గుడిగంటలు మోగినవేళ
ఉద్యోగం నుండి
నేనూ, నాభార్యా రిటైరై మూడేళ్ళయింది. నేను మా మేడమీద కూర్చొని సంతానవేణుగోపాల స్వామి
దేవాలయం వైపు చూస్తున్నాను. మాది పాతకాలంనాటి పెంకుటింటి మేడ. ముత్తాతలు కట్టిన
మేడైనా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. బయట వర్షం పడుతోంది. చుక్కనీరూ కారదు. ఇంతలో
పెద్దాడి నుండి ఫోన్ వచ్చింది.
‘‘ నాన్నా
..ఆరోగ్యం ఎలా వుంది? టైంకి మందులు వేసుకుంటున్నారా? నీ కోడలు నిన్ను తాతని
చేస్తోంది. రేపు సెకండ్ సాటర్ డే కదా.. నేనూ, తనూ వస్తున్నాం. ’’ అంటూ ఏవేవో
విషయాలు మాట్లాడాడు.. అన్నీ విన్నాను.. వాడికి నాకు తోచిన సమాధానం చెప్పాను. ఇంతలో
పద్మ తన మొబైల్లో చిన్నోడితో మాట్లాడుతూ నాకు కాఫీ తీసుకొని మేడమీదికి వచ్చింది. కాఫీ
నా చేతికిచ్చి తను ఫోను మాట్లాడుతూ వెళ్ళిపోయింది.
ఎప్పటి నుండో
చిన్నోడికి పెళ్ళి చేయాలనుకుంటున్నాం.. బెంగుళూరులో సాఫ్ట్ వేరు జాబ్
చేస్తున్నాడు. వాడు పెళ్ళి చేసుకుంటాననీ చెప్పడూ, చేసుకోననీ చెప్పడు.! మంచి
ఉద్యోగం. లక్షన్నర జీతం.. తన మేనకోడల్నిచ్చి చెయ్యాలని పద్మ పట్టుబట్టింది.
నా ఆలోచనలు గతంలోకి
వెళ్ళాయి..
------
మా ఇంటి వీధిలోని
సంతానవేణుగోపాలస్వామి గుడిగంటలు మోగిన వేళ నా మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది.
నాపేరు వసంతరావు. మా ఇంటి మేడమీదికెక్కి చూస్తే సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
కనిపిస్తుంది. గుడిలో చదివే మంత్రాలూ, భక్తులు కొట్టే గంట శబ్దం వినిపిస్తుంటుంది.
నాకు చిన్నప్పటి నుండి ఏ సమస్య వచ్చినా మేడమీదికెళ్ళి గుడి వైపు చూసి మనసులో నా
సమస్యని చెప్పుకొని పరిష్కారం కోరినప్పుడు గుడిగంటలు మోగితే ఆ సమస్య
తీరిపోయినట్లే..
ఏంటండీ నాది
పిచ్చినమ్మకం అనుకుంటున్నారా? లేక మూఢ నమ్మకం అనుకుంటున్నారా? నిజమేలేండి.. మీలో
కొంతమంది అలా అనుకోవచ్చు.. కొంతమంది నాకు దైవభక్తి ఎక్కువ అనుకోవచ్చు.
ఎవరేమనుకున్నా నా నమ్మకం నాది.
నేను టెన్త్ క్లాసు
చదువుతున్న రోజుల్లో ఇంగ్లీషులో చాలా వీక్ గా వుండేవాడిని .. ఏదో మొత్తానికి
రాత్రంతా మేలుకొని కొన్ని ప్రశ్నలు చదువుకున్నాను. పొద్దునే నాకున్న అలవాటు
ప్రకారం మేడమీదికి వెళ్ళి వేణుగోపాలస్వామి దేవాలయాన్ని చూస్తూ మనసులో
కోరుకున్నాను..
‘‘ స్వామీ పరీక్షలో
నేను చదువుకున్న ప్రశ్నలే రావాలి. ఎలాగైనా నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే’’ అని.
గుడిగంటలు మోగాయి నేను చదువుకున్న ప్రశ్నలే పరీక్షలో వచ్చాయి. మొత్తానికి రాసి ఫస్ట్
క్లాసులో పాస్ అయ్యాను.
అలాగే ఇంటర్,
డిగ్రీ కూడా పాస్ అయ్యాను.
గ్రూప్ 2 పరీక్షలకి
ప్రిపేర్ అయ్యి ఉద్యోగం రావాలని కోరుకున్నాను.
అప్పుడూ గుడిగంటలు
మోగాయండోయ్.. ఇంకేముంది గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగం రావటంతోనే
నా జీవితం పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఇంకేముందండీ పెళ్ళి..
సంపాదిస్తున్న కొడుక్కి పెళ్ళి చెయ్యాలని అమ్మా,నాన్నలు తెగ మల్లగుల్లాలు
పడుతున్నారు.
మా దూరపు బంధువు
కామేశ్వరరావు అని ఒకడున్నాడులేండి.. నారదుడి టైప్.. అతగాడొచ్చాడు ఒకరోజు మా
ఇంటికి. మా అమ్మానాన్నలు సంబంధాలేమైనా వుంటే చూడమని చెప్పీ చెప్పగానే అప్పటి వరకూ
మావాళ్ళ ఆలోచనలో లేని మేనరికాలు గుర్తు చేశాడు.
అంతే
అమ్మా,నాన్నలకి తమతమ వారి సంబంధాల్ని నాకు చెయ్యాలని ఎవరి మేనకోడళ్ళని వాళ్లు ఇంటికి
కోడలిగా తీసుకురావాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు.
ఇవేవీ తెలీని నేను
మా ఆఫీసులో పనిచేస్తున్న జూనియర్ క్లర్క్ పద్మతో నాకు పరిచయం అవ్వటం, ఆ పరిచయం
కాస్తా ప్రేమలో పడటం జరిగిపోయింది.
పద్మ మొహం
చూడ్డానికి విచ్చుకున్న పద్మంలా వుంటుంది. కళ్ళు సగం విచ్చుకున్న పద్మాల్లా
వుంటాయి. ముక్కు మొగ్గతొడిగిన పద్మంలా వుంటుంది. చెవులు లోపలికి ముడుచుకున్న పద్మపు
రేకుల్లా ఏంటండీ.. పెదవులు విచ్చుకున్న పద్మపు రేకుల్లా వుంటాయి. వీడు వర్ణనలన్నీ
పద్మాలతో పోలుస్తున్నాడు మరేం తెలీదా అనుకుంటున్నారా... ఏం చేస్తాం చెప్పండి.. వయసులో
వున్న వాడికి కన్నెపిల్లేంటి పందిపిల్లకూడా అందంగానే కనిపిస్తుంది. దాన్ని చూస్తే
కవిత్వం పుట్టుకొస్తుంది.. నాలాంటోడికి ఇదిగో ఇలాంటి కవిత్వాలే వస్తాయి.
ఏది ఏమైనా నాకంతా
పద్మమయం. కళ్ళుమూసినా కళ్ళు తెరిచినా..! పనిచేస్తున్నా..! పనిలేకున్నా..! నా ఆలోచనంతా
పద్మచుట్టూనే తిరుగుతోంది. పద్మకి కూడా నేనంటే ఇష్టమే..1 పెళ్ళి కూడా
చేసుకోవాలనుకున్నాం.. పద్మ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకున్నారు. మా ఇంట్లో కూడా మా
విషయం చెప్పాలనుకుంటే.. సరిగ్గా అదే సమయానికి మా అమ్మా నాన్నలు గొడవ పడుతున్నారు.
అమ్మేమో నా మేనమామ
కూతురు రాధికను చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి మా నాన్న తక్కువ తిన్నాడా
‘‘ నీతమ్ముడి
భార్యకి పిచ్చి వుంది. ఆవిడ తల్లికీ పిచ్చి వుంది. నీ తమ్ముడి కూతురికీ కొద్దిగా
పిచ్చి వుంది. ఆ పిచ్చి సంబంధం మనకొద్దంటే వద్దు.’’ అన్నాడు.
నిజమే రాధిక
అందంగానే వుంటుంది కానీ దానికి కాస్తంత వెర్రి వుంది. దానికి నచ్చిందా
నెత్తికెత్తుకుంటుంది. నచ్చలేదా ఎత్తి నేలకేసి కొడుతుంది. చిన్నప్పుడు నాతో
ఆడుకునేప్పుడు కూడా అంతే దానికి నచ్చినంతసేపు ఆడేది.. దానికి విసుగుపుడితే నా
వీపుమీద బాదేది. నేను ఏడిస్తే అది పెద్దగా నవ్వేది. ఒకరకంగా చెప్పాలంటే శాడిస్ట్..
దాన్ని పెళ్ళిచేసుకుంటే నా గతి మూడ తన్నులూ, ఆరు చీవాట్లతో గడిచిపోతుంది.
‘‘థ్యాంక్స్
నాన్నా..! ఈ సంబంధం ఒప్పుకోనందుకు’’ అని మనసులో అనుకున్నా.
కానీ మా నాన్న
మనసులో నా మేనత్త కూతుర్ని కోడలుగా చేసుకోవాలన్న ఆలోచన వుందన్న విషయం గ్రహించలేకపోయాను..
ఈ విషయంలో ఆయన ఎక్కువ సమయం కూడా తీసుకోలేదను కోండి.. వెంటనే మేనత్తకూతురు పుష్ప
గురించి చెప్పాడు.
‘‘ పుష్ప అంత
అందంగా వుండదు. నల్లగా వుంటుంది. దానికి చిన్నప్పటి నుండీ నేనంటే చులకనెక్కువ. అది
బాగా చదువుతుందని పొగరు. బైదబై నా కర్మకాలి అది నేను పనిచేసే ఆఫీసులో నాకంటే
కొంచెం పై కేడర్ లోవుంది. చిన్నప్పటి నుండీ నామీద దానికున్న అభిప్రాయం పోకపోగా
మరింతగా పెరిగింది. నేను చేస్తున్న పనిలో ఎఫ్పుడూ ఏదో ఒక తప్పు చూపించి అందరిముందూ
తిట్టిపోస్తుంది. ఎప్పుడెప్పుడు దానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుందా అని ఎదురు
చూస్తున్నాను. ఒకటి రెండు సార్లు పిటీషన్ వేణుగోపాలస్వామి ముందు కూడా వుంచాను.
ఆయనింకా పట్టించుకున్నట్లులేడు. కొంపదీసి అమ్మకాని ఒప్పుకుందా.. నేను నిజంగానే పెనంమీద
నుంచి పొయ్యిలో పడ్డట్లే.. మనసులో స్వామీ పుష్పని మా అమ్మ కోడలుగా ఒప్పుకోకుండా
చూడు’’ అని మనసులో వేడుకున్నాను. గుడిగంటలు మోగాయి.. వెంటనే మా అమ్మ..
‘‘ నీ చెల్లెలి
కూతురు నల్లగా వుంటుంది. దాన్ని కోడలుగా తీసుకొస్తే రేపు నా కొడుక్కి పుట్టే
పిల్లలందరూ నల్లగా పుడతారు. పైగా దానికి కాస్త కాలు అవుడు. కుంటుకుంటూ
నడుస్తున్నట్లుంటుంది. వద్దంటే వద్దు.’’ అన్నది.
దీంతో ఒకరి
సంబంధాల్ని ఒకరు తిట్టి పోసుకున్నారు.
‘‘ నామనసులో మాత్రం
చాలా ఆనందంగా వుంది. ఎందుకంటే ఇద్దరు మరదళ్ళలో ఏ ఒక్కరూ నాకు భార్యగా రారు.
ఇద్దరిలో ఎవ్వరూ ఒప్పుకోరు.’’ అనుకున్నాను.
రోజుల తరబడి నా
పెళ్ళి విషయంలో అమ్మానాన్నలు తమతమ పట్టు విడవకుండా గొడవ పడుతూనే వున్నారు. కొన్నాళ్ళు
ఇద్దరూ మాట్లాడుకోవటం మానేశారు. ఒకరోజు ఏమైందో తెలీదు కానీ వున్నట్లుండి ఇద్దరూ
నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. నాకు చాలా ఆనందమేసింది. పోనీలే కలిసిపోయారు. ఇదే
సరైన సమయం.. నా మనసులో వున్న పద్మగురించి చెప్పటానికి అని ఫుల్లుగా రెడీ అయి గొంతు
సవరించుకుని చెప్పబోతూ మనసులో వేణుగోపాల స్వామిని తలచుకుంటుండగా నాన్న నాతో
‘‘ ఓరే వసంతరావు ! మేమిద్దరం
ఒక ఒప్పందానికి వచ్చాం. నీ మరదళ్ళలో నువ్వు ఎవర్ని చేసుకున్నా మాకు అభ్యంతరంలేదు. ’’
అన్నాడు
‘‘నువ్వు పెళ్ళంటూ
చేసుకుంటే నీ మరదళ్ళల్లో ఒకరిని చేసుకోవాల్సిందే’’ అంది అమ్మ.
ఎప్పటిలాగే నా
సమస్యని సంతానవేణుగోపాల స్వామి ముందుంచాను. ఈసారి గుడిగంటలు మోగలేదు.
‘‘ స్వామీ ఏంటి నామానాన
నన్ను వదిలేస్తావా? చిన్నప్పటి నుండి నిన్నే నమ్ముకున్నా.. ఏదో ఒకదారి నువ్వే
చూపించు.. పద్మని నాకు భార్యగా ప్రసాదించు’’ అని మనసులో కోరుకున్నా. అయినా
గుడిగంటలు మోగలేదు. నిర్ణయం నామీదే వుందనిపించింది. ఏదైతే అదైందని నా మనసులో మాట
చెప్పేశాను.
