![]() |
విద్యాధర్ మునిపల్లె |
ముకుందుడు ఆవేశంగా తన కళ్ళని పెద్దవి చేస్తూ విరూపాక్షని చూస్తూ...
‘‘ ఎవరయ్యా నువ్వు.. ముందు ఆ కుర్చీలోంచి పై లే..’’ అంటూ పెద్దపెద్దగా కేకలువేశాడు..
విరూపాక్షకి అర్ధం కాక ‘‘కుర్చీ బానే వుందిగా ..’’ అన్నాడు లేవకుండా..
‘‘ నీ పద్ధతే బాగాలేదు. ముందు లేస్తావాలేదా..? ఆ కుర్చీలో కూర్చునే అర్హత కేవలం మా బావగారికే వుంది. ముందు లేస్తావాలేదా..’’ అంటూ మీదికి పోయాడు..
ముకుందుని ప్రవర్తనకి విరూపాక్షకి కూడా కోపం వచ్చింది. అయినా తనేంటో అతనికి తెలియాలని నర్మగర్భంగా ‘‘ విశ్వనాధుడు ఆశీన్నుడయ్యే భస్మసింహాసనమా..? మరి చెప్పవేం..’’ అంటూ కుర్చీలోంచి లేచాడు.
విరూపాక్షుని మాటలు ముకుందునికి అర్ధంకాలేదు.. ‘‘ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు..?’’ అన్నాడు అసహనంగా.. అయోమయంగా..
‘‘ కవిపండితుడిని కదా.. మనోస్పందనని చలోక్తిగా విసిరాను. ఈ కొంపని చూడగానే నా మనసులో మెదలిన భావకవనం.. విశ్వనాధుడు నివాసముండేది స్మశానంలో.. వారు తప్ప అన్యులు ఆశీనులవ్వజాలని భస్మ సింహాసనం.. అద్భుతమైన పొంతనకదూ...’’ అన్నాడు నవ్వుతూ విరూపాక్ష.
అతని మాటల్లోని వెటకారాన్నీ.. వ్యంగ్యాన్నీ అర్ధంచేసుకున్న ముకుందుడు తగిన బుద్ధి చెప్పాలనుకొని అతనిలాగే.. ‘‘ అద్భుతమనీ మీకు మీరే అనుకుంటే సరిపోతుందా..?’’ అంటూ వ్యంగ్యంగా నవ్వాడు.
విరూపాక్షకి ముకుందుడి ప్రవర్తన బొత్తిగా నచ్చటంలేదు. వెళ్ళిపోదామని అనుకున్నా... జవ్వంగి రాజావారు తన భుజాలమీద పెట్టిన బాధ్యతని నెరవేర్చి కానీ వెళ్ళలేడు. విశ్వనాధుని కలిస్తే కానీ తను వచ్చిన పని పూర్తికాదు.
ముకుందుడి పరిస్థితీ అలాగే వుంది.. ఊరూ పేరూ లేని ఒక అనామకుడు తమ ఇంటికి వచ్చి తన బావగారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చూడబోతే కవి పండితుడిలా వున్నాడు. అర్ధచంద్ర ప్రయోగం (మెడబట్టి బయటికి గెంటటం) చేద్దామంటే తన బావగారికి చెడ్డపేరు వస్తుంది. అందుకే కేవలం మాటలతోనే సరిపెట్టుకుంటున్నాడు.
వీరిద్దరి మొహాలూ కోపంతో ఎర్రబడి వున్నాయి. ఎవరి పరిధులు వారు మీరకుండా వారివారి విచక్షణ ఆపుతోంది. కానీ హద్దుమీరాలని మనసు పదేపదే చెబుతోంది.. విరూపాక్షకి సహజంగానే అహంకారం వుంది. ముకుందుని కించపరచేలా తన సాహితీ పటిమని నిరూపిస్తూ...
‘‘ పూలదండలోని దారం పూపరిమళాన్ని కొద్దిపాటి అంటించుకొని తనవల్లనే పూవులకి గుభాళింపులు వచ్చినట్లుగా మురిసిపోతుంటుంది. కానీ ఆ దారానికి తెలీదు.. సువాసనలిచ్చేశక్తి కేవలం పూవులకి మాత్రమే వుందని. తను కేవలం పూవులని ఒకచోటికి చేర్చే ఆధారమైన దారమని’’ అన్నాడు..
ముకుందుడు కూడా తనేం తక్కువ తినలేదన్నట్లుగా...
‘‘ అనుచితమైన ఉపమాలంకార ప్రయోగం వ్యర్థం అన్నవిషయాన్ని అర్ధం చేసుకోండి కవివర్యా...’’ అన్నాడు...
అంటే అర్ధంపర్ధంలేకుండా మాట్లాడుతున్నావ్.. వచ్చిన విషయం చెప్పన్న ట్లుగా..
విరూపాక్షకి ముకుందుడి స్థాయి అర్ధమైంది. కానీ ముకుందుడు కేవలం లేఖఖుడు.. అటువంటిది పండితుడైన తనతోనే ఇటువంటి వాదనకి దిగటం తన పదప్రయోగాన్ని తప్పుపట్టటం అస్సలు నచ్చలేదు. ఇక ముకుందుని ఉపేక్షించి లాభంలేదు.. అతని స్థాయి అతనికి అర్ధమయ్యేలా చెప్పక తప్పదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు..
‘‘ మా పదప్రయోగం ఉచితమమే... కాకపోతే అర్ధంచేసుకునే జ్ఞానమే నీకు లేదు. కవి చెప్పే కవనాన్ని లేఖించే లేఖకులు మీరు . కవితా పరిమళాలను కొద్దోగొప్పో అంటించుకున్నారే తప్ప మాలా మీరు కవి కాలేరు కదా.. అందుకనే మా పదప్రయోగంలోని చమత్కృతిని అర్ధంచేసుకోలేక పోయారు. ఎంతైనా దారం దారమే.. పూవు పూవే.. దారంతో చేరకున్నా పూవు తన గుభాళింపుని వెదజల్లుతునే వుంటుంది. కానీ పిచ్చిదారం ఆ పూగుభాళింపు తనదే అనుకుంటుంది. ’’ అన్నాడు వ్యంగ్యంగా..
ముకుందుడు మౌనంగా వుండిపోయాడు. విరూపాక్ష అక్కడితో ఆగకుండా
‘‘ నేను విశ్వనాధశాస్త్రి ఇంటికి వచ్చేటప్పుడే చెప్పారు.. ఆ ఇంట్లో కొంచెం జాగ్రత్తగా వుండండి కవివర్యా అని.. ఏం అని అడిగితే.. అందరికీ వెర్రి వేపకాయంత వుంటే.. శాస్త్రిగారి బావమరిదికి తాటికాయంత వుంటుంది.. అప్పుడు నేను నమ్మలేదు.. ఇప్పుడు నమ్ముతున్నాను.. కానీ వారు చెప్పింది అబద్ధం.. నీ వెర్రి తాటికాయంత కాదు.. కూష్మాండ ప్రమాణం (గుమ్మడికాయంత).’’ అంటూ నట్టింట్లో వున్న పందిరి గుంజని పట్టుకొని తన ఆవేశాన్ని ఆపుకునే ప్రయత్నం చేశాడు విరూపాక్ష.
తనని అవమానించి మాట్లాడిన విరూపాక్షను తక్షణమే తలపగలగొట్టి చంపేయాలన్నంత ఆవేశం ముకుందుడిని ఆవహించింది. ఆగదిలో ఓ మూలగా వున్న దుడ్డుకర్ర తనని వాడుకోమని ముకుందుడిని పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఎర్రబడిన మొహంతో.. ఆవేశంతో వణుకుతున్న శరీరాన్ని అదుపుచేయలేక పోతున్నాడు ముకుందుడు.
బయట ఏదో గొడవ జరుగుతోందని విశ్వనాధశాస్త్రి తన సంధ్యావందనాన్ని ముగించుకొని పెరటిలోంచి నట్టింట్లోకి వస్తున్నాడు.
ముకుందుడు తనని తాను సంభాళించుకుంటూ...
‘‘ అధిక ప్రసంగం మాని వచ్చిన విషయాన్ని విన్నవించుకోండి..’’ అన్నాడు.
విశ్వనాధుని ఆగమనాన్ని గమనించని విరూపాక్ష..
‘‘ కుంటాం.. అలాగే విన్నవించుకుంటాం... కానీ ఉఫ్ అని ఊదితే ఎగిరిపోయే కాగితంతో కాదు.. కాలాన్ని కూడా తన కవనంతో కదిలించే కలంతో.. తమరు కాళ్ళకి బుద్ధిచెప్పి గళంవిప్పి కలాన్ని కేకవేస్తే.. కార్యం సెలవిచ్చి ఈ స్మశానం నుండి నిష్క్రమిస్తాం.. ’’ అన్నాడు అసహనంగా విరూపాక్ష.
విశ్వనాధునికి అతని పద్ధతీ.. మాటతీరూ నచ్చలేదు. అయనా ఇంటికి వచ్చినవారు అతిధులు. అతిధులని అగౌరవ పరచటం సభ్యత కాదని భావించి...
‘‘ కాగితంలేనిదే కలానికి విలువలేదన్న విషయాన్నిగ్రహించాలి తమరు..’’ అన్నాడు.
విశ్వనాధుని మాటవింటూనే విరూపాక్ష, ముకుందుడు ఇద్దరూ కూడా అటువైపు చూశారు. విశ్వనాధుడు చిరునవ్వుతో పంచపాత్ర, దర్భచాప ముకుందునికి అందించాడు. ముకుందుడు వాటిని లోపలికి తీసుకెళ్ళాడు.
అసలే ముకుందుడి వల్ల విసిగిపోయిన విరూపాక్ష.. విశ్వనాధునిమీద కూడా అసహనాన్ని ప్రదర్శిస్తూ...
‘‘ అర్ధంకాలేదు.. మీ రచనల్లాగే..’’ అంటూ పెదవి విరిచాడు.
‘‘ నాకర్ధమైందిలేండి మీ స్థాయి ఏంటో.. వివరించండి వచ్చిన విషయమేంటో...’’ అంటూ పడక కుర్చీలో వాలాడు విశ్వనాధ శాస్త్రి.
తనంతటి వాడు నిలబడి వుండగా విశ్వనాధుడు పడక కుర్చీలో సాగిలపడటం విరూపాక్షకి నచ్చలేదు. అయినా సరే తనకు పురమాయించబడిన కార్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత గుర్తుకొచ్చి...
‘‘ మనవంటి కవిపండితులని సన్మానించుకోవటమంటే మా రాజావారికి చాలా ఇది. అందుకే వారి జన్మదినంరోజున అనగా రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మీవంటి కవిపండితులతో సాహితీ సమరాన్ని నిర్వహించాలని సంకల్పించారు. ఈ కార్యాన్ని నిర్వర్తించమని సాక్షాత్తూ సరస్వతీ మానసపుత్రులమైన మమ్మల్ని మీ కడకు సగౌరవంగా పంపారు మా జవ్వంగి రాజావారు. ఎక్కడెక్కడి నుండో సంస్కృతాంధ్ర పండితులు విచ్చేసే దివ్యసభకు మిమ్మల్ని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం..’’ అంటూ తన మాటల్లో గర్వాన్ని ప్రస్ఫుటింపచేశాడు.
విశ్వనాధుడు విషయాన్ని గ్రహించాడు. విరూపాక్షునికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
‘‘ వచ్చిన వారు సూటిగా విషయం చెప్పేముందు. తమని తాము పరిచయం చేసుకోవటం మర్యాద. మీరాధర్మాన్ని పాటించకుండా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానకరగా మాట్లాడారు. ప్రవర్తించారు. మీ వంటి వారిని ఏరికోరి ఎంచి మరీ పంపిన మీ రాజావారి విజ్ఞతని అర్థం చేసుకున్నాం. నిరాకరించదలచాం. కానీ సాహితీ సమరాంగణిలో పాల్గొనాలని పిలిచిన మీ పిలుపుని ఆమమోదిస్తున్నాం. రానున్న ఉగాది పర్వదినాన జ్వంగి చేరుకుంటామని మీ రాజావారికి మామాటగా చెప్పండి. మీకిక సెలవు’’ అంటూ వీధి వాకిలి వైపు చూపించాడు విశ్వనాధశాస్త్రి.
దీంతో విరూపాక్ష అంతరంగమనే అగ్నిపర్వతం మరింతగా బద్దలైంది. ఎవ్వరైనా తన మాటకు తలొగ్గటమే కానీ తాను అవతలివారి చర్యలకు తలొగ్గటమా? అంటూ అతనిలోని అహంకారం మరింతగా పెల్లుబికింది. అదే ఆవేశంతో...
‘‘ మా ఆస్థానంలో మీ ఓటమికి ముందస్తు విచారం వ్యక్తం చేస్తున్నాం.. గెలుపు ఈ విరూపాక్ష కవీంద్రునిదే ముందస్తుగా ప్రకటించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం..’’ అని రెండు చేతులు బలంగా జోడించి ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
విరూపాక్షుని ప్రతి చర్యనూ లోపలి నుండి గమనిస్తున్న ముకుందుడికి మాత్రం తన బావగారు సాహితీ సమరంలో పాల్గొనటం ఇష్టంలేక పోయింది. బావగారికి ఎలా చెప్పాలో అర్ధంకాని స్థితిలో ముకుందుడు వుండిపోయాడు.
(సశేషం)
చదివేకొద్దీ చదవాలనిపిస్తోంది.
రిప్లయితొలగించండి