నవ్య బాట
వాడపల్లి పూర్ణకామేశ్వరి
కోడంబాకమ్,తమిళనాడు
సెల్ : 8056024790
“అదేంటి వల్లీ అలా అంటావు! ఇప్పుడు మనకు జరిగిన లోటేంటి? మనం పస్తులుండి వాళ్ళని పోషించట్లేదుగా? ఆసరా కావలసిన కుటుంబం. చదువుకోవలసిన పిల్లలు.
ఆమాత్రం సాయం చేస్తే తప్పులేదుగా?” అనునయంగా అన్నాడు అనంతరామ్.
“తప్పా, తప్పున్నరా! ఇలా దానధర్మాలు చేసుకుంటూ పొయి, అందరి అవసరాలనూ తీరుస్తుంటే, పస్తులుండాల్సిన రోజులు రేపు మనకొస్తాయి!! మనకీ నలుగురు పిల్లలు. ఆ సంగతి గుర్తుంచుకుంటే
మంచిది” పుల్లవిరుపుగా అంది సుందరవల్లి.
“దానధర్మాలన్నది చాలా పెద్ద మాట వల్లీ. ఐన వాళ్ళనాదుకోవడాన్ని దానంతో
ముడిపెడితే ఎలా? నా మటుకు నాకది మన
బాధ్యతే అనిపిస్తుంది. అక్కయ్య కుటుంబానికి సహాయపడడం ధర్మమెలా అవుతుంది,
బాధ్యతగానీ!” అన్నాడు అనంతరామ్.
“అన్నీ మీరే నిర్ణయించేసుకున్నాకా ఇక నన్నడగడం దేనికీ? మీ ఇష్టమొచ్చినట్టు కానివ్వండి” విరుచుకుపడింది.
చెవిటివాడిచెవిలో
శంఖం ఊదినట్టైయ్యింది అనంత్ పరిస్థితి. ఎంత నచ్చచెప్పినా అర్ధం చేసుకోలేక పోయింది
సుందరవల్లి. సిరిసంపదల్లో పెరిగిన
ఆమెకెన్నడూ అట్టి అవసరం కలుగలేదు. ఐదువేళ్ళూ నోట్లోకి వెళ్లడం గురించి ఆలోచించడమంటేనే
తెలియని జీవితం. ఆకలిబాధ కానీ, అయినవాళ్ళ అండదండలకోసం ఆర్తితో వేచిచూడడం వంటివికానీ తెలియని జీవితం. అలాంటి పరిస్థితులను
ఎదుర్కునే అవసరం రాకపోవడం ఆమె తప్పుకాకపోవచ్చునుకానీ అనుభవిస్తే గానీ బాధను తెలుసుకోలేకపోవడం
దురదృష్టకరమనిపించింది అనంతరామానికి. ఐతే సున్నితంగా చెప్పడమేకానీ వారించడం తెలియని అతడు రుసరుసలాడుతున్న ఆమెను ఎదిరించే
సాహసంచేయలేకపోయాడు. బాల్యం నుంచీ సద్దుకుపోవడమే అలవాటు చేసుకోవలసిన పరిస్థితిల్లో
అతను పెరిగాడు. తీపిగురుతులని చెప్పుకోవడానికి అమ్మ లాలనగా చెప్పిన నాలుగుముక్కలే
తప్ప చిన్ననాటి జీవితం మరే మధురజ్ఞాపకాలనూ ఇవ్వలేదు అనంతుకి.
*****
“అనంతూ, నువ్వు బాగా చదువుకుని ఎంతో గొప్పవాడివవ్వాలి.
చదువుకునే అవకాశమే లేని ఈఊళ్ళో పిల్లలందరూ చదువుకునే అవకాశం నువ్వే కల్పించాలి.
పెద్దవాడివైయ్యాకా ఆ పని చేస్తావుగా?” ఏడేళ్ల అనంతుతో అంది తల్లి పద్మావతి. రోజూ అనంతుని బడికి
పంపుతూ పద్మావతి మురిపెంగా అనే మాటలే అవి.
“నేనానాడు చదువుకోలేదు. అక్కయ్యను చదివించాలన్న ఆశ తీరలేదు. నువ్వే నా కలలను
సార్థకంచేయాలి” అంటున్న అమ్మ
మాటలు అనంత్ మనస్సులో బలంగా నాటుకుపోయాయి.
అక్షరాలను
గుర్తించడం వరకే నేర్చుకున్న పద్మావతికి చదువంటే ప్రాణం. చదువుకోవాలనున్నా
బడిసదుపాయంలేని గ్రామంలో పెరగడం. దూరాలు పంపించి ఆడపిల్లకు చదులెందుకన్న పోకడలో
ఉన్న కుటుంబంలో పెరగడంతో అవకాశంలేకపోయింది.
చదువు విలువ తెలిసినా పొందలేని నిస్సహాయ స్థితి. అంచేత తన పిల్లల్ని మాత్రం
ఉన్నతమైన చదువులు చదివించాలని దృఢంగా నిశ్చయించుకుంది. పద్మావతికి తొలిచూరు
ఆడపిల్ల పుట్టింది. ఆశకనుగుణంగా కూతురికి చదువులతల్లి పేరే పెట్టుకుంది. శారద
పుట్టేనాటికి పద్మావతికి పట్టుమని పదహారేళ్ళైనా నిండలేదు. చిన్నతనంవల్ల అత్తారింట్లో
తనపంతం నెగ్గించుకునే స్వాతంత్ర్యంలేకపోయింది. పేరైతే శారదని పెట్టిందే కానీ, చాలీచాలని కుటుంబ నేపధ్యంతో ఛాందసవాదులైన కుటుంబ
సభ్యులతో పోరాడి శారదను ఆట్టే చదివించలేక పోయింది. సంప్రదాయమంటూ శారదకూ పన్నెండో
ఏటనుంచే సంబంధాలు చూడడంమొదలెట్టారు. తగిన సంబంధం కుదరగానే కట్టపెట్టడం, కాపురానికి
పంపడం జరిగిపోయాయి. అక్కయ్య పెళ్లి నాటికి అనంతుకు ఎనిమిదో ఏడు.
అనంతుని మాత్రం
ఎట్టిపరిస్థతిలోనూ ఉన్నతచదువులు చదివించే తీరాలన్న ఆశ పద్మావతిలో రోజురోజుకూ బలపడింది.
గొప్పచదువులు చదివించాలన్న కోరికతో తనకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేసింది. తోటికోడళ్ళంతా
వెంకన్న మొక్కుకి హుండీలో కాసులు దాస్తుంటే, పద్మావతి మాత్రం భర్త దగ్గర నుంచి రోజుకొక్కరూపైయైనా
అడిగి అనంతు చదువుకోసం హుండీలో వేసేది. ప్రతి జిల్లాలో గ్రామానికి రెండుచప్పునైనా పాఠశాలలుండాలని,
అట్టి పదవిని తన కొడుకు చేపట్టాలని కలలుకంది. వేలలో విద్యాలయాలు పెట్టించేంత స్థాయికి
తన కొడుకు ఎదగాలనుకుంది. అందరూ మెచ్చుకునేంత గొప్పవాడిగా అనంతుని తయారుచేయాలని
సంకల్పించుకుంది.
పద్మావతి ఆలోచనలకు
పూర్తి భిన్నంగా ఉండేవి భర్త పద్మనాభం పోకడలు. గాల్లో దీపంపెట్టి అన్నీ ఆ దైవమే
చూసుకుంటాడన్నట్టు ఉండేదతని ధోరణి. గురువులంటూ స్వాములంటూ బైరాగుల చుట్టూ తిరగడం.
స్వశక్తిపై కాక మంత్రతంత్రాలపై ఆధారపడడం, కష్టపడకుండా లబ్దిపొందాలనుకోవడం పద్మనాభం
ధోరణి. ఊళ్ళోకి వచ్చిన ఏ స్వాములారినీ విడవకుండా సమయాన్నంతా అక్కడే వెళ్ళబుచ్చడం పద్మనాభం
దినచర్యగా మారడం ఆమెను బాధించేది. అది సోమరితనమో, స్వశక్తితో తనకంటూలేని గుర్తింపుకై సంక్షోభమో
తెలియదు. బాధ్యతారహితంగా ఉండడమే అతడి ప్రవృత్తైంది. స్వయంకృషితో కుటుంబాన్ని
తీర్చిదిద్దుకోవడమే కర్తవ్యమని పద్మావతి పలువిధాలనచ్చచెప్పినా ఫలితం కనబడలేదు. నిరాశచెందినా,
పట్టువిడవక అనంతు చదువుకై తన కృషి చేయసాగింది.
*****
“అయ్యో రామా! చూసావుటే పద్మా, అనుకున్నంత పనీ అయ్యింది! ఆ బైరాగులతో కలిసి ఊరొదిలి వెళ్ళిపోయాడుట మన పద్మనాభం! నేను నెత్తీనోరు కొట్టుకు చెపుతూనే ఉన్నానా? వాడ్ని కాస్త కొంగునకట్టి చెప్పుచేతల్లో పెట్టుకోవే
అని. ఆయనే మారతారులే అత్తయ్యా అని చెప్తూ సద్దుకొచ్చావు గానీ నా మాట విన్నావు కాదు! ఇప్పుడు చూడు. వాడు మన కొంపముంచాడు” వాబోయింది పద్మావతి
అత్తగారు.
ఇల్లూ, సంసారం
పట్టకుండా ఊళ్ళుపట్టుకుపోయాడని బాధపడేది. ఎంతో గారంగా పెంచిన కొడుకు మీద బెంగతో పట్టుమని
ఆర్నెల్లైనా అవ్వకుండా కన్నుమూసింది. తమ్ముడి బాధ్యతలు తమ నెత్తిన పడతాయని అంతవరకూ
ఉమ్మడిగా ఉన్న పెద్దకొడుకు, చిన్నకొడుకు తల్లి కన్నుమూతతో వేర్పడ్డారు.
వీధి గుమ్మం ఎరుగని
పద్మావతికి బతుకెలా వెళ్లబుచ్చాలో తెలియని అయోమయంలో పడింది. జీవితం ఒక్కసారిగా శూన్యమయ్యింది. తన గురించికానీ, అనంతు గురించికానీ పట్టించుకోకుండా భర్త ఇంత పని ఎలా చేయగలిగాడోనని
తలచుకుని కుమిలిపోయింది. అనంతుని గొప్పగా చదివించాలన్న ఆశలన్నీ ఒక్కసారిగా
అడియాశలైయ్యాయి. జీవితం అగమ్యగోచరంగా మారింది. అనుకోని సంఘటనలతో తలెత్తిన క్లిష్టపరిస్థితులు
కొంతైతే చీకట్లు కమ్ముకున్న
ఒంటరితనం మరింత వేధించాయి. జీవితం అగాధంలోకి పడిపోయినట్టైంది. ఆ దెబ్బనుండి
తేరుకోలేక పోయింది. కమ్మినచీకట్లు పద్మావతిని అమాంతం కబళించేసి మృత్యువు పాల్చేసాయి. పట్టుమని
తొమ్మిదేళ్ళు నిండని అనంతు తల్లినీ పోగొట్టుకుని ఒంటరి వాడయ్యాడు.
“ఈ దరిద్రాన్ని ఎన్నాళ్ళు మన నెత్తిన పెట్టుకుని
భరిస్తాము?” పెద్దమ్మ మాటలు
చిన్ని మనసుని గాయపరిచాయి.
పెదనాన్న,
పినతండ్రి కొన్నాళ్ళు ఆదరించి చూసారు. అనంతుని ఎప్పటికీ పోషించేందుకు వారివారి
కుటుంబ సమస్యలు ఒప్పలేదు. వంతులుగానైనా అనంతును పంచుకోవడంలో వారు విఫలమైయ్యారు.
నెల్లూరుకు సమీపంలోనున్న మద్రాసులోని రామకృష్ణ మిషనువారి ఉచిత బాలల రెసిడెన్ళియల్ పాఠశాలలో
చేర్చారు. వాడికోదారి చూపించి చేతులు కడుక్కున్నారు.
తల్లి లేక, తండ్రి ఉండీ అనాధయ్యాడు అనంత్. గొప్పవాడివై పాఠశాలలు
పెట్టాలని అమ్మ అన్న మాటలు మాత్రం పదేపదే గుర్తొచ్చేవి. ఇల్లు కంటే గుడి పదిలమన్నట్టు, పెద్దమ్మల మాటలు
పడడంకంటే ఆ రెసిడెన్షియల్ పాఠశాలే బాగుందనిపించింది. మనసులో ఎప్పుడూ అమ్మమాటలనే
మననం చేసుకునేవాడు. కానీ ఆ చిన్నిప్రాణానికి అంతటి బృహత్కార్యాన్ని సాధించే మూర్గంచూపే
నాధుడే లేకపోయాడు. నడిసంద్రంలో నావైంది బ్రతుకు.
“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహాపురుషులవుతారు” అన్నాడో
గొప్పకవి. అనంతు, నీవు ఒంటరివని, ఓడినవాడివని ఎన్నడూ అనుకోకూడదు. మనిషికి
ఊపిరున్నంతవరకూ సాధించలేనిదేదీ ఉండదు. ధైర్యంగా ఉండి లక్ష్యాన్ని సాధించు” అంటూ
అర్జునుడికి గీతోపదేశంలో చెప్పినట్టుగా బోధించారు మాధవ గారు.
అమ్మ
కలలు అడియాశలు కాలేదు. తానురాలేక భగవంతుడు మానుషరుపేణా వస్తాడనట్టే జరిగింది.
చీకటి నిండిన అతని జీవితానికి మిణుకుమిణుకుమంటూ ఓ చిరుదీపం దారిని చూపించింది.
మాధవగారు అనంతుకి మార్గదర్శి
అయ్యారు. రామకృష్ణా విద్యాలయంలో ప్రధానోపాధ్యాయులు మాధవగారు. అనంతుకి అన్నివేళలా
అండగా నిలువసాగారు. వారి ప్రోత్సాహంతో అనంతు జీవితం ఒక గాడిలో పడ్డట్టైయ్యింది.
ఫస్టఫామ్ లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైన అనంతుపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు
మాధవగారు. అప్పటినుంచి వెనక్కితిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు అనంతుకి.
*****
“కాన్వకేషను పండుగకు మద్రాస్ విశ్వవిద్యాలయమంతా కొత్తపెళ్ళికూతురిలా
ముస్తాబై ఉంది. పట్టాలందుకుంటున్న విద్యార్థులందరూ ఆనందోత్సాహాలతో ఉండగా పండుగ హడావుడి
క్యాంపసును శోభాయమానంగా చేసింది. పట్టాలందుకోనున్న విశ్వవిద్యాలయం వైస్-ఛాన్స్లరు విద్యార్థులను
ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థదశలో ఏళ్ళ దీక్షా-కృషి ఫలితమే నాటి పండుగ
పర్వదినమని వారిని మనస్పూర్తిగా అభినందించారు. సమాజంపట్ల విద్యార్థులకున్న బాధ్యతను
గుర్తుచేసారు. ఖగోళశాస్త్రంలో మొదటి ర్యాంకును పొందిన అనంతు ఎమ్.ఫిల్.పట్టాను
అందుకున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న మాధవగారి మాటను సార్ధకం చేసాడు.
అమ్మ కలలకు అతిచేరువ కాబోతున్న అనంతు అనేక ప్రభుత్వోద్యోగాలకు
దరఖాస్తులు పెట్టుకున్నాడు. తన ఎమ్.ఫిల్ ధీసీస్ కు లభించిన లబ్దప్రతిష్టుల ఫ్రశంసల
కారణంగా ప్రభుత్వ ప్రత్యేకంగా తన కృషిని గుర్తించి ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం
బాధ్యతను అప్పగించింది. ఆసక్తికరమైన పాఠ్యాంశాలతో వెలికివచ్చిన పాఠ్యపుస్తకం
విద్యావేత్తల మన్ననలనందుకుంది. ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకంగా దాన్ని
ప్రవేశపెట్టారు. ఏడాది తిరగకుండా ఆ పుస్తకం ద్వారా విద్యార్థులలో వచ్చిన మార్పు
దృష్ట్యా స్వచ్ఛంద విద్యా సంస్థల అధినేతలు వారి విద్యాసంస్థలకూ అనేక తరగతులకు
పాఠ్యపుస్తకాలను ప్రచురించే బాధ్యతను అనంతుపై ఉంచారు. అనేక రాష్ట్రాలలో సిఫార్సు
చేయబడింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలనుండి వివిధ తరగతులకు పాఠ్యపుస్తకాలనందించమని
అభ్యర్థనలు వచ్చాయి.
రాష్ట్రప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో అసిస్టెంట్
ఆఫీసర్ పదవిని చేపట్టాడు అనంతరామ్. అమ్మ ఆశీర్వాదంతో విద్యారంగంలోనే వృత్తి
చేపట్టినందుకు ఎంతో ఆనందించాడు. పదవి చేపట్టిన తొలిరోజు నుంచే విద్యారంగంలో తాను
చేయవలసిన కృషిని అడుగడుగునా సమీక్షించుకుంటూ, లోపించిన
సదుపాయాలనూ పరిశీలిస్తూ ప్రతి జిల్లాకూ అందవలసిన సదుపాయాలు అందేలా ఆదేశాలిస్తూ కొనసాగాడు. తాను
విశ్లేషించిన అనేక అంశాలను నిర్బయంగా ప్రభుత్వం ముందుంచుతూ, అవసరమైన
ప్రతిపాదనలు చేసాడు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పదవులను
భర్తీ చేయడంలో అర్హులైన ఎందరో అభ్యర్ధుల నియామకానికి సహాయ పడ్డాడు. అలా యావత్విద్యారంగంలో
తనదైన ఒక ముద్ర వేసాడు అనంతరామ్.
అర్హత కలిగి నియామకం జరిగి
అధ్యాపకులుగా స్థిరపడి అనంతు కృషిఫలితంగా లబ్దిపొందిన వారిలో ఒకడే రఘురామ్. అనతి
కాలంలోనే అనంతరామ్ రఘురామ్ లు మంచి స్నేహితులైయ్యారు. రఘు చెల్లెలే సుందరవల్లి. ఆదర్శవిలువలున్న
అనంత్ సన్మార్గంలో ఉన్నతస్ధాయికి ఎదగగల సమర్థుడని గ్రహించిన రఘురామ్ అనంతును తన
కుటుంబానికి పరిచయం చేసి చెల్లెలిని ఇచ్చిపెళ్ళి చేసాడు. అనంతుకు నలుగురు పిల్లలు
కలిగారు. అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు.
చదువించకుండా పెళ్ళిచేసేసిన అక్కయ్య పిల్లలు కూడా ఉన్నతవిద్యలకు ఎన్నడూ
వెనకాడకూడదని ఆకాంక్షస్తూ సుందరవల్లి నిరసననూ భరిస్తూ వారికి సహాయ పడుతూ వచ్చాడు.
అక్క పిల్లలు తన బాధ్యత అనే అనుకున్నాడు.
అంచలంచలుగా ఎదుగుతూ తమిళనాడు ప్రభుత్వంలోని కాలేజీ ఎడ్యుకేషన్
శాఖ డైరెక్టరుగా పదోన్నతిని పొందాడు. అనాధగా రామకృష్ణ పాఠశాలలో ఆరంభించిన పయనంలో
డైరెక్టరు పదవినలంకరించిన స్ధాయికి భగవంతుడు తీసుకొచ్చినందుకు అన్యధా శరణం నాస్తి
అని అనంతరామ్ ఎప్పుడూ కృతజ్ఞతగా మసలుకుంటూ తన విజయాన్ని సహాయం పేరిట నలుగురితో
పంచుకున్నాడు.
తమిళనాడు ఉన్నత విద్యావ్యవస్థలోనూ
తనదైన ఒక ముద్రను వేయాలనుకున్నాడు. కళాశాలల కొరత వల్ల ఉన్నతవిద్యను పొందలేని
ఎందరికో చదువుకునే అవకాశం కల్పించాలని నిశ్చయించుకున్నాడు. అనేక జిల్లాల్లో అనేక
సమస్యలనెదుర్కొంటున్న విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ‘అందరికీ విద్య
అందుబాట్లో విద్య’ అన్న నినాదంతో ప్రతి జిల్లానూ
పర్యవేక్షిస్తూ డిగ్రీ కళాశాలల కొరత తీవ్రంగా ఉందని గ్రహించాడు. సరిగ్గా అదే
సమయంలో కాంచీపురం జిల్లా విద్యార్థులు తమ గోడును విన్నవించుకోవడానికి అనంతరామ్
వద్దకు వచ్చారు.
“సార్, మా ఊళ్ళో
కళాశాల లేదు. ప్రతి సంవత్సరమూ ప్రభుత్వ కళాశాలలు కేటాయిస్తున్నా, పెరుగుతున్న
దరఖాస్తులకు అవి ఎంత మాత్రమూ సరిపోవడంలేదు. మీరే ఈ విషయంలో ఏదైనా చేయాలి సార్.
ఎంతో కష్టపడి చదివిన మా ఊరి అబ్బాయికి కళాశాల సీటు దొరకక ఆత్మహత్యా ప్రయత్నం
చేసుకోవడమే మమ్ములను మీ వరకూ తీసుకొచ్చింది. విద్యార్ధులమంతా ఒక సంఘంగా ఏర్పడి ఈ
అర్జీను మీకు సమర్పించుకుంటున్నాము” అభ్యర్థించాడు
విద్యార్థుల నేత ఆదర్శ్.
“ఇన్నేళ్ళ
స్వతంత్ర్య భారత చరిత్రలో చదువుకునే అవకాశం లేక యువత ప్రాణాలు విడవవలసి రావడం
దురదృష్టకరం. ఎన్నడూ ఇట్టి పరిస్ధితి మరో విద్యార్థికి రాకుండా చేయవలసిన బాధ్యత
మాపై ఉంది. ఐతే, ఉడుకురక్తం విద్యార్థులను ఉన్నతభావాలవైపు నడిపించాలే కానీ ఆత్మహత్యవంటి
పిరికివైఖరి వైపుకు నెట్టకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూవమీధైర్యాన్ని మీరెన్నడూ
వీడకూడదు. మీకు నేను హామీ ఇస్తున్నాను, అందరికీ చదువుకునే అవకాశం అందుకు
కావలసినన్ని కళాశాలలను స్థాపిస్తాం” అంటూ భరోసా
ఇచ్చాడు. ఆశతో వెనుదిరిగారు కాంచీపురం విద్యార్థులు.
తమిళనాడు ముఖ్యమంత్రిగారికి తన సదీర్ఘ ప్రతిపాదనను
సమర్పించుకున్నాడు అనంతరామ్.
“ఆర్యా, పెరుగుతున్న విద్యావసరాలకు ప్రస్తుతం
ఉన్న ప్రభుత్వ కళాశాలలు అతితక్కువ. ఏటా నిధుల కేటాయిపు ద్వారా వస్తున్న కళాశాలల
సంఖ్యకూడా ఉన్న అవసరానికి సరిపడడంలేదు. అందువల్ల ఆసక్తిగల విద్యార్థులందరికీ ఉన్నత
విద్యలనభ్యసించేందుకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వేతర కళాశాలలను అనుమతించాలని
సిఫార్సు చేయబడుచున్నది. ఈ మేరకు నా వర్క్-స్టడీ నివేదికను సమర్పిస్తున్నాను” అంటూ నలభై
పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించాడు.
అనతికాలంలోనే రాష్ట్ర నలుమూలలా స్వచ్ఛంద సంస్థలద్వారా
అనేక ప్రభుత్వేతర కళాశాలలు స్థాపించబడి ఉన్నతవిద్యాకాంక్షులైన విద్యార్థులకు
విద్యావకాశాలు కల్పించాయి. తన తపస్సు ఫలించిందని అనంతరామ్ ఎంతో సంతోషపడ్డాడు.
*****
“వల్లీ, ఈరోజు
నాకు చాలా తృప్తిగా ఉంది. చదువుకోలేదన్న బాధతోనే మా అమ్మ వెళ్లిపోయింది. అక్కయ్యను
చదివించాలని అమ్మ ఎంతగానో తాపత్రయపడింది. కుదరలేదు. ఎందరి చదువుకో పునాదిబాటను వేయగల
ఉన్నతస్థానంలో నన్నుచూడాలని అమ్మ అహర్నిశలూ కలలు కనేది. పెద్దమ్మలు వెంకన్నకు
ముడుపుకట్టి హుండీలో దాచుకుంటే అమ్మ మాత్రం నా చదువుకోసం దాచేది. అమ్మ దాచిన ఆ
ధనాన్ని తను చదివించలేకపోయిన అక్కయ్య పిల్లల చదువులకోసం సద్వినియోగపరిచామని
తెలిస్తే ఏలోకంలో ఉన్నా అమ్మ ఆనందిస్తుంది. నా జీవితం ఇప్పుడు సాఫల్యమైంది. పైకెళ్ళి
అమ్మా నీకోరిక తీర్చగలిగానమ్మా అని చెప్పేందుకు అర్హుడనైయ్యాను”
పడక్కుర్చీలో వాలి తృప్తిగా శ్వాసను తీసుకుంటూ మనసులో అనుకున్నాడు అనంతరామ్.
“ఏవండీ, ఏవండీ! బల్లమీద
ఇందాకనగా పెట్టిన కాఫీ ఇంకా అలాగే ఉంది. చల్లారిపోయిందో ఏవిఁటో? మళ్ళీ నిద్ర
పట్టేసిందా?” అనంతు
గుండెలమీదనునన వార్తాపత్రికను తీస్తూ అంది సుందరవల్లి. మాటా పలుకూ లేదు. పది నిముషాలకు ముందే దంతధావనం
చేసుకుని వార్తాపత్రిక చదువుతూ ఉన్నవాడు అంతలోనే అలా!
“హరీ!!
నాన్నగారూ....” పెద్ద కేక పెట్టింది
సుందరవల్లి. ఆపై ఆమె నోట మాట పెకలలేదు.
ఉలుకూపలుకూ
లేని అనంతరామ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
“ఐ ఆమ్ సారీ
మిస్టర్ హరీ. హీ ఈజ్ నో మోర్” ఆతృతగా చూస్తున్న హరితో డాక్టరు
చెప్పాడు. ఆ మాటను జీర్ణించుకోవడానికి హరికి చాలాసేపే పట్టింది.
నిన్నటికి నిన్న జీవితమే
సాఫల్యమైందని ఎంతో తృప్తిగా కనిపించారు. అంతలోనే! ‘నాన్న ఒక
వ్యక్తా ఒక వ్యవస్థా’ అన్న ఆలోచనలు హరి మనసును
చుట్టేసాయి. బాధను దిగమింగుకున్నాడు. భౌతికంగా లేని నాన్న సంస్థలుగా, పుస్తకాలుగా
ప్రతిఇంటా ఉన్నారని సంతృప్తి పడ్డాడు. అమ్మకు సద్దిచెప్పే ప్రయత్నం చేసాడు.
***
డైరెక్టరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో
కొత్తగా రాబోతున్న అధికారి ఆహ్వానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను స్వయంగా
పర్యవేశక్షిస్తున్నాడు దివాకర్. అసిస్టెంటు డైరెక్టరు పదవిని అలంకరించనుండగా పై
అధికారియైన డైరెక్టరు ఏర్పాట్లనూ పర్యవేక్షించడం సిబ్బందికి ఆశ్చర్యాన్నే
కలిగించించిది.
“నమస్తే సర్” గౌరవంగా
పలకరించింది శ్రీవిద్య.
“వెల్కమ్ మిస్
శ్రీవిద్యా. వీ ఆర్ ఆనర్డ్ టు హావ్ యూ ఇన్ అవర్ డిపార్ట్మెంట్” సాదరంగా
ఆహ్వానించాడు డైరెక్టర్ దివాకర్.
అసిస్టెంట్ డైరెక్టరుగా
శ్రీవిద్య పదవీ స్వీకారం చేసింది. అత్యంత అభిమానంగా ఆమెను ఆహ్వానిస్తూ, కరతాళ ధ్వనుల నడుమ ప్రసంగిస్తూ శ్రీవిద్య గురించి
నాలుగు మాటలు చెప్పసాగాడు డైరెక్టరు దివాకర్.
“నేనీరోజు ఇటువంటి ఉన్నత పదవిలో ఉన్నానంటే
అది వారు పెట్టిన భిక్షే. విద్యావ్యవస్థలో అనంతరామ్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మక
మార్పులకారణంగా లబ్దిపొందిన వేలాది మంది విద్యార్థులలో నేనూ ఒకడిని. అనంతరామ్ గారు
ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. వారి కుమార్తెయైన శ్రీవిద్య గారిని అధికారి పదవిని
అలంకరించేందుకు మన కార్యాలయానికి ఆహ్వానించే భాగ్యం నాకు కలగడం నా అదృష్టంగా
భావిస్తున్నాను” కన్నీటి పర్యంతమై చెప్పాడు
దివాకర్.
“అనంతరామ్ గారి కుమార్తెగా శ్రీవిద్య
పదవినలంకరించడం మనందరికీ గర్వకారణం. ఈ నేపధ్యంలో విద్యావ్యవస్థ వారిపై మరిన్ని
బాధ్యతలనుంచుతుంది. తండ్రిగారు వేసిన నవ్య బాటలో పయనిస్తూ శ్రీవిద్యగారు
విద్యారంగాన్ని ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాను. వారి ఆధ్వర్యంలో విద్యారంగం
మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” దివాకర్ ప్రసంగాన్ని ముగించకుండానే కార్యాలయమంతా కరతాళ ధ్వనులతో
మారుమ్రోగిపోయింది.
******
కథ ఫర్వాలేదు.
రిప్లయితొలగించండిమా ఇంటి పేరు కూడా వాడపల్లే. ఈ రోజుల్లో చదువుకునే అవకాశం లేక యువత ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు ఎన్నివున్నాయండీ? ప్రభుత్వాలు చాలా వరకూ నామమాత్రపు ఫీజులతో చదువు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే అక్షరాస్యతా శాతం మన దేశంలో చాలా ఎక్కువగా వుంది. అంటే ఏంటి అర్థం? అదీకాక పోటీతత్వం పెరిగిపోయిన యువత మరింతగా పోటీపడి చదువుతున్నారు. క్యాంపస్ నుండే ఇంటర్వ్యూలు అటెంట్ చేస్తున్నారు. ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఒత్తిడి తట్టుకోలేకపోవటమే. రచయిత్రిగారు కధని బానే రాశారు. కానీ విశ్లేషణ మాత్రం పక్కదారి పట్టిందనిపించింది.
రిప్లయితొలగించండితల్లి పద్మావతి చెప్పిన మాటల వలన ‘ అందరికీ అందుబాటులో విద్య ’ లక్ష్యానికి కట్టుబడి తుది వరకూ బతుకును అంకితం చేసి జీవన సాఫల్యం పొంది అనంత లోకాలకు వెళ్లిపోయిన అనంత్ రామ్ గారి ఆశయం అంతటితో అంతం కాలేదు. ఆయన వేసిన బాటను నడిచిన ఆయన కుమార్తె శ్రీవిద్య , కాలేజ్ ఎడ్యుకేషన్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేయటం తో నవ్య బాట ’ శీర్షిక కు అర్థం చేకూరింది.
రిప్లయితొలగించండిమంచి సబ్జెక్ట్ మీద కథ ఇచ్చిన రచయిత్రి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారికి అభినందనలు!