవతార పురుషులు కూడానా ? నమ్మశక్యంగా లేదు ! సదానందుడు ఆశ్చర్యంతోఅన్నాడు. 

నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. ఆశ్చర్యమేముందీ ? శ్రీరామచంద్రమూర్తికి వనవాస క్లేశమూ , భార్యా వియోగమూ ఎందుకు కలిగాయి ? ధర్మరాజు అడవుల పాలెందుకయ్యాడు ? 

హరిశ్చంద్రుడు కట్టుకున్న యిల్లాలిని ఎందుకు అమ్ముకున్నాడు ? ఎందుకు కాటికాపరి అయ్యాడు ? ఆయన తండ్రి త్రిశంకుడు భువికి దీవికీ మధ్య ఎందుకు వేళ్ళాడుతూ వుండి పోయాడు?.

సాక్షాత్తూ , శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు గ్రహవీక్షణకు లోనయ్యాడంటే... చిదానందుడు నమ్మలేనట్టుగా అన్నాడు.

నమ్మశక్యంగా లేదా ? నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు.ఆ శ్రీరామచంద్రుడు లంకాయుద్ధసమయంలో అగస్త్యమహర్షి నుండి ఉపదేశం పొంది 'ఆదిత్య హృదయం' ఎందుకు జపం చేశాడంటావు ? గ్రహరాజు శక్తికి ఆయన లోబడినట్టే కదా అర్థం ? ఆ శని ప్రభావంతో సర్వాన్నీ వొడ్డి వోడిన ధర్మరాజు , అరణ్యంలో సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్ర ఎందుకు పొందాడంటావు? సందేహానికి తావులేదు నాయనా ! మానవులూ , దానవులూ , దేవతలూ అందరూ నవగ్రహాల ప్రభావాన్నీ , ప్రాభవాన్నీ రుచి చూసిన వాళ్ళే !"*

మీరు చెప్పింది తార్కికంగా వుంది. గురువుగారూ ! విమలానందుడు అన్నాడు. ఔను ! నవగ్రహాల చరిత్రల్లో ఎన్నో అద్భుతాలున్నాయి. 

అవన్నీ కూడా కథాక్రమంలో మీరు తెలుసుకుంటారు ! ఇంక - నవగ్రహ పురాణశ్రవణం ప్రారంభించుదాం ! అంటూ నిర్వికల్పానంద కళ్ళు మూసుకుని , చేతులు జోడించాడు. 

హరిః ఓమ్!

శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోనమః !

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

స్తోత్రం ముగించి , కళ్ళు తెరిచి , నిర్వికల్పానంద శిష్యుల వైపు చూశాడు.

నవగ్రహాల సృష్టికి అంకురార్పణ సృష్టి ప్రారంభంలో జరిగింది. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో వున్నాం. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. కలియుగానికి ముందు ద్వాపర యుగం ; దానికి ముందు త్రేతాయుగం ; త్రేతాయుగానికి ముందు కృతయుగం - గతించాయి. కృతయుగంలో సృష్టి ప్రారంభమైంది. 

దానికి ఒకనేపథ్యం వుంది. ఆ నేపథ్యమే మహాప్రళయం ! సృష్టి క్రమం అర్థం చేసుకోవడానికి , ప్రళయానికి చెందిన అవగాహన అవసరం... వినిపిస్తాను... వినండి ! అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద...

సశేషం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి