స్వర్ణకమలాలు

 స్వర్ణకమలాలు

రచన : విద్యాధర్ మునిపల్లె

శ్రీహర్ష మంచంమీద పడుకొని వున్నాడు. అగరొత్తుల వాసనతో రూం అంతా ఘుబాళిస్తోంది. దూరంగా పార్కురేడియోలో ఏకవీర చిత్రంలోని ‘‘ప్రతీరాత్రీ వసంత రాత్రీ’’ గీతం.. వినిపిస్తోంది. అతని జీవితంలో ఎప్పుడూ ఊహించని సంఘటన కాసేపట్లో జరగబోతోంది. ఆ సంఘటనని తలచుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. అతని ఆనందానికి కారణం లేకపోలేదు...

*******

శ్రీహర్ష పేరుమోసిన నవలా రచయిత. అతను చిన్నతనంలో తనవారిని పోగొట్టుకున్నాడు. ఆస్తులు పెద్దగా లేకపోయినా ఉన్న ఒక్కగానొక్క ఇంటిని అప్పుల వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి అతనికి కష్టాలు మొదలయ్యాయి. బాధ్యత తెలీని వయసులో బ్రతుకు పోరాటం మొదలైంది. మచిలీపట్నంలో వుంటున్న రాఘవయ్య మాస్టారి పుణ్యమా అని అదే ఊరిలో ఆయనకి తెలిసిన అనాధాశ్రమంలో చేరాడు. ఆరోజు నుండి హర్ష బాగా చదువుకున్నాడు. కేవలం చదువు మాత్రమే కాదు.. చుట్టూ సమాజాన్ని గమనించటం.. తన మనసులో ఏదేదో అనుకునేవాడు. రాఘవయ్య మాస్టారితో శ్రీహర్ష మాట్లాడే మాటలు, అతను సమాజాన్ని విశ్లేషించే కోణం ఆయన్ని ఎంతగానో ఆకట్టుకునేవి. పద్నాలుగేళ్ళ కుర్రవాడు సమాజాన్ని ఇంత లోతుగా గమనిస్తున్నాడా అని ఆయన ఆశ్చర్యపోయేవాడు. ఒకసారి రాఘవయ్య మాస్టారు శ్రీహర్షతో ‘‘ ఒరేయ్.. నీలో ఒక ఆవేశం వుంది. ఆ ఆవేశంలో ఒక భావముంది. ఆ భావాన్ని కాగితంపై అక్షరరూపంలో సమాజానికి అందించరా.. ’’ అని ప్రోత్సహించారు. మాస్టారు ఏక్షణాన ఆ మాట అన్నాడో శ్రీహర్ష ఆ మాటల్ని తన మెదడులో ఎక్కించుకున్నాడు. అప్పటి నుండి శ్రీహర్ష తన మనసులోని మాటల్ని పుస్తకంలో రాయటం వాటిని మాస్టారికి చూపించటం చేసేవాడు. మాస్టారు అతనితో ‘‘ నీలోని భావాలకి అక్షరరూపం ఇస్తున్నావు. కానీ వీటికి అందమైన ఆకృతిని అందించాలి. పాఠకుడిని చదివించగలిగేలా పదాలపొందికను ఏర్పరచాలి. నువ్వు లైబ్రరీకి వెళ్ళు.. చాలా మంది పెద్దపెద్ద రచయితలు రాసిన గ్రంధాలను చదువు.. వారి పదాల పొందికను అర్ధంచేసుకో.. నీ అంతట నీకే ఒక శైలి ఏర్పడుతుంది’’ అని ఒక సలహా ఇచ్చారు. అంతే ఆరోజు నుంచి అతను లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఆయా రచయితల పుస్తకాలను చదువుతూ, తన మదిలోని అలజడులకు అక్షరరూపం ఇస్తూ రచనలు చేస్తున్నాడు. అతని రచనల్లో పరిణతి కనిపించింది. రెండు సంవత్సరాల్లో అతను తన మొట్ట మొదటి నవల ‘‘వసంతగీతం’’ రాశాడు. మాస్టారు ఆ నవల చదివి చాలా ఆనందంతో హర్షని ఆలింగనం చేసుకున్నారు. ఆ నవలని తనే అచ్చువేయిస్తానన్నారు. కానీ అదే రాత్రి మాస్టారు.. గుండెపోటుతో మరణించటం శ్రీహర్షని మానసికంగా కృంగదీసింది. అప్పటి వరకూ తన వెన్నంటి వుంటూ, తనకి ఎన్నో సలహాలు ఇస్తూ తనని ఒక రచయితగా తీర్చిదిద్దిన మాస్టారు తనని వదిలేసి వెళ్ళిపోవటాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ బాధతోనే చాలా కాలం రచనల జోలికి వెళ్ళలేదు. పుస్తకాలు చదవటంమీదనే దృష్టిపెట్టాడు. మాస్టారి దయతో పియుసీ పూర్తి చేసి చదువు ఆపేసిన శ్రీహర్ష.. ఆయన వియోగాన్ని మర్చిపోటానికి విరామంలేకుండా వుండాలని నిర్ణయించుకున్నాడు. పగలంతా కాకా హోటల్లో పనిచేస్తూ తన కడుపునింపుకుంటూ వచ్చిన డబ్బుని దాచుకుంటూ.. దాచుకున్న దాంతో సెకండు హ్యాండులో పుస్తకాలు కొనుక్కొని వీధి దీపాల కింద కూర్చొని చదువుకునేవాడు. అలా చదువుతూ అతను డిస్టెన్స్ లో ఎం.ఏ. పూర్తిచేశాడు. అతని మెదడంతా పుస్తక విజ్ఞానంతో నిండిపోయింది. కానీ అతని మనసు మాత్రం మాస్టారి వియోగం మిగిల్చిన బాధతో నిండిపోయింది. శ్రీహర్ష అప్పుడు నిర్ణయించుకున్నాడు.. ఇంత చేసిన మాస్టారికి నేనేమిచ్చాను.. ఆయన స్మృతికి అక్షర రూపం ఇచ్చి కృతజ్ఞత చాటుకుంటాను. అని అనుకున్నదే తడవుగా తన గుండెలో మాస్టారి పట్ల ప్రేమని చాటుకుంటూ.. ఆయన వియోగ భారాన్ని తన అక్షరాలతో కాగితంపై పేర్చాడు. అదే.. ‘‘మంచి మనిషి’’ .

అతను ఇలా నవలలు రాస్తున్నాడు. అతని దగ్గరే అట్టేపెట్టుకుంటున్నాడు. అలా అతను రెండు నవలలు రాశాడు. వాటని ఏం చెయ్యాలో తెలీదు.. ఎవరికివ్వాలో తెలీదు. ఎవరో చెప్పారు.. ‘‘ బెజవాడ వెళ్ళు.. అక్కడ చాలా పబ్లికేషన్ ఆఫీసులున్నాయి. వాళ్ళకిస్తే వాళ్ళు వీటిని పబ్లిష్ చేస్తారు. నీకు డబ్బులు కూడా ఇస్తారు. ఇంత చదువు చదివి ఇంకా ఎన్నాళ్ళని కాకా హోటల్లో కప్పులు కడుక్కుంటూ, సప్లయి చేస్తావు ’’ అని సలహా ఇచ్చారు.

ఆ మాటలు శ్రీహర్షకి వేదంలా వినిపించాయి. హోటల్ ఓనర్ కి చెప్పి తన దగ్గరున్న డబ్బులతో బెజవాడ చేరుకున్నాడు. ఆరోజు నుంచి పబ్లికేషన్ఆఫీసుల చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. కొత్తరచయిత, పైగా యువకుడు.. ఇతని దగ్గర పాండిత్యం వుండదనీ కొందరు, వీడేం రాస్తాడులే అని మరికొందరు అనుకునేవారు. కనీసం ఇతని రచనలు కూడా చూసేవారు కాదు. అతనికి ఏడుపొచ్చేది. తను ఎందుకు రాస్తున్నాడో కూడా అర్థమయ్యేదికాదు. ‘‘ చదివాక బాగా లేదంటే అర్థముంది. కానీ చదవకుండా.. కనీసం మాట్లాడకుండా గేటులోంచే బయటకి పంపిచ్చేస్తున్నారు.. ఆఖరి సారిగా ఒక ప్రయత్నం చేస్తాను.. సఫలమయిందా సరే.. లేదంటే కృష్ణలో నా శవం తేలుతుంది’’ అని మనసులో ధృడంగా సంకల్పించుకున్నాడు. ఆ రోజు కూడా అతనికి అలాంటి పరిస్థితే ఎదురైంది.

తన రెండు నవలలూ పట్టుకొని దుర్గమ్మ దర్శనం చేసుకున్నాడు. కొత్తగా కట్టిన ప్రకాశం బ్యారేజీ మీదికి చేరుకున్నాడు. అక్కడి నుండి నీటి మట్టం వున్న వైపు చూశాడు.. పుస్తకాలను తన గుండెలకి హత్తుకొని ఆఖరిసారిగా ముద్దాడాడు.. వాటిని బ్యారేజీ పైన పెట్టేసి నీటిలో దూకటానికి బ్యారేజీ పిట్టగోడ ఎక్కబోతుండగా... అతని భుజంమీద చెయ్యిపడింది. అతని వెనక్కి లాగిందో చెయ్యి.. ఎవరా అని చూసేలోపే అతని చెంప ఛెళ్ళు మంది.. ఏం జరిగిందో తెలుసుకునేలోపో మరో దెబ్బ.. ‘‘ ఛస్తావేంట్రా.. పాతికేళ్ళుకూడా లేవు.. అంత కష్టం ఏమొచ్చింది.. ’’ అంటూ ప్రశ్నల వర్షం..

శ్రీహర్ష తేరుకొని ఏడుస్తూ జరిగింది చెప్పాడు ఆ వ్యక్తితో..

ఆ వ్యక్తి శ్రీహర్షని ఓదారుస్తూ.. అతని దగ్గరున్న నవలల్ని పైపైన రెండు మూడు పేజీలు చదివాడు..

‘‘ చూడూ.. ఇవి నేను తీసుకెల్తున్నాను. రేపు ఉదయం నా ఆఫీసుకి రా.. ’’ అని విజిటింగ్ కార్డు అతనికిచ్చి వెళ్ళిపోయాడు.


వెళ్ళిపోయిన వ్యక్తి వైపు అలా చూస్తూ.. విజిటింగ్ కార్డు చూశాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు అప్పటికే చాలా మంది పెద్దపెద్ద రచయితల నవలలు ఎన్నో ప్రింట్ చేసిన వ్యక్తి పార్థసారధిరావు. అది చూసి దుర్గమ్మ కొండకి దండం పెట్టాడు శ్రీహర్ష.

అలా పార్థసారధి శ్రీహర్ష జీవితంలోకి ప్రవేశించాడు. ఆరోజు నుంచి శ్రీహర్ష ఎదుగుదలకి పార్ధసారధి కారణమయ్యాడు. శ్రీహర్షని నవలా ప్రపంచానికి పరిచయం చేశాడు. అతను నవలలు ఇంకా అద్భుతంగా రాయటానికి పార్థసారధి చాలా సహకరించాడు. ఇప్పుడు శ్రీహర్ష బెజవాడ సత్యనారాయణపురంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు. విశ్వనాధ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చిందని.. ఆ తర్వాత ఏ తెలుగు వాడికీ ఈ పురస్కారం అందలేదని విన్న శ్రీహర్ష ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పురస్కారం తనకి రావాలని సంకల్పించాడు. దానికి తగిన కృషి, ప్రయత్నాలూ మొదలు పెట్టాడు. గత మూడు సంవత్సరాలుగా ఎంపికల విషయంలో జరిగిన చిన్నచిన్న కారణాలవల్ల అతను పొందలేకపోయాడు. అంతమాత్రానికే అతను ఆస్థాయి రచయిత అనికాదు. పురస్కారం పొందగలిగే స్థాయివున్న రచయితే.

అతని ఊహల్లో ఎప్పుడూ ఒక అందమైన స్త్రీ వుంటుంది. ఆ స్త్రీనే అతని కథలకీ, నవలలకీ నాయకి. ఆమె కేవలం ఊహలకే పరిమితం అనుకున్నాడు. కొందరు అతని అభిమానులు ఇతనికి మాచర్లలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటంతో అక్కడికి వెళ్ళి వస్తున్న శ్రీహర్షకి ప్రత్తిచేలో పత్తి తీస్తూ కనిపించింది కమల. ఆ కమల రూపం అచ్చం తను ఊహల్లో చూసే అమ్మాయి రూపం కావటంతో శ్రీహర్ష తన అంబాజిడర్ కారుని ఆపించాడు. ఆమెని చూసిన ఆనందంలో ఆమె దగ్గరికి వెళ్ళి నన్నుపెళ్ళి చేసుకుంటావా అని అడిగేశాడు.

ఒక్క నిమిషం కమల కూడా ఆశ్చర్యపోయింది. కానీ అంతలోనే తేరుకుంది.. శ్రీహర్ష చూడ్డానికి చాలా హుందాగా, తెల్లటి లాల్చీ, పైజమా, మెడలో బంగారపు గొలుసు, చేతి వేళ్ళకి వుంగరాలూ, చేతికి బంగారు సింహతలాటం.. ఒత్తుగా, నల్లగా వున్న అతని జుట్టు.. అందంగా వున్నాడు. వేళాకోళమాడుతున్నాడేమో అనుకుంది కమల.. కానీ శ్రీహర్ష కళ్ళలోని నిజాయితీ ఆమెని ఏమాత్రం ఆలోచించనీలేదు. మేస్త్రీ రంగమ్మ వచ్చి విషయమేంటని అడిగింది.. కమల రంగమ్మ చెవిలో జరిగింది చెప్పింది. అతనంటే ఇష్టమేనని చెప్పింది. రంగమ్మే పెళ్ళిపెద్దగా మారి శ్రీహర్షకీ, కమలకీ పెళ్ళిచేసింది.

*******

ఈరోజు శ్రీహర్ష దంపతుల తొలిరాత్రి.. అతను ఏకవీర చిత్రంలోని ప్రతిరాత్రీ వసంతరాత్రి అనే పాట వింటూ తన కలల సుందరితో జరగబోయే శోభనం గురించి ఊహల్లో మునిగితేలుతున్నాడు.

ఇంతలో గదిలోకి కమల వచ్చింది. కమలని చూస్తూనే లేచి నిలబడ్డాడు. కమల సిగ్గుపడుతూ పాలగ్లాసు పట్టుకొని అలాగే నిలబడిపోయింది. శ్రీహర్ష దగ్గరకి వెళ్ళి కమలని నడిపించుకుంటూ మంచం దగ్గరికి వచ్చాడు. పాలగ్లాసు చేతికి అందించి వంగి శ్రీహర్ష పాదాలు పట్టుకుంది. శ్రీహర్ష గ్లాసు టేబుల్ మీద పెట్టి కమలని పైకిలేపాడు. కమలతో...

‘‘ఇలాంటివి నాకు ఇష్టముండవు. సంసారమనే బండిని లాగటానికి భార్య, భర్త ఇద్దరూ కూడా రెండు ఎద్దుల్లా వుండాలనే కాడిమాను వాడతారు. దానికి మంగళప్రదమైన సూత్రాన్ని అనుసంధానిస్తూ పాలతో అభిషేకిస్తారు. దంపతులుగా మనల్ని దీవిస్తారు. అప్పుడు మనిద్దరం సరిసమానులమైనప్పుడు ఈ పాదనమస్కారం అనే సంస్కారానికి అర్థమేంటి?’’ అన్నాడు

‘‘ అయన్నీ నాకు తెలవ్వండే..’’ అన్నది. అమాయకంగా..

ఆమె భాష.. ఆ భాషలోని యాస అతన్ని ఒక్క క్షణం ఆలోచనకు గురిచేసింది. ఆమెకి చదువురాదనే విషయం అర్థమైంది. తన ఊహాసుందరి కళ్ళముందు సాక్షాత్కరించిందన్న ఆనందంలో ఆమె గురించి ఏమీ తెలుసుకోకుండానే పెళ్ళిచేసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకుందామనిపించింది.. ఆమె గురించి అడిగాడు..

‘‘ సెప్పుకునేంత నాకాడేముంటది. నేను మూడు సదుతున్నప్పుడే నాయన పాముకరిసి వైద్యం అందేలోపే సచ్చిపోయాడు. అప్పటి నుండి అమ్మతో కలిసి నేను పొలం పనులకి పోతా వుండా.. ఇద్దరు మడుసులం పనిసేత్తేనే ఇల్లు గడిసిద్ది.. ఈమద్దే అమ్మ కూడా గుండెల్లో నెమ్ముసేరి సచ్చిపోయింది. ఒక్కదాన్నే పత్తిసేలో పత్తి తీత్తుంటే మీరొచ్చారు దొరగారూ.. పెల్లిసేసుకుంటావా అని అడిగారు. ’’ అంది అమాయకంగా..

‘‘ ఆ క్షణంలో నీకేమనిపించింది’’ అన్నాడు శ్రీహర్ష కొంత ఉత్సుకతతో..

‘‘ ఈ దొరగారికి మురికి పట్టిన బట్టల్లో వున్న నేను నచ్చటమేంది? ఏలాకోలమాడతన్నారా అని ఆలోసిచ్చా.. కానీ మీ మాటల్లో సొచ్చత కనిపించింది. మీ కల్లలో నిజాయితీ కనిపిచ్చింది. ఎందుకో మీకు నేను నిజంగానే నచ్చానేమో అనిపిచ్చింది. మా యమ్మ పోతాపోతా నన్ను ఒక అయ్యసేతుల్లో పెట్టి పోవాలే అనేది. అమ్మ పోయి ఏడాది కాకుండానే మీరొచ్చి పెల్లి సేసుకుంటాననేసరికి మా యమ్మ కోరిక కూడా తీరుద్దిలే అనుకున్నాను. పెల్లికి ఒప్పుకున్నాను. ’’ అన్నది తలవంచుకునే.

‘‘ నా పేరైనా తెలుసా ’’ అన్నాడు..

‘‘తెలవదు ’’

‘‘ శ్రీహర్ష.. ఇంతకి నేనేం చేస్తానో తెలుసా?’’

‘‘ తెలవదు’’

‘‘ నేను పేరుమోసిన రచయితని. జ్ఞానపీఠ్ పురస్కారం త్వరలో అందుకోబోతున్నాను. ఓహ్.. నీకు అవన్నీ తెలీవుకదా.. భారత సాహితీ పురస్కారాల్లో అదొక గొప్ప పురస్కారం. నాలాంటి కవిపండితుల్ని గుర్తించి ఇచ్చే గౌరవం. అదిసరే.. ఇంతకీ నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావో తెలుసా?’’

‘‘ మీకు ఏకట్టం కలక్కుండా సుఖపెట్టటానికి. మీరు సెప్పిందల్లా సెయ్యటానికి.’’

‘‘ మరి నేను చెప్పినట్టు చేస్తావా ’’ అన్నాడు ఆమె వంక చూస్తూ.. ఆమె తల వంచుకునే.. చేస్తానన్నట్లు తలూపింది..

‘‘ మరి చదువుకుంటావా.. నేను చదివిస్తాను.. ’’

చదువు కోనని తల అడ్డంగా వూపింది..

‘‘ ఏం..? ఎందుకు?’’

‘‘ బల్లో పంతులుగోరు కొడతారు. నేను పోను..’’ అన్నది..

‘‘ పోనీ నేను నేర్పితే నేర్చుకుంటావా..? ’’ అన్నాడు..

నేర్చుకుంటానని తలూపింది.. అంతే ఆ రోజు నుంచి సరిగ్గా ఆరు నెలల్లో ఆమె అన్ని తెలుగు నిఘంటువులు, వ్యాకరణము, రంగనాధ రామాయణం, మొల్ల రామాయణం, భాగవతం, కవిత్రయ భారతం వంటి కావ్యాలను చదివింది, ఏకసంతాగ్రహి కావటంతో కంఠస్తం చేసింది. ఆమె భాషలో యాసపోయింది. మృదుత్వం అలవడింది. ఆరునెలల్లో ఇన్ని సాధించిన కమలని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు శ్రీహర్ష.

*******

ఒకరోజు శ్రీహర్ష ఇంటినుండి బయటికి వెల్తుండగా పార్ధసారధి హడావుడిగా వచ్చాడు.

వస్తూనే శ్రీహర్షపై చిందులు తొక్కాడు.

శ్రీహర్ష రచనలన్నీ తన పబ్లికేషన్ కే ఇవ్వాలంటాడు పార్ధసారధి.. తనను కాకుండా వేరే పబ్లికేషన్స్ కి శ్రీహర్ష నవల అచ్చు అయిందని, అతనికెలా ఇస్తావని గొడవ చేశాడు. కమల మధ్యలో కల్పించుకొని తన భర్తతో పదిరోజుల్లో మంచి నవల రాయించి ఇస్తానని చెప్పటంతో పార్థసారధి పదిరోజులాగి వస్తానని, అప్పటికి నవల పూర్తికాకపోతే తను చేయగలిగింది అప్పుడే చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

అప్పుడే శ్రీహర్ష మనసులో ఒక ఆలోచన మెదిలింది.

అదే చదువునేర్చుకున్న కమలతో నవల రాయించాలని.

కమల ససేమీరా అంది.. కానీ శ్రీహర్ష తన పట్టు వదల్లేదు. మొత్తానికి కమలని ఒప్పించాడు. నవల రాయటంలో తను సహాయం చేస్తానన్నాడు. కమల ఒప్పుకుంది.

కమలని కుర్చీలో కూర్చోపెట్టాడు. ఆమె భుజంమీద నుంచి తలపెట్టి ఆమె చెక్కిలికి తన చెక్కిలి తాకించి.. ‘‘ నీ చుట్టూ వున్న వాతావరణాన్ని అనుభూతి చెందు. దీర్ఘమైన శ్వాసతీసుకో.. గాలిలో వున్న పరిమళాల్ని అనుభూతి చెందు.. వీచే గాలిని అనుభూతి చెందు.. అదురుతున్న ఈ పెదవులను అనుభూతి చెందు.. ఎరుపెక్కిన నీ బుగ్గల్ని అనుభూతి చెందు... నీ ఉచ్వాస నిచ్వాసలకు లయబద్ధంగా చేసే నీ గుండె చప్పుడును అనుభూతి చెందు. నీలో అణువణువునీ అనుభూతి చెందు. ఇప్పుడు నీ మనసులో కలిగిన ఆలోచనలను ఈ కలంతో ఆ కాగితంమీద రాయి..’’

 తను రాస్తుంటుంది. ఆమె అనుభూతి చెందుతూ రాస్తోంది..

రోజులు గడిచిపోతున్నాయి.. శ్రీహర్ష ఆమె రాసిన రాతలని కరెక్ట్ చేస్తున్నాడు.

అనుకున్న రోజు రానే వచ్చింది.

పార్ధసారధి ఉదయాన్నే 7గంటలకల్లా వచ్చి కూర్చున్నాడు.  శ్రీహర్ష ఏమీ మాట్లాడకుండా నవలని అతని చేతిలో పెట్టాడు. ఆ నవల పేరు చూస్తూనే చాలా ఆనందంగా పార్ధసారధి

‘‘ స్వర్ణకమలాలు.. చాలా బాగుందండీ’’ అన్నాడు చిరునవ్వుతో...

‘‘ నవల చదవండి.. మీరూ కొత్తగానే ఫీలవుతారు.. ’’ అన్నాడు శ్రీహర్ష సమాధానంగా నవ్వుతూ..

పార్ధసారధి నవల చదువుతున్నాడు. ప్రతి పేజీ కూడా అతన్ని ఊపిరి సలపనీకుండా చదివించేస్తోంది. నవలలోని భావావేశాలు అతన్ని కంట తడిపెట్టించేశాయి. నవల చదవటం పూర్తి చేశాడు పార్ధసారధి.

‘‘ శ్రీహర్షగారూ.. మీరన్నట్లు నవల చాలా కొత్తగా వుంది. అద్భుతంగా రాశారు. ఇవిగోండి మీ నవలకి నేనిస్తానన్న డబ్బులు..’’ అంటూ పాతికవేల రూపాయలు అతనికి అందించాడు.

‘‘ ఆ నవల రాసింది నేను కాదు. తను.. ’’ అంటూ కమలని చూపించాడు. కమల పార్ధసారధికి టిఫెన్ అందిస్తూ.. సిగ్గుపడింది.

పార్ధసారధి పాతికవేల రూపాయలు ఆమె చేతిలో పెడుతూ.. ‘‘  కమలగారూ.. నవల చాలా అద్భుతంగా రాశారు. ముఖ్యంగా నవలకి ముగింపు కూడా చాలా అందంగా వుంది. స్త్రీ ఔన్నత్యాన్ని ఒప్పుకుంటూ పురుషుడు ఆమెకి పాదాక్రాంతమవ్వటం నాకు బాగా నచ్చింది. అలాగే ఈ నవలని నేను తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, ఇంగ్లీషు భాషల్లోకి కూడా అనువాదం చేసేందుకు నాకు హక్కులు కల్పించండి.. వాటికి పారితోషికం కూడా త్వరలోనే ముట్టచెప్తాను.’’ అన్నాడు..

కమల సిగ్గుపడుతూ శ్రీహర్షవైపు చూసింది.. శ్రీహర్ష తన సమ్మతిని తెలియజేశాడు. పార్ధసారధి నవల తీసుకొని లేచి వెళుతూ.. ‘‘ డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసుకొని రేపు వస్తాను. ’’ అని గుమ్మందాకా వెళ్ళి..  శ్రీహర్షతో.. ‘‘ శ్రీహర్షగారూ.. ఇప్పటివరకూ మీరు రాసిన ఏ ఒక్క నవలా కూడా వేరే భాషల్లోకి అనువాదం కాలేదు కదూ.. మొట్టమొదటి నవలతోనే మీ శ్రీమతిగారు ఆ అవకాశాన్ని పొందారు. మీకు మీ ఇంట్లోనే పోటీ ఎదురైంది సార్..’’ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

శ్రీహర్ష మొహంలో రంగులు మారిపోయాయి.. పోటీ.. పోటీ.. తనకు తనభార్యే పోటీనా.. తనద్వారా అక్షర జ్ఞానాన్ని పొందిన తన భార్య ఈ రోజు ఒక్క నవలతోనే తనకి పోటీగా వచ్చిందా.. అని తనలో తనే రగిలిపోయాడు ఆక్షణం..

ఆరోజు నుంచి శ్రీహర్ష రచనలు పాఠకులని ఆకట్టుకోలేకపోతున్నాయి. శ్రీహర్షకి వున్న క్రేజ్ తగ్గిపోసాగింది. జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎప్పటిలాగే అతను కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అనుకోని రీతిలో పురస్కారం ‘‘స్వర్ణకమలాలు’’ నవల రాసిన కమలని వరించింది.

దీంతో శ్రీహర్ష తనలో తనే రగిలిపోయాడు.. తనకు దక్కాల్సింది తన భార్యకి దక్కిందని బాధపడ్డాడు. ఆబాధ అతన్ని తీవ్రంగా కృంగదీసింది. భోజనం మానేశాడు.. నీరు తాగటం మానేశాడు. పరధ్యానంలో గడపటం మొదలు పెట్టాడు. పలకరించినా కూడా పలకటంలేదు.

కమల కంగారు పడింది. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళింది. ఎంతమంది డాక్టర్లకి చూపించినా ఉపయోగంలేదు. శరీరానికైతే మందులివ్వగలిగారు కానీ మనసుకి సంబంధించిన వ్యాధి కావటంతో ఏమందులూ కూడా అతనిమీద పనిచెయ్యలేకపోయాయి.

కమల జ్ఞానపీఠ్ అవార్డు పొందటానికి ఢిల్లీ వెళ్ళాల్సి వుంది. మూడు రోజుల్లో ప్రయాణానికి వెళ్ళాలనగా మొదటిసారి శ్రీహర్ష ఆమెతో మాట్లాడాడు..

‘‘నువ్వు నాకంటే గొప్ప రచయిత్రివి కదూ.. అందుకే కొన్ని సంవత్సరాలుగా నేను ప్రయత్నిస్తున్నా రాని పురస్కారం నీకు దక్కింది. బయటి వాళ్ళ చేతిలో ఓడిపోయి బ్రతకగలనేమో కానీ సొంత భార్య చేతిలో ఓటమిని నేను తట్టుకోలేక పోతున్నాను. ఆలోచించాను.. బాగా ఆలోచించాను. ఎంత ఆలోచించినా నాలో లోపం నాకు అర్థంకావటంలేదు.. పూర్వం వున్న శ్రీహర్ష ఇప్పుడు లేడు.. నీకు పురస్కారం వచ్చిన రోజే అతను చచ్చిపోయాడు.. ఇప్పుడు నీతో మాట్లాడుతోంది నీ భర్త మాత్రమే.. నిజం చెప్పాలంటే ఒక మగాడు మాత్రమే..’’ అని భోరున ఏడ్చేశాడు..

కమల తన భర్తని తన ఒడిలోకి తీసుకొని లాలించింది.. అతన్ని బుజ్జగించింది..

‘‘ యావండీ.. పురస్కారం అనేది మన సంస్కారానికి కొలమానమా చెప్పండి.. ఈ పురస్కారం వచ్చింది నాకు కాదు.. మనకి.. మనం రాసిన నవలకి.. అంటే మీకు వచ్చినట్లుగా కాదా.. ఇదా మీరిలా అయిపోటానికి కారణం.. ఒకవేళ ఈ పురస్కారమే మనిద్దరి మధ్యా అడ్డు గోడగా మారితే ఆ పురస్కారం నేను తీసుకోను. నాకు అది అవసరంలేదు. నేను మీకు పోటీ ఏంటండీ.. మీ చిటికిన వేలు పట్టుకొని నడిచేదాన్ని మాత్రమే.. నేనంటూ ఈ రోజిలా వున్నానంటే.. ఆ పురస్కారం వచ్చిందంటే కారణం ఎవరు మీరు కాదా.. దానిని నేను అందుకోను.. మన తరఫున మీరు అందుకుంటున్నారు..’’

‘‘ నేను అందుకోను కమలా.. దానిని అందుకునే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఉన్నతమైన భావాలున్న నువ్వు మాత్రమే దానిని అందుకోగలవు.. నేను చేసిన తప్పు నాకు నీతో మాట్లాడాకే తెలిసింది.. ఈ పని చెయ్యటానికి నాకు మూడు నెలలు పట్టిందా.? నీకు మూడు నిమిషాలు కూడా పట్టలేదు..దీనిని బట్టి చూస్తే నువ్వు ఆ పురస్కారం అందుకోటానికి యోగ్యురాలివి.. నేను కాదు.. ’’ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ..

ఆ పురస్కారం అందుకోటానికి ఆ రోజు కమలకానీ, శ్రీహర్షకానీ ఎవ్వరూ వెళ్ళలేదు.

విశ్వనాధ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షం తర్వాత కమల తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పురస్కారం తెలుగు వాడిని వరించటానికి 18 ఏళ్ళ కాలం పట్టింది.  1988లో డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారు పొందగా.. రావూరి భరద్వాజగారు 2012లో పొందటం జరిగింది.

ఈకథ కేవలం కల్పితం మాత్రమే. ఏ పురస్కారాన్నీ అగౌరవ పరచాలని కానీ, కించపరచాలని కానీ నా వుద్దేశం కాదు. సాహితీ మాగాణాన్ని సుసంపన్నం చేసిన నేల తెలుగు నేల. ఇటువంటి తెలుగు నేలపై పుట్టిన ఎందరో కవిపుంగవులు, ఎందరో రచయితలు వున్నా కూడా ముగ్గురిని మాత్రమే జ్ఞానపీట్ పురస్కారం వరించగలిగిందంటే మన కవులు, రచయితలు తెలుగు సాహిత్యం పట్ల ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఒక్కసారి సింహావలోకనం చేయాల్సిన సమయం వచ్చిందనిపించింది. ఇతర భాషల్లో కవులు, రచయితలు ఆలోచించినంత ఉన్నతంగా మన తెలుగు కవులు, రచయితలు ఆలోచించ లేకపోతున్నారా అనే ఆవేదన కలిగింది. ఆ ఆవేదనలోంచి పుట్టిందే ఈ స్వర్ణకమలాలు.

శుభం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి