![]() |
- విద్యాధర్ మునిపల్లె |
ఆ పున్నమిచంద్రుడు తన వెండివెన్నెలతో యావత్ జగత్తుని అమృతతుల్యం చేస్తున్నా ఈ శుక్ల పక్షం నాకు కృష్ణపక్షంలా అనిపిస్తోంది ఎందుకు? వీచే ఆ చల్లని తెమ్మెరలు నా శరీరాన్ని భరించలేని వేడిమితో ముద్దాడుతున్నాయెందుకు? నిరంతరం ప్రకృతి సౌందర్యోపాసనతో కవితాలతలను ఆశువుగా పలికే నాలోని భావుకుడు నేడు సౌందర్యోపాసన చేయలేక నిస్తేజంగా నిసీధి వేళ స్మశాన నిశ్శబ్దత నిండిన మనసుతో రిక్తహస్తాలతో నిలబడి పోయాడెందుకు? మౌనాన్ని జయించి మనసుని కదిలించే కైతల మల్లెలతో తెలుగు సాహితీ సరస్వతిని నిత్యం అర్చించే ఈ కవి నేడు వైరాగ్యంతో మోడులా మిగిలిపోయాడెందుకు? జీవితమంటే ఇదేనా..? ఇంతేనా? అవును.. శుక్లపక్షశోభతో దినదిన ప్రవర్ధమానమై యావత్ ఆంధ్ర ప్రజలచే కీర్తింపబడిన ఈ కవికి నేటినుండి కృష్ణపక్షం ప్రారంభమైందేమో.. నా జీవితానికి వెలుగులద్ది, నా సహచర్యంలో నా సేవే తన పరమావధిగా భావించి, నా కవితా వస్తువే తానై, తానే నా జీవిత సర్వస్వమై, మరీ చెప్పాలంటే నేనే తానై, తానే నేనై.. ఒకరికొకరై జీవించిన మమ్ము విడదీయాలని నీకెలా అనిపించింది భగవాన్.. నీ ప్రతి చర్యకీ ఒక చర్య ముడిపడి వుంటుందని తెలుసు.. కానీ సగం చచ్చిమోడువారిన నావల్ల నీవు ఏం సందేశమివ్వదలచు కున్నావో అర్థం కావటల్లేదు ప్రభూ.. అర్ధంకావటంలేదు.. ఆ .. అర్థమైంది.. సరస శృంగార కవితలతో, కథలతో, నాటకాలతో అలరించిన ఈ కవి.. ఆధ్యాత్మిక సుమగంధాలను సాహితీలోనికి అందించేలా.. వైరాగ్యపు మాధుర్యపు మకరందాలను ఈ తెలుగునేలపై వెదజల్లేలా రచనలు చేయమని కాబోలు. అలాగే.. తప్పకుండా అలాగే చేస్తాను స్వామీ.. నీ నుండి వచ్చిన నేను నీవిచ్చిన కార్యమును నిరాటంకముగా నెరవేర్చే శక్తిని నాకు అనుగ్రహించుము తండ్రీ.. అనుగ్రహించు...
తదేకంగా ఆకాశం వంక చూస్తూ... గుండెపగిలి వస్తున్న వెచ్చటి కన్నీరు విశ్వనాధుని చెక్కిళ్ళను తాకుతూ.. రాలి నేలపై పడ్డాయి. పడిన ఆ కన్నీరు పున్నమిచంద్రుని వెలుతురులో మంచుముత్యాలై ప్రకాశిస్తున్నాయి. గుండె గోడును అనంత విశ్వానికి విన్నవించుకున్నా తగ్గని బరువు.. కాసేపటికి విశ్వనాధశాస్త్రి మౌనం... తదేకంగా ఆమెనే చూస్తున్నాడు.
1888 విజయనగరంలోని విశ్వేశ్వరాగ్రహారం
అతనికి కొంత దూరంలో నేలపై నిద్రిస్తున్నట్లు పడుకొని వుంది భ్రమరాంబ. ఆమె తలకింద దీపం పెట్టి వుంది. మరికాసేపట్లో తెల్లవారుతుంది. ఆమెని అనంతలోకాలకు సాగనంపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆమె తోబుట్టువు ముకుందుడు. బంధువులొచ్చారు. ఆవూరి జమీందారు వెంకటరాయణిం బహద్దూర్ కూడా ఈ కవిని కలిసి పరామర్శించి ఓదార్చాడు. ఎంతోమంది పురప్రముఖులు ఈ కవిని ఓదార్చారు. ఎంత మంది ఓదార్పులూ ఈ కవి హృదయాన్ని కాసింతైనా ఓదార్చలేక పోతున్నాయి. అలాగే భ్రమరాంబకు అంతిమ వీడ్కోలు పలికాడు విశ్వనాధశాస్త్రి. అప్పటి వరకూ సరసశృంగార కథలు, కవితలు, నవలలు, గేయాలు, నాటకాలు రచించిన విశ్వనాధుని నోట విరాగకవిత్వం వెలువడసాగింది. ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్యా నానాటికీ పెరిగిపోతోంది. తెలుగు సాహితీ లోకంలో ఆయన పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తున్నాయి.
*******
1889 మార్చి 28 .... అపరాహ్నకాలం...
55 సంవత్సరాల విశ్వనాధుడు పడక కుర్చీలో పడుకొని కళ్ళు రెండూ మూసుకొని తదేక ధ్యానచిత్తంతో తన కవితా ప్రవాహాన్ని ఆశువుగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆయన బావమరిది ముకుందుడు బావగారు చెప్పేదాన్ని కాగితంపై రాస్తున్నాడు.
ఆ పడక కుర్చీలో కేవలం విశ్వనాధుడు తప్ప మరెవ్వరూ కూర్చోరు. అందులో పడుకొని విశ్వనాధుడు కవితలు చెబుతుంటే ఆయన భార్య భ్రమరాంబ పక్కనే నిలబడి తాటాకు విసనకర్రతో విసరుతుంటుంది. పక్కనే మరచెంబులో మంచినీళ్ళు. దాహమైనప్పుడల్లా అందులోని నీళ్ళు రాగి గ్లాసులో పోసి ఆయనకిస్తుంది. మధ్యమధ్యలో వంటపనులు చూసుకొని మళ్ళీ భర్తకి విసనకర్రతో వీస్తూ నిలబడుతుంది. ముకుందుడు కాగితాలపై బావగారి వాగ్ధాటికి అనుగుణంగా వేగంగా రాస్తుంటాడు. కాలగమనంలో విశ్వనాధుడి భార్య కాలం చేయటంతో విసనకర్రను కూడా ఆమెతోనే పంపించేశాడు.
కాసేపటికి కవితాఝరి ఆగిపోయింది. ఎలా వుందంటూ బావమరిదివైపు చూస్తూ కళ్ళెగరేశాడు విశ్వనాధుడు..
‘‘ చాలా బాగుంది బావా.. మా అక్కగారు కాలం చేసినతర్వాత మీ కలంలో విషాదం విశేషంగా వినిపిస్తోంది..ఆ విషాదంలోనూ విశ్లేషణ, విచత్రమూ, వ్యంగ్యమూ, ఆర్ధత వుంది.’’ అన్నాడు.
‘‘ అవును.. నా భ్రమరాంబని కోల్పోయిన నేను సౌరభంలేని సుగంధ పుష్పాన్ని.. చంద్రికని వెదజల్లలేని చందమామని.. పారలేని సెలయేరుని, వీయలేని వహతిని, మౌనరోధన చేస్తున్న మనసులో విషాదం కాక విరహం ఎలా వినిపిస్తుందిరా..’’ అంటూ నిట్టూర్చాడు విశ్వనాధశాస్త్రి..
‘‘ కానీ మీ కలం నుంచి సరసశృంగార కవితలు కావాలని పాఠకలోకం ఎదురుచూస్తోంది. ’’
‘‘ కృష్ణపక్షపు అమావాస్యలా మారిన నా జీవితంలో పూర్ణోదయం అవ్వటం అసాధ్యం.. ’’ అంటూ పడక కుర్చీలోంచి లేచి శూన్యంలోకి చూస్తుండి పోయాడు విశ్వనాధుడు. అతని భావం తనెప్పటికీ అటువంటి కవనాలు చెప్పలేనని..
బావగారి అంతరంగాన్ని అర్ధం చేసుకున్న ముకుందుడు రాతబల్లమీద కాగితాలను, కలాన్ని సర్ధి మెల్లిగా లేస్తూ.... బావగారి ఆలోచనను యధాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ...
‘‘ అపరాహ్నము కావచ్చింది. వంటలోకి ఏం చెయ్యమంటావ్..?’’ అన్నాడు.
‘‘ నీ నోటికి రుచిగా వుండేదేదైనా ఫర్వాలేదు..’’ క్లుప్తంగా సెలవిచ్చాడు విశ్వనాధ శాస్త్రి.
‘‘ అదేవిటీ.. రుచి నాకేకానీ నీకు అవసరంలేదా...?’’ అడిగాడు ముకుందుడు చిరునవ్వుతో...
‘‘ సంసారిగా సరాగాలు పలికేవాళ్ళకి షడ్రుచులు కావాలి కానీ, వైరాగ్యంతో వున్న ఈ విరాగికి రుచితో ఏం పని’’ అంటూ విశ్వనాధుడు అదే ధోరణిలో అనేసి కన్నీరుపెట్టుకున్నాడు.
బావగారిని ఎలా ఓదార్చాలో ముకుందుడికి అర్ధంకాలేదు. ఎలాగైనా తన అక్క జ్ఞాపకాలనుండి ఆయన్ని యధాస్థితికి తీసుకురావాలంటే ఆయన వేరే కార్యంలో నిమగ్నమవ్వాలి.. అలా అని ఆయనకి పనిచెప్పే స్థాయి తనకి లేదు. మరేంటి దారి.. అని ఆలోచిస్తూ.. ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా...
‘‘ బావా.. మీరీలోపు స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్య వార్చుకోండి.. భోజనం సిద్ధంచేస్తాను.’’ అంటూ ముకుందుడు మరోమాట మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయాడు.
ముకుందుడు వెళ్ళిన వైపు ఒకసారి చూసి.. స్నానానికి పెరటిలోకి వెళ్ళిపోయాడు విశ్వనాధశాస్త్రి..
పెరటిలోని భావిలో నీటితో స్నానం చేసి.. అక్కడే వున్న రావి చెట్టు అరుగుమీద కూర్చొని సంధ్యావందనం చేసుకుంటున్నాడు విశ్వనాధుడు. వంటగదిలో భోజనం తయారు చేస్తున్నాడు ముకుందుడు. అప్పుడే వీరింటికి విరూపాక్ష అనే కవి వచ్చాడు. వచ్చి విశ్వనాధుని ఇంటిని పూర్తిగా పరికించాడు...
విశ్వనాధుని ఇల్లు అతనికి ఒక్క నిశ్శబ్దపు స్మశానంలా అనిపించింది. యధాలాపంగా వెళ్ళి విశ్వనాధుడు కూర్చొని పడక కుర్చీలో కూర్చొన్నాడు.. విరూపాక్షుడు జవ్వంగి మహారాజావారి సంస్థానంలో కవిపండితునిగా కొనసాగుతున్నాడు. సంస్కృతాంధ్రసాహిత్యాల్లో తనంతటి వారు లేరన్నది విరూపాక్షుని మనోభావన.. అతను ఎంతటివారినైనా పురుగులకన్నా హీనంగా చూడటం అతని నైజం. అలా పడక కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి విశ్వనాధుని కేకవేశాడు.
ఎవరొచ్చారో ఏంటో అని ముకుందుడు నట్టింట్లోకి వచ్చి చూడగా విరూపాక్షుడు పడక కుర్చీలో పడుకొని వుండటాన్ని చూసి గంగవెర్రులెత్తిపోయాడు ముకుందుడు..
(సశేషం)
బాగుంది. కొనసాగించండి.
రిప్లయితొలగించండి