క్షమించు అమ్మా!

 క్షమించు అమ్మా!

-నన్ద త్రినాధరావు

M/s. N.   E.   C.   Ltd
H.  R.  -  Department
N.T.P.C    –   S.T.P.P 
BARH [PO]- PATNA
BIHAR    –   803 215
Cell : 7781020483

        మిట్ట మధ్యాహ్నంసూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.

      పైన ఎండ. లోపల ఆకలి. కాళ్ళకి చెప్పులు లేవు.  వంటిపైన సరైన ఆచ్చాదనా లేదు. చిరుగుల చొక్కా, అలాగే చిన్న నిక్కరు.  తైల సంస్కారం లేని జుట్టు. లోపలికి పోయిన కళ్ళు.

      నడుస్తున్నాడు వీరిగాడు. వీధుల్లోంచి నడుస్తున్నాడు.

      వళ్ళంతా చెమట్లు పడ్తున్నాయి. దాహంగా ఉంది. ఆకలిగా ఉంది.

      అయినా వీరిగాడు నడక ఆపటం లేదు.

      ప్రతీ ఇంటిముందు ఆగుతున్నాడు.అడుగుతున్నాడు. నిరాశతో వెను తిరుగుతున్నాడు.

      వీరిగాడి ఒంట్లో ఒక్క అవయవం చురుగ్గా పనిచేయటం లేదు. జవసత్వాలు ఉడిగిపోయినట్టు నీరసపడిపోయాయి. ఒక్క కడుపు తప్ప! అది మాత్రమే చురుగ్గా పని చేస్తోంది. అది ఆకలితో లోపలికి పోయింది. ఎముకలకు అంటుకుపోయింది. అలమటించసాగింది. లోపల పేగులన్నింటిని మరో పేగుతో ముడి వేసి,  చెరో వైపు లాగుతున్న బాధ. మిగిలిన అవయవాల పట్ల వీరిగాడు శ్రద్ధ పెట్ట లేదు. వాడి దృష్టి అంతా కడుపు మీదే ఉంది.  ఆకలి మీదే ఉంది.

      రోడ్ ప్రక్కనే  నల్లా కనబడింది. ప్రాణం లేచొచ్చినట్టయింది. చల్లని నీళ్లు తాగాడు. పొట్ట నిండింది. కాస్తంత ఓపిక వచ్చింది. మళ్ళీ నడవటం మొదలు పెట్టాడు  వీరిగాడు.

      ఒక ఇంటి ముందు ఆగాడు.

      "అమ్మా! కొంచెం వణ్ణం ఉంటే పెట్టండి తల్లీ!" అన్నాడు దీనంగా.

      వీరిగాడి గొంతు చాలా హృదయ విదారకంగా ఉంది. లోకంలోని జాలి అంతా వాడి  కంఠంలోనే ఉంది. అలా అడుక్కుంటేనే అన్నం వేసేవాళ్ళ మనసు కరుగుతుంది. అలా అడగటంలో,  అడుక్కోవడంలో వీరిగాడు ప్రత్యేకం! వాడు అడుక్కుంటే ఎవరైనా సరే బిచ్చం వేయవలసిందే. వేసే వాళ్ళ మనసు కరగవలసిందే. అంత నేర్పుతో అడుక్కుంటాడు వీరిగాడు.

      రెండు మూడు సార్లు అలా పిలిచాక ఇంటావిడ బయట కొచ్చింది.

      వీరిగాడ్ని  చూసింది. మొహం చిట్లించింది.

      "చేయి ఖాళీ లేదు. వెళ్ళవయ్యా" అని కసురుకుంది.

      ఆవిడ చేతుల కేసి చూశాడు వీరిగాడు. ఆవిడ  చెప్పింది నిజమే. అవి పిండి అంటుకొని ఉన్నాయి. వడియాలు పెడుతున్న చేతుల్లా ఉన్నాయి. ఆవిడ అలా అన్నందుకు వీరిగాడికి  కోపం రాలేదు. వాడికి తెలుసు. అమ్మ చాలా మంచిది. చాలా సార్లు తనకి మిగిలిపోయిన అన్నాలు, పాడైపోయిన కూరలు పెట్టేది. అందుకే మారు  మాట్లాడక వీరిగాడు ముందుకు పోయాడు.

మరో ఇంటావిడని అడిగాడు.

      "భోజనాలయి పోయాయి రారేపు రారా" అందావిడ చిరాకు పడుతూ.

      ఆవిడ మాటలకి వీరిగాడికి కోపం వచ్చింది. ఆవిడ ఎప్పుడూ తనకి బిచ్చం వేయదు. పిసినారిది. ఎంగిలిచేత్తో కాకిని విదిలించదు. మిగిలిపోయిన అన్నాలు, కూరలు, దాచుకుని తినే బాపతు. ఆవిడ సంగతి తెలిసీ ఆవిడను అడుగుతూనే ఉంటాడు. లేదనిపించుకుంటాడు. కోపాన్ని దిగమింగుకున్నాడు. ముందుకు నడిచాడు.

      అలాగే మరొక పెద్దావిడ-

      "ఏరా! దుక్కలా ఉన్నావు. అడుక్కోవడం మాని పని చేసుకోకూడదూ?" అంది.

      అన్నం వేయలేదు. ఉచిత సలహా పారేసింది. వీరిగాడి పొట్ట, వాడి చేతిలోని బొచ్చె రెండూ  నిండటం కోసమే ఎదురుచూస్తున్నాయి.  

      వీరిగాడు మళ్ళీ రెండోసారి నీళ్లు తాగాడు. పొట్ట కాస్త కుదుట పడింది.

      వీరిగాడు కడుపునిండా బువ్వ తిని మూడు రోజులయింది. వీరిగాడు పొద్దున్నే లేస్తాడు. ఊరిమీద పడతాడు. ఇంటిoటికీ తిరుగుతాడు. అడుక్కుంటాడు. వాడి అదృష్టం బాగుంటే రెండు మూడిళ్ళకే వాడి బొచ్చె నిండి పోతుంది. మరి ముందుకు వెళ్ళడు. ఆరోజుకి వాడి డ్యూటీ  అయిపోయినట్టే.

      ఒకొక్కసారి ఊరంతా తిరుగుతాడు. అలసి పోతాడు. కూడు దొరకదు. కడుపు నిండదు. దొరికినప్పుడు కడుపు నింపుకోవడం, లేనప్పుడు పస్తులుండడం  వీరిగాడికి మామూలే.

      రోజు వీరిగాడికి దశ బాగోలేదు. అన్నం దొరకలేదు.

      ఒకొక్కసారి వీరిగాడికి సుష్టుకరమైన భోజనం దొరుకుతుంది. మూడు నాలుగు రకాలైన కూరలు, పప్పు, సాంబారు కూడా దొరుకుతాయి. ఆరోజు వీరిగాడికి పండగే! ఒకొక్కరోజు ఏమీ  దొరకదు. ఆరోజు దండగే. ‘సూత్తుంటే ఈరోజు కూడా దండగ లాగే వుందిఅనుకున్నాడు వీరిగాడు.

      కొంచెం ఎండ తగ్గినట్టయింది. వీరిగాడికి అర్ధం అయ్యింది.

      o ఇక్కడ దేవులాడ్డం యర్థం. ఎంత దేవులాడినా వణ్ణం దొరికేటట్టు లేదు. అక్కడికే పోవాల. తన దస  బాగుంటే అక్కడ దొరకొచ్చుఅనుకున్నాడు వీరిగాడు.   

      వడి వడిగా అక్కడికి నడవసాగాడు. ముందుకు నడుస్తూనే అక్కడికి చేరుకున్నాడు. ఎక్కడా బువ్వ దొరక్క పొతే వాడు అక్కడికే పోతాడు. ఆరోజు దండగ అనుకున్న వీరిగాడికి పండగయ్యింది. గోడపక్క చెత్త కుండీ దగ్గర కాపు కాసాడు. వాడితో పాటూ అక్కడ కుక్కలున్నాయి. కాకులున్నాయి. పందులున్నాయి. ఇద్దరు ముగ్గురు తన నేస్తాలు కూడా  ఉన్నారు. అందరి కళ్ళల్లో  ఒకటే ఆశ. ఒకటే ఆకలి.

      "ఏరా ఈరిగా! వణ్ణం దొరకనేదా?" అన్నాడు ఒకడు. ముఖం  దిగాలుగా పెట్టాడు వీరిగాడు లేదు అన్నట్టు.

      "పోన్లేరా,  కాసేపు ఓపికపట్టు. వణ్ణం దొరుకుద్ది లే" భరోసా ఇచ్చాడు మరొకడు.

      వాళ్ళతో పాటూ అక్కడ కుక్కలు, కాకులు, పందులు తిండి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. మనిషైనా, జంతువైనా ఆకలి సమానమే. ఒక్క విషయంలో దేవుడు అందర్నీ సమానంగా చూస్తాడు. ఎవరికీ అన్యాయం చేయడు. పక్షపాతం చూపడు.

      ఎండ మరి కాస్త తగ్గింది. వాళ్ళoదరూ గోడవైపు ఆశగా,  ఆర్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

      అది చాలా ఎత్తైన గోడ. అక్కడ చప్పుడయ్యింది. అందరూ ఒక్కసారి అప్రమత్తమయ్యారు. అందరి చూపులూ గోడమీదికి మళ్ళాయి. ఎత్తైన గోడ పైనుంచి రెండు చేతులు పైకి లేచాయి. వాళ్ళ  కోరిక ఫలించింది. ఆశ తీరింది. కళ్ళల్లో కాంతి కనిపించింది. అందరూ తమ తమ బొచ్చెలతో, చిప్పలతో  సిద్ధమయ్యారు. ఆకలి పై యుద్దానికి సిద్దమైనట్టు.

      చేతుల్లో పెద్ద డేగిసా లాంటిది ఉంది. దాన్ని ఒక్కసారిగా చేతులు బోర్లించాయి. చేతులు బోర్లించిన కింద ఎదురుగా పెద్ద కుప్ప తొట్టి ఉంది. అందులోకి వచ్చి పడేసరికి అందరూ  తమ తమ బొచ్చెలు, చిప్పలు  అక్కడ పెట్టారు. వడుపుగా అన్నాన్ని  పట్టారు.

      కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అన్నీ  కలగలిసిన అన్నంతో అందరి బొచ్చెలు నిండాయి. అందులో మిగిలిపోయినవి వున్నాయి. పాడైపోయినవి ఉన్నాయి. జనం సగం తిని వదిలేసినవి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అని వాళ్ళు చూడరు. అందులో అన్నం ఉందా లేదా అనే చూస్తారు. అలా రెండు మూడు సార్లు వంపేటప్పుడు కొంత కుండీలో పడిపోయింది.

      వాళ్ళ బొచ్చెలు నిండిపోగా కుండీలో పడిన అన్నం కోసం కుక్కలు, కాకులు, పందులు పోటీ పడ్డాయి. అందులో విజయం సాధించినవి పొట్ట నింపుకున్నాయి. లేనివి ఆశతో,  ఆకలితో వెను తిరిగాయి. అందులో బలమైన వాటికే విజయం దక్కేది.

      గోడ పక్కనే పెద్ద హోటలుంది. మిగిలిపోయినవి గోడ వెనక నుంచి చెత్త కుండీలో పడేస్తారు. బిచ్చగాళ్ళు హోటల్ ముందుకు వెళ్లి అడుక్కుంటారు. హోటల్ వాళ్ళు ఒక్క మెతుకు కూడా పెట్టరు. కసిరేస్తారు. అన్నం కావాలంటే వెనక్కి పొమ్మంటారు. గోడపైనుంచి వెనక్కి పారేస్తారు.

      అక్కడే ఒక చెట్టు కింద కూర్చున్నాడు వీరిగాడు. దించిన తల ఎత్తకుండా తిన్నాడు. ఆబగా తిన్నాడు. ఆర్తిగా తిన్నాడు. పొట్ట నిండిపోయింది. నల్లాలో నీళ్లు తాగాడు. బ్రేవ్ మని త్రేన్చాడు. ఇంకా బొచ్చెలో అన్నం వుంది. ఆకలితో ఉన్నప్పుడు వాడికి గంపెడన్నo తినేయాలని ఆశ, ఆత్రం కలుగుతాయి. అన్నం దొరికాక గుప్పెడు మెతుకులకే వాడికి కడుపు నిండిపోతాది. ఏమిటో  మాయ అనుకుంటాడు.

      బొచ్చెతో  ముందుకు నడిచాడు.

      పూర్తిగా ఎండ తగ్గి పోయి చల్లబడింది. వాడి ఆకలి మంట తీరినట్టుగానే.

      అలికిడికి ఈరిగాఅంది ముసిల్ది. వీరిగాడు ఆశ్చర్యపోయాడు.

      ఎంత సప్పుడు లేకుండా వచ్చినా ముసిల్ది పసి గట్టేత్తుoదిఅనుకున్నాడు.

      నేనే లేవేఅన్నాడు.

      ముసిల్దాని కళ్ళల్లో వెలుగులు నిండాయి. మొహం చాటంత అయ్యిoది. సంబర పడింది. మూడ్రోజుల నుండి దానికీ తిండి లేదు. వీరిగాడు వయసులో ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. తట్టుకుంటున్నాడు. ముసిల్ది వయసు మీద పడింది. ఆకలికి తట్టుకోవడం కష్టమై పోతుంది. వీరిగాడు వచ్చాడంటే ఆశగా చూసింది. అన్నం తెచ్చే ఉంటాడు.

      ఈరిగా వణ్ణం తెచ్చావా?“ అడిగింది ముసిల్ది. అడగటంలో ఎంతో ప్రేమా, ఆప్యాయత చూపించింది. లేదు అంటే ముసిల్దాని గుండె అప్పుడే ఆగిపోయేది. మాట వాడు అనకూడదు. తను వినకూడదు  అనుకుంది.  

      ఆఁదొరికిందిలేవేఅన్నాడు. బొచ్చెని ఆవిడ ముందుకు తోసాడు.

      ముసిల్ది గబ గబా రెండు ముద్దలు తింది. మూడో ముద్ద నోటిలో పెట్టుకోబోతూ-

      ఈరిగా! నువ్వు తిన్నావా?అంది.

      అడగటంలో వీరిగాడి మీద ప్రేమ కంటే,  ఎక్కడ తను  తినలేదు అంటాడో, అన్నం తనకు సరిపోతుందో లేదోననే భయమే ఆమె ముఖంలో స్పష్టంగా  కనిపించింది. అది గమనించాడు  వీరిగాడు.

      ఆఁతిన్నాను లేవే. ఇది నీకే అన్నాడు. బొచ్చెలోని అన్నాన్ని ఖాళీ చేసింది ముసిల్ది. నీళ్లు తాగింది.

      మూడ్రోజుల తర్వాత మనకి కడుపు నిండా వణ్ణం దొరికిందిరా ఈరిగాఅంది సంతోషంగా. వీరిగాడు మాట్లాడలేదు.

      రెండ్రోజులు గడిచాయి. మళ్ళీ మామూలే. పస్తులే!

      ఈసారి అన్నం ఇళ్లల్లోనూ దొరకలేదు. హోటలు దగ్గరా  దొరక లేదు. హోటలు దగ్గర అన్నం ఎప్పుడు పారేస్తారో తెలీదు. ఒక రోజు పొద్దున్న, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు రాత్రి. ఒకోనాడు అసలు పడేయరు. అక్కడ ఠికానా  లేదు. విషయం వీరిగాడికి బాగా ఎరుకే.

      ఈసారి వీరిగాడు జనాల్ని యాచించటం మొదలెట్టాడు. రోడ్ పైన  కనబడ్డ ప్రతి  ఒక్కర్నీ అడిగే వాడు. అందరూ ఛీఛీ…“  అనేవాళ్లే కానీ ఒక్క రూపాయి విదల్చటం లేదు. అదే బాధగా ఉంది వాడికి.

      వాడితో పాటూ అడుక్కునే ఇద్దరు ముగ్గురు తన నేస్తాలకి బాగానే డబ్బులు ముడుతున్నాయి. ఎందుకంటే అడుక్కోవడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. వాళ్ళల్లో ఒకడికి ఒక కాలు లేదు. ఒకడికి ఒక చెయ్యి లేదు. మరొకడికి రెండూ లేవు. అందుకే వాళ్ళ వ్యాపారానికి ఢోకా లేదు. సెంటర్ కెళ్ళినా డబ్బులు రాలుతూనే ఉంటాయి.

      తను  అలా కాదు. తనకన్నీ బాగానే ఉన్నాయి. ఆరోగ్యoగానే ఉన్నాడు. అందుకే తనకి డబ్బులు రాలవు. పైగా చీవాట్లు కూడా తినాలి. బిచ్చం వేసేవాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు. ఒకడు చూడగానే వేసేస్తాడు. ఇంకొకడు చిల్లరున్నా లేదంటాడు. మరొకడు బిచ్చం వేయకపోయినా,కాళ్ళూ చేతులూ  బాగానే ఉన్నాయిగా? పని చేసుకో పోరా!“ అంటాడు.

      వీరిగాడికి బొచ్చె  ఖాళీగా ఉంది. అందులో అన్నం  పడలేదు. పైసలూ రాల లేదు. చూసి చూసి వాడికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకేసింది. తన పేదరికంపై అసహ్యం వేసింది. డబ్బున్న వాళ్ళ పట్ల కోపం వచ్చింది. ‘చత్ దీనమ్మా  జీవితంఅనుకున్నాడు కసిగా.

      పోనీ వేణుగోపాలస్వామి గుడి  దగ్గరికి పోతేనో?అనుకున్నాడు. మళ్ళీ వాడికి భయం వేసింది. అక్కడ అందరూ ఒకే కట్టు. ఒకే జట్టు. అక్కడ వాళ్లే  తప్పా, బయట వాళ్ళకి అక్కడ  స్థానం లేదు. అడుక్కోనివ్వరు. అడుగు పెట్టనివ్వరు.                

      ఒకసారి అలా వెళ్లే తను అక్కడవాళ్లతో గొడవ పడాల్సొచ్చింది. తను తొందరలో మాట తూలేడు. తనొంటి మీద దెబ్బలు పడిపోయాయి. అందుకే ఆలోచన విరమించాడు వీరిగాడు.

      ఇంతలో సూటూ బూటూ  వేసుకొని ఒకడు కనబడ్డాడు. వాడ్ని చూస్తే మన దేశపోడులా కనబళ్ళేదు. వాడి దగ్గరికి పరిగెత్తాడు. లోకంలోని విషాదమంతా ముఖంలో చూపెట్టాడు. బొచ్చె  ముందుకు పెట్టాడు. అడుక్కున్నాడు. ఎర్రోడు వీరిగాడ్ని, వాడి బొచ్చెని ఒకసారి ఎగాదిగా చూశాడు. జేబులోంచి పర్స్ తీసాడు. ఒక పచ్చ కాయితం బొచ్చెలో పడేసాడు.

      అది చూసి వీరిగాడికి దిమ్మ తిరిగిపోయింది. వాడి  జీవితంలో అలాంటి పచ్చ నోటు  చూళ్ళేదు వాడు. వాడి కళ్ళల్లో చుక్కలు మెరిసాయి. మొహం చాటంతయ్యింది. ఎర్రోడి కాళ్ళకి వంగి వంగి  మొక్కాడు. ఇంగ్లీషులో ఏదో సణిగి ఎర్రోడు ముందుకు పోయాడు.

      బొచ్చెలో వంద నోటు వీరిగాడి జేబులో కొచ్చింది. రంగు నోటు చూడగానే వీరిగాడి ఆలోచనలు మారాయి. రంగు రంగుల కలలు కళ్ళముందు మెదిలాయి. ఎప్పటి నుంచో వీరిగాడికి రెండు కోరికలున్నాయి.

      ఒకటి సారా చుక్క!

      మరొకటి చక్కని చుక్క!!

      వెంకమ్మ కొట్లో సారా బిగించి పక్కనే ఉన్న చుక్కమ్మ దగ్గరికి వెళ్లాలని వాడి కోరిక. చిరకాల వాంఛ. చుక్కమ్మ బంగినపల్లి మామిడిపండులా ఉంటది. కాకినాడ కాజాలా ఉంటది. బందరు లడ్డూలా ఉంటది. రెండు కోరికలు వీరిగాడికి తీరని కోరికల్లా మిగిలిపోయాయి. వంద నోటుతో అవి గుర్రాలయ్యాయి. వాడి కోర్కెలకు రెక్కలొచ్చాయి. నోటుతో వాటిని  తీర్చుకోవాలి అనుకున్నాడు వీరిగాడు.

      నోటుని చూసి వాడికి వెయ్యేనుగుల బలం వచ్చింది. ‘ఎప్పుడూ ఒకే రకమైన జీవితమేనా? మజా చేయాల!అనుకున్నాడు. నోటును చిల్లరగా మార్చాడు. వెంకమ్మ సారా కొట్టుకు వెళ్ళాడు. పేకెట్ వేసాడు. ఎప్పుడూ దాని రుచి తెలియని వాడికి స్వర్గం కనబడింది. భూమంతా తిరుగుతున్నట్టు అనిపించింది. గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టనిపించింది. దాంతో మరో పేకెట్ వేసాడు.

      చుక్కమ్మ దగ్గరికి వెళ్ళాడు. చుక్కమ్మ ఎప్పుడూ కస్టమర్లతో బిజీగానే ఉంటది.

      రోజు వీరిగాడి అదృష్టం బాగుంది. చుక్కమ్మ దర్శనం దొరికింది.

      సరదా కూడా తీరింది వీరిగాడికి. బట్టలేసుకుని వీరిగాడు బయటకి నడిచాడు.

      వీరిగాడు వెళ్లేటప్పటికీ ముసిల్ది ఎదురుచూస్తూ ఉంది.

      ఈరిగా! వణ్ణం తెచ్చావా?“ అంది. అప్పుడు గానీ వీరిగాడికి ముసిల్ది తనకోసం ఎదురు చూస్తూ ఉంటుందని గుర్తు రాలేదు.

      వణ్ణం దొరకలేదేఅబద్ధం ఆడాడు.

      సారాకంపుకి ముసిల్దానికి చిరాకేసింది. కోపం నషాళానికి అంటింది.

      "తినడానికి తిండి లేదు. నీకు సుక్క కావాల్రా?అని తిట్టింది. వీరిగాడికి కోపం వచ్చింది.

      నా ఇట్టమే. నాను తాగుతాను. తిరుగుతానే అన్నాడు మత్తుగా. వాడి  మాటలకి తల్లి హృదయం ద్రవించింది.

      అది కాదురా  ఈరిగా పైసలుంటే  మనకి రెండ్రోజులు కూడు  దొరికేది కదా అని అన్నానుఅంది బాధగా.

      కూడు అనగానే వీరిగాడికి ఆకలి గుర్తుకొచ్చింది. జేబులు వెతికాడు.  పది రూపాయలు తప్ప ఇంక  మిగల్లేదు. ఆమాటే చెప్పాడు తల్లితో.

      "పోనీ ఒక బన్ను రొట్టయ్యినా తేరా. శానా ఆకలిగా ఉంది" అంది ముసిల్ది ఆకలికి తట్టుకోలేక.

      లోపలికి పోయిన సారా వీరిగాడి ఆకలిని పెంచేసింది. బన్ను రొట్టి తెద్దామని పైకి లేచాడు. పదిరూపాయలు పట్టుకున్నాడు.

      పది రూపాయలు గెద్దలా తన్నుకుపోయాడు అప్పుడే అక్కడ కొచ్చిన సూరిగాడు. వాడూ బిచ్చగాడే.

      వీరిగాడు బిత్తర పోయాడు.

      ఏంట్రా ఇది.. నా పదిరూపాయలు ఇత్తావా లేదా?“ అన్నాడు కోపంగా.

      సూరిగాడికి కూడా కోపం వచ్చింది.

      మీ అమ్మను అడగరా. నాకు పది రూపాయలు బాకీ ఉందిఅని చెప్పి వెళ్లి  పోయాడు.

      వీరిగాడికి కోపం నషాళానికి అంటింది.

      ఏంటే ఇది?అన్నాడు కోపంగా తల్లితో.

      అవునురా ఈరిగా! ఓపాలి నీకు ఒంట్లో బాగోలేనప్పుడు ఆడ్నిపదిరూపాయలు అప్పడిగి నీకు మాత్రలు కొని ఏసానురాఅని చెప్పింది బాధగా.

      చేసేది లేక వీరిగాడు మళ్ళీ బొచ్చెతో  బయటకి వెళ్ళాడు. వాడి దశ బాగుంది. ఒక ఇంటి దగ్గర వెంటనే కాస్త వణ్ణం దొరికింది. వెనక్కొచ్చాడు. చుక్కేసాడేమో ఆకలి దంచేస్తోంది. మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ  వచ్చాడు గుడిసెకి.

      ముసిల్ది పడుకుని ఉంది. వీరిగాడు అన్నం  గబ గబా మెక్క సాగాడు. అలికిడికి ముసిల్ది లేచింది.

      ఈరిగా! వణ్ణం దొరికిందారా?అడిగింది ఆశగా. వీరిగాడికి దొరికిన కాస్త అన్నం వాడికి మాత్రమే  సరిపోద్ది. ముసిల్దానికి ఉండదు. ఒక నిముషం ఆలోచించాడు వీరిగాడు. “నేదే...దొరకనేదేఅబద్ధం ఆడేసాడు. ఆకలి వాడితో అలా అబద్ధం ఆడేలా చేసింది. ఆకలి తీర్చుకోవాలనే స్వార్ధం తల్లీ కొడుకుల ప్రేమని చంపేసింది.

      ముసిల్దానికి కళ్ళు కనబడవు. పుట్టు  గుడ్డిది! వాడి మాటే నమ్మింది. లేదు నమ్మినట్టు నటించింది. ఎంతయినా తల్లికదా! కొడుకు ఆకలి తీరితే తన ఆకలి తీరినట్టే అని సరిపెట్టుకుంది. వీరిగాడు తినేసాడు. బొచ్చె పక్కన పారేసి మత్తుగా నిద్రపోయాడు.

      ముసిల్ది ఆకలికి తట్టుకోలేకపోయింది. కొంత దూరంలో ఆమెకు మైకులో పాటలు వినిపిస్తున్నాయి. అంటే పెళ్లిలాంటి వేడుకేదో అక్కడ జరుగుతుందని ముసిల్ది గ్రహించింది. అక్కడికి వెళితే తన ఆకలి తీరొచ్చునని ఆశ పడింది.

      వీరిగాడ్ని రెండు మూడుసార్లు లేపింది. వాడు మత్తుగా నిద్రపోయాడు. చుక్కమ్మతో వాడు చేసిన మజా వాడి కలలో కనిపించి మురిపించసాగింది.

      ముసిలిది మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ మైకులో పాటలు వినిపించే దిశగా నడవసాగింది.

      తడుముకుంటూ రోడ్ దాటబోయింది.

      ఇంతలో  కీచు మంటూ పెద్దగా టైర్ల శబ్దం వినిపించింది.

      సడన్  బ్రేకుతో ఆగింది లారీ!

      ముందు చక్రాలకు ఎర్రని రక్తం అంటుకుంది!!

      ముసిలిదాని  అరుపులు కీచుమనే టైర్ల శబ్దoలో కలిసి పోయాయి.

      వీరిగాడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు.

      కాని ఆడి మనసు మాత్రం నన్ను క్షమించు అమ్మా!’ అని రోదిస్తోంది.

8 కామెంట్‌లు:

  1. బాణావత్ వసంతయామిని16 జులై, 2023 7:39 PMకి

    గుండెని కదిలించిన కధ.. ఊపిరి సలపనివ్వని కధనం.. ఇంకా ఇలాంటి రచనలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. చాలా చాలా బాగుంది. కథనం పట్టు విడవకుండా అలవోకగా చదివించింది. రచయితకు అభినందనలు 🌹🌷🌹

    రిప్లయితొలగించండి
  3. రవీంద్రబాబు17 జులై, 2023 11:22 AMకి

    కథ చాలా బాగుంది. ఆకలితో అలమటించే జీవితాల్ని కళ్ళకుకట్టినట్లు చూపించారు మీరు. ఆ జీవితాల్లోనూ నిస్సహాయత చూపించారు, స్వార్ధాన్ని చూపించారు. నిర్లక్ష్యాన్ని తట్టుకోలేని బిచ్చగాడు.. నిర్లక్ష్యంగా వ్యవహరించటం మనిషిలో ఏదో ఒక సమయంలో పొడచూపే ఆలోచనకి నిదర్శనం.. ఈ విషయంలో బిచ్చగాడే కాదు బచ్చాగాడిక్కూడా మినహాయింపు లేదని నిరూపించారు. ఏది ఏమైనా కథే కాదు కధనం కూడా ఆసాంతం రక్తికట్టించారు. అభినందనలు.. మరిన్ని రచనలు ఇలాంటివి కాదు కానీ ఇంతకు మించి చేయాలని కోరుకుంటూ..రవీంద్రబాబు, మేడికొండూరు

    రిప్లయితొలగించండి
  4. అధో జగత్సహోదరుల క్షుద్భాదను కథ లో బాగా చూపించారు రచయిత. కాస్త పైకం పడగానే వీరిగాడిలో రెండు కోర్కెలకు రెక్కలు రావటం ఆశ్చర్యం కాదు. ఆకలి, పేదరికం, అవిద్య వలన స్వార్థపరుడై ముసలి తల్లి తో రెండు సార్లు అబద్ధం ఆడటమూ జరుగుతుంది. తాగి వచ్చి తల్లిదండ్రుల్ని హింసించే కథలున్న సమాజంలో కనీసం క్షమించమని అడిగిన వీరిగాడి మనసుని చూస్తే జాలి కలుగుతుంది. కథనం బాగుంది.

    రిప్లయితొలగించండి