హత్య

                                                                         హత్య

రచన : విద్యాధర్ మునిపల్లె

రోజూలాగే ఆరోజు కూడా సూర్యుడు ఆ ఊర్లో ఉదయించాడు. అందరూ ఎవరి పనులకు వారు వెళుతున్నారు. నాయరు టీస్టాల్ సెంటరులో చేతి వృత్తులవారంతా నిలబడి వున్నారు. ఇంతలో ఏం జరిగిందో అర్థమయ్యేలోపు నాయరు హత్యకి గురయ్యాడు. ఊరంతా ఒక్కసారి ఉలికిపడింది. నలుగురితో నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడే టీకొట్టు నాయరుని అంత దారుణంగా హత్యచేయటం, అంతమంది అక్కడే వున్నా హత్యచేసింది ఎవరో కూడా తెలియకపోవటం కలకలానికి కారణమైంది..

ఎప్పుడూ పోలీసులు అడుగు కూడా పెట్టని ఆ ఊర్లోకి పోలీసు జీబు ప్రవేశించింది. సి.ఐ సీతారాంనాయక్ తన ఎస్సై రాములు,కానిస్టేబుల్స్ తో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. నాయరు భార్య, కుమార్తె ఇద్దరూ కూడా రక్తం మడుగులో పడివున్న నాయరు శవం పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు కానిస్టేబుల్స్. ఎస్సై రాములు అక్కడున్న వారందరినీ ఎంక్వైరీ చేస్తున్నాడు.

అందరి నోటా ఒకటే మాట...

అంతా ఇక్కడే వున్నాం సార్.. ఉన్నట్లుండి వంటగదిలోంచి చాలా పొగవచ్చింది. మిరపకాయల కోరు వచ్చింది. మేమంతా దగ్గుతూ ఆ కోరుకి కళ్ళుమూసుకున్నాం.. ఇంతలోనే నాయరు పెద్దగా కేకలు పెడుతూ కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు... అంతా అయిపోయింది..

పోలీసులు నాయరు శవానికి ఫార్మాలిటీలు పూర్తిచేశారు. ఫోటో గ్రాఫర్ వచ్చి ఫోటోలు తీశారు. ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ఆధారాలు సేకరించారు. నాయరు భార్య కుట్టి, పద్నాలుగేళ్ల కూతురు మీనాక్షి తాయి వద్ద స్టేట్ మెంట్స్ తీసుకున్నారు.

వాళ్ళు చెప్పిన నివేదిక ప్రకారం...

చెట్నీలో పోపు వేసేందుకు మిరపకాయలు తీస్తుండగా చెయ్యిజారి మిరపకాయలు గాడిపొయ్యిలో పడ్డాయి. ఇంతలో పెద్ద ఎత్తున పొగ, కోరు వచ్చాయి. బయటికి రావటానికి వీల్లేకుండా పొగ, కోరు కమ్ముకోటంతో లోపలే ముక్కుకి గుడ్డలు అడ్డంపెట్టుకొని కళ్లు మూసుకొన్నాం.. ఇంతలో మా ఆయన బయట నుండి పెద్దగా కేకలు పెట్టాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా ఆయన ఇలా.. అంటూ పెద్దగా ఏడుస్తోంది...

మీనాక్షి కూడా తల్లి చెప్పినట్లే చెప్పింది.

ఇంతలో అంబులెన్స్ రావటంతో పోలీసులు నాయరు డెడ్ బాడీని పోస్టుమార్టంకి తరలించారు. మీనాక్షి, కుట్టి ఇద్దరూ కూడా ఏడుస్తూ అంబులెన్స్ వెనకే కొంతదూరం పరిగెత్తారు. ఊర్లో వాళ్ళు వాళ్ళని పట్టుకొని ఓదారుస్తున్నారు.

ఊరంతా ఒకటే గుసగుసలు... అందరితో మంచిగా వుండే నాయర్ ని ఎవరు హత్యచేశారు.? ఎందుకు హత్య చేశారు? నాయర్ కి ఎవరితోనూ గొడవలు లేవు.

--------

ఆ ఊరి పోలీస్టేషన్ బయట సెంట్రీ కాపలా కాస్తున్నాడు. కానిస్టేబుల్స్ ఎవరి పనుల్లో వారున్నారు. కానిస్టేబుల్ దస్తగిరి సిఐ రూమ్ బయట నిలబడి ఫ్లాస్క్ లో టీ గ్లాసుల్లో పోస్తూ సిఐ, ఎస్సైల మధ్య సంభాషణ వింటున్నాడు. అతనికి చెమటలు పడుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి.

పాల్ ఘాట్ నుంచి నాయర్ తన భార్య కుట్టితో ఆ ఊరికి వచ్చి దాదాపు పదిహేనేళ్ళయింది. ఊరి పెద్ద అయిన రామినీడు సాయంతో ఆ ఊరి సెంటరులో కాఫీ హోటలు ప్రారంభించాడు.. అక్కడి నుండి రెండు నెలలు తిరిగే సరికి టిఫిన్ హోటలు గా మార్చుకున్నాడు. ఏడాది తిరిగే సరికి మీనాక్షి పుట్టింది. ఆ అమ్మాయి అదే ఊర్లో గవర్నమెంటు బళ్ళో చదువుకుంటోంది. ఏ రోజూ నాయర్ ఎవ్వరితోనూ గొడవ పడటంకానీ, మాట తూలటం కానీ చెయ్యలేదు. నాలుగు నెలల క్రితం ఊర్లో సొంతంగా ఇల్లు కొనుక్కున్నాడు. ఊరందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టాడు. అతని సంసారం సజావుగానే సాగిపోతోంది.. కానీ నాయర్ ని హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికి వుంది? కారణమేంటి? అన్నాడు సిఐ సీతారాంనాయక్... ఎస్సై వంక చూస్తూ...

అదే సార్ నాకూ అర్థం కావట్లేదు. అందరితో మంచిగా వుండే అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది. చూస్తుంటే ఈ హత్య చెయ్యటం వెనుక ఏదో బలమైన కారణం వుంది. అన్నాడు ఎస్సై రాములు.

కారణం బలమైందే.. అదే ఏంటి? అంటూ అతని వైపు చూశాడు..

అలా ఆలోచిస్తుండగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది.

నాయర్ 72 కత్తిపోట్లకు గురయ్యాడనీ, 20 కత్తిపోట్లు పడ్డాకే చనిపోయాడనీ, అతను చనిపోయాక కూడా అతన్ని కత్తులతో నరికారనీ వుంది.

రిపోర్టు పూర్తిగా చదివాడు సీతారాం నాయక్.. ఎస్సై ఆలోచనలో పడ్డాడు. ఇంతలో కానిస్టేబుల్ టీ తీసుకొచ్చి ఇచ్చాడు.

చూస్తుంటే జరిగిన హత్య కోపంతో, పగతో, కసితో పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లుగా వుంది సార్ అన్నాడు రాములు.

ఇంతలో ఎస్పీ ఆఫీసు నుంచి డాగ్ స్క్వాడ్ వచ్చిందని ఫోన్ చేశాడు నాయర్ హోటల్ దగ్గరున్న కానిస్టేబుల్ వీరేశం. సిఐ నాయక్, ఎస్సై రాములు, దస్తగిరిని తీసుకొని నాయర్ హోటల్ దగ్గరికి బయల్దేరారు...

------

దస్తగిరి జీబు తోలుతున్నాడు.. సిఐ, ఎస్సై ఇద్దరూ కేసు గురించి మాట్లాడుకుంటూ వున్నాడు. దస్తగిరి చేతులు వణుకుతున్నాయి. అతనికి చెమటలు పడుతున్నాయి. కరెక్టుగా జీబు వెళ్ళి నాయర్ హోటల్ ముందు ఆగింది. దస్తగిరి జీబు దిగలేదు. సిఐ, ఎస్సై ఇద్దరూ కూడా జీబుదిగి డాగ్ స్క్వాడ్ ని సెర్చ్ చెయ్యమని చెప్పారు. సిఐ, ఎస్సై కూడా డాగ్స్ వెంట వెళ్ళటం మొదలు పెట్టారు. దస్తగిరి వారిని అనుసరించబోతుంటే.. జీబుదగ్గరే వుండమని సిఐ గట్టిగా చెప్పాడు. అంతే దస్తగిరి అక్కడే ఆగిపోయాడు. బడ్డీ కొట్లో సిగరెట్ తీసుకొని వెలిగించుకొని వేగంగా దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు...

డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మొదట నాయర్ చనిపోయిన ప్రదేశానికి వచ్చి వాసన చూసింది. అక్కడి నుండి బయల్దేరి హోటల్ వెనుక భాగంలో పొదల్లోకి వెళ్ళింది. అలా కొంత దూరం వెళ్ళాక పొలాలు. ఆ పొలాల మధ్య నుండి వెళుతున్న కాలువ వరకూ వెళ్ళి ఆగిపోయాయి. డాగ్ స్క్వాడ్ రిపోర్టు ని సి.ఐ. నమోదు చేసుకున్నాడు.

-------

స్టేషనులో కేసుగురించి కుస్తీ పడుతున్నారు సిఐ, ఎస్సైలు. దస్తగిరి ఏదో ఒక పనిమీద వారి సంభాషణలు వింటానికి గదిలోకి వెళుతునే వున్నాడు. బయటికి వచ్చిన ప్రతిసారీ చెమటలు పడుతున్న అతని మొహాన్ని తుడుచుకుంటునే వున్నాడు.

‘‘ జరిగిన హత్యని గమనిస్తే నాయర్ మీద ఎవరో కోపంతో, పగతో పక్కా ప్లానింగ్ తో హత్య చేసినట్లు అనిపిస్తోంది సార్.. అలాగే మనకి క్లూస్ కూడా దొరక్కుండా హంతకుడు జాగ్రత్తపడ్డాడంటే ఇతను ప్రొఫెషనల్ కిల్లర్ అయి వుంటాడు. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మర్డర్ చేసేంతగా నాయర్ ఏం చేశాడు. నాయర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఒకవేళ నాయర్ కి పాల్ ఘాట్ లో గొడవలు వుంటే ఇన్నిసంవత్సరాలు వెయిట్ చేసి మాటేసి చంపాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే నాయర్ ప్రతి సంవత్సరం తన సొంత వూరికి వెళ్ళి వస్తుంటాడు. అక్కడ అతన్ని మర్డర్ చెయ్యని వారు ఇక్కడ మర్డర్ చేయాల్సిన అవసరం ఏంటి? ’’ ఇలా రాములు సిఐతో అంటున్నాడు.

‘‘ నాయర్ కి అక్కడ ఎవరితోనూ గొడవలు లేవు.. అంటే ఇక్కడ వుండి వుండాలి.. నాయర్ ఆరు నెలల క్రితం ఒక ఇల్లు కొన్నాడు. మరే ఆస్తులు అతని పేరుమీద లేవు. ఆ ఇంటి విషయంలో ఎవరికైనా గొడవలున్నాయా? ఆ ఇల్లు అమ్మిన వాళ్ళని, నాయర్ కి ఆ ఇల్లు బేరం చేసి పెట్టిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ నీ అందరినీ ఇంటరాగేట్ చేస్తే నాయర్ హత్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావచ్చు..’’ అన్నాడు సీతారాంనాయక్.

దస్తగిరి ఊపిరి పీల్చుకున్నాడు.

‌--------

అనుకున్నట్లుగా ఎస్సై, సిఐ ఇద్దరూ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లనీ, ఇల్లు అమ్మిన వాళ్ళనీ ఎంక్వైరీ చేశారు. అయితే ఎవరు చెప్పినా నాయర్ కి అందరూ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంటి పరంగా ఎటువంటి ఘర్షణలు కానీ, బేరసారాలు కానీ జరగలేదు. చెప్పిన రేటుకే నాయర్ కొనేశాడు. అనుకున్న కమీషన్ బేరం చెయ్యకుండా ఇచ్చేశాడు. దీంతో నాయర్ హత్య ఆస్తికి సంబంధించింది కాదు. మరి ఏంటి? కుటుంబ కలహాల నేపధ్యం అయితే కాదు. ఇలా సిఐ, ఎస్సై ఆలోచిస్తున్నారు. కాసేపటికి రాములుని తీసుకొని సీతారాం నాయక్ జీబులో బయల్దేరాడు. అయితే దస్తగిరిని వారు ఎవైడ్ చేశారు. దీంతో దస్తగిరికి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. పై అధికారులు ఏదో పెద్ద ఎత్తు వేస్తున్నారనీ, అదేంటో తెలుసుకోవాలనే ఆరాటం దస్తగిరిలో ఎక్కువైంది. అంతే వారికి తెలీకుండానే దస్తగిరి సీక్రెట్ గా బైక్ పై వారిని ఫాలో అయ్యాడు. జీబులో వెళ్తూ.. సిఐ...

‘‘ ఇలా చూడు.. మనిద్దరమే ఈ కేసుని సాల్వ్ చెయ్యాలి. ఏ ఒక్క కానిస్టేబుల్ హెల్ప్ తీసుకోటానికి వీల్లేదు. నువ్వే నాయర్ ఇంటి మీద ఒక కన్నేసి వుంచు.. నాకెందుకో నాయర్ భార్య మీద, కూతురిమీదా అనుమానం గా వుంది. ఎందుకంటే హత్య జరిగే సమయంలో పెద్ద ఎత్తున మిరపకాయల కోరు రావటం, అదే సమయంలో నాయర్ హత్యకు గురవ్వటం, హత్య చేసిన వ్యక్తి ఆధారాలు దొరక్కుండా చెయ్యటం.. ఇదంతా చూస్తుంటే నాయర్ భార్య కుట్టి ప్రధాన పాత్ర పోషించినట్లు నాకు అనుమానంగా వుంది. ఆమెకి మన డిపార్ట్ మెంట్ లోనే ఎవరో సహకరించినట్లుగా తెలుస్తోంది. ’’ అన్నాడు దీర్ఘంగా..

‘‘ యూ ఆర్ జీనియస్ సార్.. ’’ అన్నాడు ఆశ్చర్యంగా..

‘‘ అప్పుడే జీనియస్ అనకు.. నేను కేసుని ఇంకా సాల్వ్ చేశాను.. నేరస్తుడ్ని కూడా కనిపెట్టాను. ఎక్కువ శాతం హత్య, దొంగతన కేసుల్లో  అటెండ్ అయ్యి, క్లూస్ టీంతో ట్రావెల్ చేసి, వాళ్ళ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేసిన వ్యక్తి మన స్టేషన్ లో ఎవరున్నారో.. వాళ్ళే.. ఈ హత్య చేసింది. ’’

‘‘ ఎవరు సార్.. అది?’’ అన్నాడు మరింత ఉత్సాహంగా ఎస్సై.

‘‘దస్తగిరి’’

వాట్ దస్తగిరా..? మనతోనే వుంటూ ఇవన్నీ చేశాడంటే నమ్మలేక పోతున్నాను సార్.. అన్నాడు ఆశ్చర్యంగా..

సిఐ నవ్వేశాడు... ‘‘అవును దస్తగిరే.. అతను మనం కేసుగురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు. అలాగే మనకి టీ ఇచ్చేటప్పుడు చేతులు వణకటం.. అతని చూపులు అనుమానాస్పదంగా వుండటం వంటివి గమనించాను. ఇప్పుడు కూడా అతను మనల్ని ఫాలో అవ్వటం ఈ మిర్రర్ లోంచి గమనించాను.’’

ఎస్సై మిర్రర్ లోంచి చూశాడు.. దస్తగిరి వెహికల్ కొంత దూరంలో ఆగిపోయి వుండటాన్ని గమనించాడు. వెంటనే దిగబోతున్న ఎస్సైని సిఐ నాయక్ ఆపాడు..

ఎందుకుసార్.. వెంటనే దస్తగిరిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటాను.. అన్నాడు ఎస్సై..

బండి వెనక్కి తిప్పు.. దస్తగిరికి అనుమానం రాకుండా అతన్ని స్టేషన్ కి పనుందని రమ్మని చెప్పు. అప్పుడు మనం అతన్ని ఎంక్వైరీ చేద్దాం. అన్నాడు సిఐ..

దానికి ఎస్సై రాములు నవ్వేస్తూ.. అలాగే అని స్టేషన్ కి బండిని తిప్పేశాడు.

రాములు దస్తగిరికి ఫోన్ చేసి... ‘‘ దస్తగిరి ఎక్కడున్నావ్.. ఎస్పీ ఆఫీసుకెళ్ళాలి.. జీబు తియ్యాలి.. వెంటనే స్టేషన్ కి రా..’’ అన్నాడు.

దానికి దస్తగిరి ఊపిరి తీసుకుంటూ... ‘‘ అలాగే సార్.. స్టేషన్ కి దగ్గరలోనే వున్నాను.. వచ్చేస్తున్నాను..’’ అంటూ వేగంగా బండిని స్టేషన్ వైపుకు పోనించాడు..

---------

ఇంటరాగేషన్ రూం లో... దస్తగిరి కుర్చీలో కూర్చున్నాడు.. ఎస్సై... రాములు ఒక వైపు కూర్చున్నాడు.. సిఐ నాయక్ అటూ ఇటూ తిరుగుతున్నాడు. కొంతమంది కానిస్టేబుల్స్ కూడా వారితో రూమ్ లో వున్నారు. సిఐ ఫైల్ స్టడీ చేస్తున్నాడు..

రాములు దస్తగిరితో...

‘‘ దస్తగిరీ.. నాయర్ ని నువ్వే హత్య చేసినట్లుగా మా దగ్గర బలమైన సాక్షాలున్నాయి. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. లేదంటే నా సంగతి నీకు తెలుసుగా..’’ అన్నాడు క్రూరంగా...

వెంటనే సిఐ కానిస్టేబుల్స్ కి సైగ చేశాడు..

కానిస్టేబుల్స్ వచ్చి రాములు చేతులకి బేడీలు తగిలించారు.. రాములు షాక్ అయ్యాడు..

సిఐ నవ్వేస్తూ.. ‘‘ హత్యచేసింది దస్తగిరి కాదు.. నువ్వు.. పది నిమిషాల క్రితం నువ్వు నాయర్ భార్య కుట్టికి ఫోన్ చేశావ్.. మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వినండి..’’ అంటూ వారి సంభాషణ వినిపించాడు..

రాములు కుట్టితో.. ‘‘ కుట్టి నువ్వేం కంగారు పడకు.. కేసు మనమీదికి రాదు. నేను ముందే చెప్పాను కదా.. కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది నేనే.. నేరం మా డ్రైవర్ దస్తగిరి మీదికి వెళ్ళింది. దస్తగిరి నేరాన్ని ఒప్పుకుంటాడు. వాడిని ఒప్పించే పూచీ నాది. ఒప్పుకోక పోతే నాస్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తాను. వాడే ఒప్పకుంటాడు.. తర్వాత మనిద్దరం మన కూతురు మీనాక్షితో వేరే ఊరికి వెళ్ళిపోదాం.. ’’ అని వుంది..

రాములు షాక్ అయ్యాడు..

సిఐ చిరునవ్వు నవ్వుతూ...

ఫోరెన్సిక్ వాళ్ళకి సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డావ్... కానీ నిన్ను నేను అనుమానించనట్లు నటించటంతో నీ అంతట నువ్వే ఇలా సాక్ష్యాలు వదిలేశావ్.. ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యావ్..? నువ్వు చేసిన ప్రతి పనికీ దస్తగిరి సాక్ష్యం ఇచ్చాడు.. తన పేరు ఎక్కడ బయటికి వస్తుందో, వస్తే నువ్వు అతన్నీ, అతని కుటుంబాన్నీ ఏం చేస్తావో అని భయపడి దస్తగిరి వణికి పోయాడు. ఒకరోజు నాకు జరిగిందంతాచెప్పాడు... దాంతో అసలు దొంగ మనింట్లోనే వున్నాడని అర్థమైంది. అందుకే నేను వల విసిరాను.. నువ్వు దొరికి పోయావ్..

అన్నాడు...

దాంతో ఏం చెయ్యలేక రాములు తల వంచుకున్నాడు.. జరిగింది మొత్తం రాములు చెప్పేశాడు..

‘‘ సార్.. మీరు అన్నట్లు నేరస్తుడ్ని నేనే.. నాయర్ భార్యతో నాకు ఎఫైర్ వుంది. నాయర్ బిడ్డగా చెలామణి అవుతున్న మీనాక్షి నావల్ల పుట్టిందే. చాలా రోజులు గుట్టుగా వున్న మా ఎఫైర్  నాయర్ దాన్ని గమనించాడు. నన్ను వార్న్ చేశాడు. ఒక టీ కొట్టోడు నాకు వార్నింగ్ ఇవ్వటంతో తట్టుకోలేక పోయాను. నా ముందే తన భార్య కుట్టిని కొట్టాడు. ఇంకోసారి రిపీట్ అయితే కుట్టిని చంపి తనూ ఛస్తానని బెదిరించాడు. ఎప్పటికైనా నాయర్ బ్రతికివుంటే నాకూ, కుట్టికి డేంజర్ అని అనుకున్నాను. ’’

నువ్వే నేరం చేశావని నాకు అనుమానం మొదటి రోజే వచ్చింది. కుక్కలు కాలువ దాకా వెళ్ళి ఆగిపోయాయి.. చాలా సేపు అక్కడే తచ్చాడాయి. మర్డర్ జరిగింది. కానీ హత్యాయుధం లేదు. అంటే ఆయుధం అక్కడే ఎక్కడో వుండాలని నేను అనుకున్నాను. కేసుని ఎన్నో రకాలుగా రకరకాల యాంగిల్స్ లో సాల్వ్ చెయ్యటానికి ట్రై చేశాను. అప్పుడే నాకు దొంగ మన డిపార్ట్ మెంట్ లో వున్నాడేమో అన్న చిన్న అనుమానం వచ్చింది. అంతే మన స్టేషన్ సిసిటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. నీ షూస్ కి బురద అంటుకొని వుంది. రెండు నెలలుగా వానలు లేని ఊర్లో నీ షూ కి బురద ఎలా అంటుకుందని అనుమానం వచ్చింది. ఆలోచించాను.. అసలు విషయమంతా కాలువలోనే వుందని అర్థమైంది. వెంటనే కాలువలో దిగి హత్యాయుధం కోసం వెతికాను.. అప్పుడు దొరికింది.. అయితే ఆయుధం మీద ఫింగర్ ప్రింట్స్ లేకుండా జాగ్రత్త పడ్డావు కానీ.. నువ్వు ఆయుధాన్ని కాలువలో వేసి నీ ఎడమకాలితో దాన్ని బురదలోకి తొక్కేశావు. ఆ సమయంలో నీ షూ మార్క్స్ ఆయుధంమీద పడ్డాయి. పైగా కత్తిని నువ్వు బురదలోకి తొక్కే సమయంలో కత్తి నీ షూ సోల్ ని కొంతమేర కట్ చేసింది. ఆరోజు నీ ఎడమ కాలి షూ సోల్ కొంతమేర ఊడిపోయి వేలాడుతూ కనిపించింది. మరుసటి రోజు నువ్వు స్టేషన్ కి టైంకి రాకపోవటంతో దస్తగిరికి జీబ్ ఇచ్చి పంపాను. దస్తగిరి, నువ్వు ఇద్దరూ కూడా ఆలస్యంగా వచ్చారు. ఏంటని దస్తగిరిని అడిగితే నీ ష్యూ కుట్టించుకొని వచ్చేసరికి ఆలస్యమైందన్నాడు. నిన్న నిన్ను మీ ఇంటిదగ్గర దింపిన దస్తగిరి నన్ను మా ఇంటిదగ్గర దింపే సమయంలో జరిగిన విషయమంతా నాకు చెప్పేశాడు. నేరం నువ్వే చేసినట్లు ప్రూవ్ అయింది.

ఇందాక కూడా దస్తగిరి నేరం చేశాడు అనగానే నీ మొహంలో ఒక రకమైన పైశాచిక ఆనందం.. నీ కళ్ళల్లో నేను గమనించాను. నేరం దస్తగిరి మీదికి పోయిందన్న ధీమాతో ఇంటరాగేషన్ రూమ్ లోకి వచ్చావు.. లేక పోతే తప్పించుకొని వెళ్ళే వాడివే కదా.. నీమీద నాకు అనుమానం లేదని నిన్ను నమ్మించి నిజం రాబట్టటానికే ఇదంతా చేశాను. నువ్వు దొరికి పోయావ్ మిస్టర్ రాములు.. అన్నాడు సిఐ నాయక్..

రాములు మౌనంగా తల వంచుకున్నాడు..

నేరానికి సహకరించినందుకు కుట్టిని కూడా అరెస్ట్ చేశారు.

కోర్టు రాములికి, కుట్టికి రిమాండ్ విధించింది..

కేసుకొనసాగుతోంది...

చదువుకోవాల్సిన మీనాక్షి పొట్టకూటికోసం తండ్రి ఇచ్చిన హోటల్ ని నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తోంది..

----------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి