శివలీలలు 10

 ఇరువదండారి కథ

ఓమహారాజా! ఒక మహోత్కృష్ట శివభక్తుని కథను నీకు వినిపించెదను అని బసవేశ్వరుడు ఈ విధముగా వినిపించుచుండెను. 

పూర్వం ద్రవిడ దేశంలో కరమూరచోరుడను రాజు రాజ్యమును పాలించుచుండగా ఆ రాజ్యంలో అరువది ముగ్గురు ప్రసిద్ధ శివభక్తులలో చేరిన ఇరువత్తునాయనారు అను పేరుగల శివభక్తుడుండెను. అతడు సర్వసంగపరిత్యాగి. ఇతడు యవ్వనదశయందే కూడా పరమభక్తునిగా కీర్తినొందెను. శ్రౌతస్మార్తకర్మాదులయందు అభిరుచికలవాడై భస్మ రుద్రాక్షలను శరీరం నిండా ధరించి శివభక్తులను సేవించటమే పరమానంద పారవశ్యమని నిరూపిస్తూ శివభక్తులకు ద్రోహం తలపెట్టినవానికి ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే హతమార్చుట అను వ్రతమును ఆచరించు చుండెడివాడు. అతడు శాస్త్ర విశారదుడగుటచే శివపురాణమునందున్న పద్యవాఖ్య విచారణ చేయుచూ సమర్థమగు శివతత్త్వమును శివభక్తులకు ఉపదేశంగా అందించెడివాడు. కరవీరపురమున కరవీరచోడుని రాజధానిలో నివసించుచున్న శివభక్తుడొకడు తెల్లవారీవారక మునుపే ఆత్రతతో లేచి ఆ నగరములోని పూతోటలకు పోయి రకరకముల పుష్పములు సేకరించుచూ, పెద్దగాలులుకు రేకులు చిరిగిన పుష్పములను వేకువగాలి సోకి ఉబ్బి చిల్లులుపడిన పుష్పములను హోరుగాలికి ఊగిసలాడి తొడిమలూడి క్రిందపడిన పుష్పములను సరిగా పూయని పుష్పములను విచ్చని కొన్ని పుష్పములను తేనెటీగలు మొదలగు కీటకములచే ఎంగిలిపడ్డ పుష్పములను ఇటువంటి రకరకములగు పుష్పములను పరిపరివిధముల పరీక్షించి మంచి సువాసనలిచ్చు పుష్పములను ఒకటిగా సేకరించి తన పూలబట్టను నింపుకొని పరమోత్సాహముతో శివపూజకు సమాయత్తమై మార్గములో వెళ్లుచుండగా అనుకోని ఒక సన్నివేశము ఎదురైనది. చోళచక్రవర్తి యొక్క మదగజము మదధారలు స్రవించుచూ మహోద్రేక వేగముతో శివభక్తునికి ఎదురుపడి ఆ శివభక్తుని తన దంతముల మధ్య ఇరుకించుకొని నొక్కుచూ అతని ఱొమ్ముపై తొండంతో కొట్టుచూ ప్రాణములు పోయే పరిస్థితి నెలకొనగా ఆ శివభక్తుడు ఆర్తితో ప్రాణేశా! శివా! ఓ పరమాత్మ ! అని పెద్దగా ఆక్రోశించెను. ఆ భక్తుని దీనాలాపనలు భక్తి సంప్రార్థనలు విని ఇరువదండారి శివభక్తుని రక్షించుటకై ఆ ప్రాంతమునకు వచ్చెను. ఆ మదగజమును చూసి ఇరువడండారి హూంకరించుచూ! తన తీక్షణమైన కరవాలమును తీసుకొని నీ ప్రాణం తీసెదనని అరుచుచూ ఏనుగుపై తన వీరత్వమును ప్రదర్శించుటకు వెళ్లెను. అప్పుడు ఏనుగు మదం స్రవించుటచే మరింత ఉన్మాదివలె  ప్రవర్తించుచుండెను. గజాసురుని పరమశివుడు ఎట్లు మోహరించి సంహరించెనో అలా ఆ రూపమును పొంది ఏనుగు కుంభస్థలముపై తన నిశిత కృపాణముతో భేదించి వీర విహారుడనాడు. అపుడు ఆ ఏనుగు ఒక్కసారిగా భూమిపై కూలిపోయినది. ఈ విషయం తెలుసుకొనిన చోళరాజేంద్రుడు వేగంగా ఇరువదండారి వద్దకు వచ్చి పాదములపై పడి తను చేసిన దోషమును క్షమించమని వేడుకొనెను అని బిజ్జలునికి బసవేశ్వరుడు ఇరువదండారి కథను తెలియజెప్పెను.

ఈ కథయందు భక్తుల యెడ ఎవరు అపకారం చేయుటకు ప్రయత్నించెదరో వారిని శిక్షించుటయందు భక్తులే సమర్థులుగా ఇందు నిరూపించబడెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి