భూమి గుండ్రంగా ఉంది...
"
ఏరా కృష్ణా! ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారుట, ఏదీ? " తండ్రి గొంతు వింటూనే భయంతో వణికిపోయాడు కృష్ణ.
“అదీ...అదీ..." మాట పెగల్లేదు.    చెంప చెళ్ళుమంది.
"నోరెత్తావంటే చంపేస్తా! ఏ ఒక్క సబ్జెక్ట్ లో రెండు అంకెల మార్కులు రాలేదు…రావు, ఎలా వస్తాయి ఇరవైనాలుగ్గంటలూ బాల్, బేట్ పట్టుకుని బలాదూర్ తిరుగుతుంటే, పోనీ అంటే అందులో ఏమన్నా ప్రావీణ్యం ఏడిసిందా అంటే…వాడికీ, వీడికీ బంతి అందించడమే మన పని.  ఈవేళ నుంచి అవి ముట్టుకున్నావంటే కాళ్ళూ, చేతులు విరిచి కూచోబెడతా" తండ్రి ఉగ్ర నరసింహావతారం చూసి బిక్క చచ్చిపోయాడు కృష్ణ.   అడ్డు రాబోయిన తల్లిని ఒక్క తోపుతోసాడు  తండ్రి.
అంతే కృష్ణ మళ్ళీ జీవితంలో క్రికెట్ ఆడడం కాదు సరికదా చూడలేదు.   కానీ అంతరాంతరాలలో తండ్రి అంటే అయిష్టం.  తన బాల్యాన్ని చిదిమేసిన కఠినాత్ముడుగా
నిలిచిపోయాడు అతని జ్ఞాపకాలలో.
అప్పటి నుండీ తను పూర్తిగా తండ్రి చేతుల్లోకి వెళ్ళిపోయాడు.   చదువు చదువు…చదువు అదే ప్రపంచం. 
                                                                        ***
"సుమా...సుమా!  సన్నీ ఏం చేస్తున్నాడు?" ఆఫీస్ నుండి వస్తూనే అడిగాడు భార్యని చైతన్య.
"ఏం చేస్తాడు! కొనిపెట్టారుగా కొత్త సెల్,  అందులో గేంస్ ఆడుతున్నాడు.   అయినా మీరేం తండ్రండీ, ఐదో తరగతి చదివే కొడుక్కు ఏ తండ్రైనా ఇలా టచ్ స్క్రీన్, వీడియో గేంస్  ఉన్న సెల్ కొనిస్తాడా! ఇప్పుడు చూడండి చదువు మాట దేవుడెరుగు, తిండి కూడా మానేసి కళ్ళుపోయేలా ఇరవైనాలుగ్గంటలూ అదే పని.   వాడిని ఎలా దారికి తేవాలో అర్థం కావడం లేదు" మొత్తుకుంది సుమ.
"కూల్ యార్!  చిన్న పిల్లాడు.   ఏదో కొత్త మోజు, నాలుగు రోజులు పోతే వాడే మానేస్తాడులే…లైట్ తీసుకో" తనూ మొబైల్ లో వాట్సప్ చూసుకుంటూ జవాబిచ్చాడు.
"అంతేలెండి, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! మీకే పొద్దస్తమానం ఆ మంత్ర దండం చేతిలో ఉండాలి.   ఇక వాడికేం చెబుతాం?" కాఫీ అందిస్తూ అంది సుమ.
"పోనీ ఆ  ఆడేవేవో ఔట్ డోర్ గేంస్ ఆడితే కాస్త ఫిట్ నెస్ అయినా ఉంటుంది.  పొద్దస్తమానం ఆ సెల్లే ప్రపంచం అయిపోయింది, కళ్ళూ, వేళ్ళూ కూడా పోయేలా. ఎంత చెప్పినా అస్సలు వినిపించుకోవడం లేదు. 
మీరేమో పట్టించుకోరు.  మీకిదే చెబుతున్నా, వాడిని బ్రతిమాలో బామాలో, భయపెట్టో ఆ అలవాటు మానిపించకపోతే  నేను దాన్ని విసిరి అవతల పడేస్తాను.  తరువాత మీ ఇష్టం." విసురుగా వెళ్ళిపోయింది.
ఆ వార్నింగ్ లో వేడి చురుక్కున తగిలిందేమో వెంటనే లేచి, ‘నాన్నా సన్నీ!’ అంటూ  పిల్లాడి గదిలోకి వెళ్ళాడు.
"ఎస్ డాడ్!" ఆటలోంచే సమాధానం ఇచ్చాడు వాడు.
"ఏం ఆడుతున్నాడు బంగారు తండ్రి! డాడ్ కి చూపించు…"
"నో డాడ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్" తలెత్తకుండానే జవాబిచ్చాడు.
"అలా లాంగ్ డ్రైవ్కి వెడదాం, రా!"
"నో ... మీరు వెళ్ళండి…"
"ఐస్ క్రీం పార్లర్ కి ..."
"ప్లీజ్ డాడ్ .. డిస్టర్బ్ చేయద్దు" 
"చార్లీ చాప్లిన్ సినిమా!"
"ఏయ్…చెబితే అర్థం కాదా! నీకేమైనా పిచ్చా! ఎందుకు ఇరిటేట్ చేస్తావు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.   వరసగా నేనే గెలుస్తున్నా.   ఇలా డిస్టర్బ్ చేస్తే నే మిస్ అవుతా!  నా ఫ్రెండ్స్ అంతా ఆడుతున్నాం, నేను కాసేపు వెనకబడ్డా రేస్ లో వెనకబడిపోతా, నా రాంక్ పడిపోతుంది, వెళ్ళిపో! " అరిచాడు.
తల్లి నేర్పెట్టిన మర్యాద గాలికెగిరిపోయింది.  అసలు రూపం బైట పడింది.
‘గాడ్, ఆన్లైన్ గేంస్ కి  బాగా ఎడిక్ట్ అయిపోయాడు వీడు, ఒక్క క్షణం వాడిని వెర్రిగా చూసి బయటకొచ్చేసాడు   
రోజులు గడుస్తున్నాయి, మొదట్లో స్కూల్ కు వెళ్ళినప్పుడు మాత్రం సెల్ ఇంట్లో వదిలేసి వెళ్ళేవాడు.  రానురానూ స్కూల్ కీ తీసికెళ్ళి, క్లాస్ లోనూ అదే పని, స్కూల్ నుంచి కంప్లైంట్.  ‘ఎన్ని సార్లు చెప్పినా, తిట్టినా, కొట్టినా ఫలితం లేదు.   వాడిలో మార్పూలేదు.   వచ్చి టీ.సీ తీసికెళ్ళమని, వాడి వలన మిగతా పిల్లలూ పాడైపోతున్నారనీ’ స్కూల్ నుంచి ఫోన్లు.
రాత్రింబవళ్ళు ఆలోచించాడు.   ఏం చేస్తే వాడు నొచ్చుకోకుండా ఆ ఆటకు వాడంతట వాడే దూరం అవుతాడూ!  తనూ ఆ ఆటలో జాయన్ అయ్యాడు.  ఎవరు ఎంతసేపటిలో అది పూర్తిచేయగలుగుతున్నారు అన్నది స్టడీ చేసాడు.   అతి తక్కువ సమయంలో ఆటని పూర్తి చేసి ఎక్కువ సార్లు గెలుస్తున్నదెవరో చూసాడు, వెంటనే ప్లాన్ రెడీ  అయిపోయింది. ఆ వ్యక్తి వివరాలు ఫేస్ బుక్ ద్వారా కనుక్కుని అతనితో మాట్లాడాడు.  తన కొడుకు ఆడే ఆట వివరాలు చెప్పి, ఆ సమయంలో అతను ఆటలో ప్రవేశించి సాధ్యమైనంత త్వరగా గెలిచి ఆట అవగొట్టాలనీ,  కొడుకు ఓడిపోయి, ఓడిపోయి విరక్తితో ఆ ఆట వదిలెయ్యాలనీ, ప్రతి ఆటకీ ఇంత అని అతనితో  ఒప్పందం  కుదుర్చుకున్నాడు.                                                
                           
ఇక్కడ సన్నీ ఆట మొదలుపెట్టగానే అక్కడకు మెసేజ్ వెడుతుంది. వెంటనే ఆ వ్యక్తి ఆ ఆటలో ఎంటర్ అయి ఆడి గెలిచేసి వెళ్ళిపోతాడు.   ఇక్కడ సన్నీకు కసి పెరుగుతోంది.  ఎంత ప్రయత్నించినా ఆట ఒక్కసారి కూడా గెలవలేకపోతున్నాడు.  ప్రయత్నిస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు...ఓడిపోతున్నాడు.  ఉక్రోషం పట్టలేక సెల్ నేలకేసి కొట్టాడు.   మళ్ళీ ఆ ఆట వైపు వెళ్ళలేదు.  ఆ సమయంలో ఈ సారి తండ్రి జాగ్రత్తగా కొడుక్కు దగ్గరై వాడిని తన దారిలోకి తెచ్చుకున్నాడు.
చాలా పెద్ద మొత్తమే ఖర్చయ్యింది.  దేవుడి దయవలన తను బాగానే సంపాదిస్తున్నాడుగా!   కానీ తన కొడుకు మనసులో ఎప్పటికీ తన స్థానం పదిలం, తన తండ్రిలా కాకుండా.  అప్పటి నుంచీ ఆఫీస్, కొడుకూ అదే తన ప్రపంచం అయిపోయింది. 
చూస్తూండగానే పదేళ్ళు గిర్రున తిరిగిపోయాయి, కొడుకు భవిష్యత్ కోసం, చదువు కోసం తన కెరీర్ సైతం వదులుకున్నాడు.  తన అదృష్టమో, వాడి కృషి ఫలితమో వాడు చదువులో ముందుండి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరాడు.  సరిగ్గా మూడో ఏడాదిలో అడుగుపెట్టేసరికల్లా ఎలా అలవాటయ్యిందో డ్రగ్స్ అలవాటయ్యింది.  చాలనట్ట్లు అమ్మాయిలతో స్నేహాలు.  తనని తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు .. ఎలా! ఎలా వాడిని ఆ దారి మళ్ళించాలి? ఆలోచనలో పడ్డాడు చైతన్య.
అతని కళ్ళ ముందు గతం రింగులు రింగులుగా తిరుగుతోంది...
                                                                       
***
"ఏరా కృష్ణా! నిన్న నీతో సినిమా హాల్లో కనిపించిన అమ్మాయి ఎవర్రా!”  తండ్రి ప్రశ్నకి బిత్తరపోయి నేల చూపులు చూస్తున్న కొడుకుని చూస్తూ…
"ఇలా రా! కూర్చో...చూడు,  నీ వయసులో ఇవన్నీ సాధారణం.   కానీ జీవితం గాడి తప్పడం అనేది సరిగ్గా ఈ వయసులోనే.   ఇప్పుడు మనసుని అధీనంలో ఉంచుకుని చదువు మీదా, కెరీర్ మీదా దృష్టి పెడితే జీవితంలో మంచి స్థాయికి చేరుకుని హాయిగా ఉంటావు, లేదా ఇప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగితే రేపన్న రోజు కష్టాలు తప్పవు. 
నాలుగు దెబ్బలు వేసి తప్పొప్పులు చెప్పే వయసు కాదు ఇంక.   అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే మన ఖర్మ. 
అన్నట్లు,  సిగరెట్స్ కూడా మరీ ఎక్కువ కాల్చకు .. ఆరోగ్యం పాడవుతుంది." వెళ్ళిపోయేడాయన.
‘అమ్మయ్యా! అనవసరంగా భయపడి చచ్చా! ఇంత సింపుల్ గా వదిలేసాడేమిటీ!    అయినా పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.  కొన్నాళ్ళు బుద్ధిగా చదువుకోవాలి.’ తనే ఆ స్నేహాలను దూరం పెట్టాడు.   సరిగ్గా తను ఆఖరి ఏడాదిలో ఉండగా అమ్మ పోయింది. తనకు ఆ ఇంటితో ఉన్న కాస్తో కూస్తో అనుబంధం కూడా పోయినట్టే అనిపించింది.
కేంపస్ లో మంచి ఉద్యోగం వచ్చింది.  తనతో బాటే పని చేసే సుమని పెళ్ళి చేసుకుని వచ్చేసాడు.  తండ్రి మనసులో ఏం బాధపడ్డాడో కానీ, తననేమీ అనలేదు.
రెండేళ్ళు గడిచాయి తనకు కొడుకు పుట్టాడు.  వాడు తనలా పెరగకూడదు.  ఆడింది ఆట, పాడింది పాటగా అల్లారుముద్దుగా పెంచుకొచ్చారు తనూ, సుమా.  సరిగ్గా అప్పుడే  ‘ఆ విషయంలోనే ‘ తనకు తండ్రితో గొడవ జరిగింది. ఫలితం ఆయనను బయటకు పంపేసాడు ఎటువంటి ఆలోచనా, బాధా లేకుండా.
                                                                           
***
ఇంజనీరింగ్ మూడో ఏడాదిలో కొచ్చాడు సన్నీ, అస్సలు మాట వినడం లేదు.  అసలు ఇంట్లోనే ఉండడం లేదు. ఎప్పుడో వస్తాడు, కావల్సిన డబ్బు అడుగుతాడు, తీసుకుంటాడు…వెళ్ళిపోతాడు.  ఒక రోజు ఏకంగా ఓ అమ్మాయితో ఇంటికొచ్చేసాడు.  సహ జీవనం అట, నచ్చితే, ఇద్దరి అభిప్రాయాలూ కలిస్తే తరువాత ఎప్పుడో పెళ్ళట.   ఒక్కసారి నెత్తి మీద బాంబ్ పడ్డట్లయ్యింది తనకూ, సుమకూ .. నచ్చచెప్పారు, బ్రతిమాలారు...ఉహూ వింటేగా! 
ఇంటికి స్నేహితులంటూ ఎవరెవరో వస్తారు, కళ్ళముందే తాగుతారు, పాటలూ, ఆటలూ, డేన్సులూ... బుర్ర తిరిగిపోయింది.
ఏ స్వేచ్ఛ ఇవ్వలేదని తను తన తండ్రిని ద్వేషించి, దూరం పెట్టాడో ఆ స్వేచ్ఛ... స్వరూపం ఇలా, ఇంత భయంకరంగా ఉంటుందా! 
తండ్రి తన బాల్యాన్ని చిదిమేసి తనను ఆరడి పెట్టాడనే భావించాడు కానీ, ఆ కట్టడి వెనుక ఎంత బాధ్యతా, విజ్ఞతా ఉన్నాయో ఇప్పుడర్థం అవుతోంది.   తను ఇంత చేసినా,  వాడికి కావలసినంత స్వేచ్ఛనిచ్చినా వాడికి తను అక్కరలేదు.  నిజమే! తను తన తండ్రిలా కాకుండా వాడిని ప్రేమగా, గారంగా పెంచాలనుకున్నాడు.  అలాగే పెంచాడు అయినా వాడు తనని లెక్క చెయడం లేదు. వాడి దృష్టిలో తనో ఎ.టి.ఎం, అంతే.  మరి ఇప్పుడు తన కొడుకు తనని చూసి తండ్రిని దూరం పెట్టాలనే విషయం నేర్చుకుంటాడా! ఏమో!  
ఉలిక్కి పడ్డాడు చైతన్య,   తండ్రి మాట గుర్తుకు రాగానే.   పాపం ఎలా ఉన్నాడో! అవునూ! ఆయన ఏం తప్పు చేసాడని తను ఆయన్ని దూరం పెట్టాడు?  ఈ రోజు తన కొడుకు కోసం, వాడి బాగు కోసం తను ఎంత ఆరాట పడుతున్నాడు? ఆ రోజు వాడి చిన్నతనాన, తను ఎంత ఆరాటపడ్డాడు, వాడు ఆ ఆటకి అడిక్ట్ అయిపోతున్నాడని తను ఎంత బాధపడ్డాడు?   డబ్బుంది కనుక ఖర్చుపెట్టి,  స్కెచ్ వేసి మరీ వాడిని ఆ ఆటనుంచి దూరం చేసాడు.  
మరి, తన విషయంలో ఆ రోజు ఆయన చేసినదీ అదే పని కదా!  కాకపోతే, కాకపోతే ఒక మధ్యతరగతి తండ్రిగా తన పద్ధతిలో తను చేసుకెళ్ళాడు.  ఏదైనా ఆ ఆరాటం, ప్రేమ, కొడుకు జీవితం పట్ల శ్రద్ధ ఒకటే కదా!  తండ్రంటే అంతే కదా! 
‘తను భగవంతుడి దయ వలన బాగా సంపాదిస్తున్నాను’ అనుకున్నాడే కానీ, నిజానికి అది తన తండ్రి వలన కదా! ఆ రోజు ఆయన అలా చేయబట్టే తను బాగా చదువుకుని ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు.  కానీ అదే నేరంగా తలచి ఆయనను దూరం పెట్టాడు.  దిక్కులేనివాడిలా వృద్ధాశ్రమంలో పడేసాడు.
ఇప్పుడు తను ఏం చెయ్యాలి, కొడుకును సరైన మార్గంలో ఎలా పెట్టాలి? తనకు తెలియడం లేదు, ఇప్పుడు తండ్రి సాయం, ఆయన అనుభవం తనకు అవసరం.  ‘ఇన్నాళ్ళూ ఆయనను దూరం పెట్టి తప్పు చేసాను.  వెడతాను, క్షమాపణ అడిగి ఆయనను ఇంటికి తీసుకు వస్తాను’ అనుకుంటూ తేలిక పడిన మనసుతో భార్యతో సహా బయలుదేరాడు ఆయనను ఇంటికి తీసుకురావడానికి ఓ తండ్రికి కొడుకుగా, ఓ కొడుక్కి తండ్రిగా ‘కృష్ణ చైతన్య’.
                                                                  ***
Routine writing
రిప్లయితొలగించండిధన్యవాదములు 🙏
తొలగించండిఒక కొడుకు భవిష్యత్ పట్ల తండ్రికి ఎంత ఆందోళన ఉంటుందో ఆ కొడుక్కి తెలిసేది ఎప్పుడంటే అతడు తండ్రయినప్పుడే –
రిప్లయితొలగించండిఆ విషయాన్ని చాలా చక్కగా వివరించిన కథ భూమి గుండ్రం గా వుంది’.
ఇందులో కొడుక్కి వున్న ఆన్ లైన్ గేమ్స్ పిచ్చిని వదిలించటానికి తండ్రి చైతన్య వేసిన ఎత్తుగడ చాలా బాగుంది. రచయిత గారు అభినందనీయులు.
ధన్యవాదములు 🙏
రిప్లయితొలగించండి