చాలా రోజులు మా
ఇంట్లో నాతో మాట్లాడ్డం మానేశారు.
మరోవైపు పద్మ
ఇంట్లో పెళ్ళి విషయంలో ఒత్తిడి పెరిగిపోతోంది.
ఏదైతే అదైందని
ఒకరోజు గుడికి వెళ్ళాను. అప్పుడే నాకు తెలిసింది గంటమోగకపోటానికి కారణం.. గుడిలో
దొంగలు పడి గంట ఎత్తుకు పోయారని. లేకపోతే గుడిగంటలు మోగేవే అని అనిపించింది. నేనే
కొత్తగంట ఒకటి తీసుకెళ్ళి దేవాలయంలో ఇచ్చాను.
అదేరోజు అమ్మా, నాన్నని
కూర్చోపెట్టి ‘‘ మీ ఇద్దరి మేనరికాల్లో నేను ఎవర్ని చేసుకున్నా మరొకరు బాధపడతారు.
బాధపడమని మీరు చెప్పచ్చు.. కానీ ఎక్కడో ఒకమూల ఆ బాధ వుంటుంది. మీ ఇద్దరిలో ఏ
ఒక్కరు బాధపడ్డా నేను భరించలేను. అందుకే నాకు నచ్చిన పద్మని పెళ్ళిచేసుకుంటాను.
ఒకసారి మీరు పద్మని చూడండి.. మీకు నచ్చుతుందనుకుంటున్నాను’’ అని చెప్పాను. గుడిగంటలు
మోగాయి..
ఆరోజు సాయంత్రం
పద్మని మా ఇంటికి తీసుకెళ్ళాను.
కలుపుగోలు మనిషి
కావటంతో పద్మ అమ్మ,నాన్నలకి నచ్చింది. వాళ్ళుకూడా పెళ్ళికి ఒప్పుకున్నారు. అంతే మా
పెళ్ళి చాలా గొప్పగా జరిగిపోయింది. పెళ్ళికి నా మరదళ్ళిద్దరూ వచ్చారు. పెళ్ళి పీటల
మీద కూర్చున్న నేను పుష్పను చూడగానే దీనికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది రా
దేవుడా..! అని మనసులో అనుకున్నాను. అంతే గుడిగంటలు మోగేశాయి. కాసేపటికి పుష్పని గుడివాడకి
ట్రాన్స్ఫర్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చిందని బంట్రోతు గురునాధం సమాచారం మోసుకొచ్చాడు.
నాకు కూడా ఒక ఫ్యాక్స్ వచ్చింది.. నన్ను
పుష్ప పోస్టులోకి ప్రమోషన్ ఇస్తూ.
దాంతో నాకు ఆఫీసులో
పుష్పపీడ వదిలిపోయింది. ప్రేమించిన పద్మతో పెళ్ళీ అయిపోయింది.
--------
అలా గతమంతా నా
జీవితం ముందు కదిలింది. అదీ విషయం.. ఇప్పుడర్ధమైందా ఇంత కధా నేను మీకు ఎందుకు
చెప్పానో.?
చేతిలో వేడి కాఫీ
వుంది. కాసేపటికి పద్మ టీ తాగుతూ వచ్చి నా పక్కనే కుర్చీలో కూర్చుంది. అలా వేడివేడిగా
టీ,కాఫీలు తాగుతూ బయట వర్షాన్ని చూస్తూ వాతావరణాన్ని అనుభూతి చెందుతున్నాం.
పిల్లలు మాతో ఏం
మాట్లాడారో ఒకరికొకరం చెప్పుకున్నాం. మళ్ళీ చిన్నోడి పెళ్ళి విషయం ప్రస్తావన
తెచ్చింది. నేను ఏం మాట్లాడకుండా నవ్వేసి ఊరుకున్నాను.
సమస్యని
పరిష్కరించమని సంతానవేణుగోపాలస్వామికి అర్జీపెట్టుకున్నాను.
గుడిగంటలు మోగటం
నాకూ, తనకీ వాట్సప్ లో ఫోటో రావటం జరిగిపోయింది. ఏవిటా అని తీసి చూస్తే చిన్నోడు ఎవరో
అమ్మాయితో కలిసి దిగిన ఫోటో.. కింద మెసేజ్. ‘‘ మీకు కాబోయే కోడలు..! ఈ రాత్రికి
బయల్దేరి వస్తున్నాం..! రేపు అన్నయ్య, వదిన కూడా వస్తారుకదా..! కూర్చొని మేటర్
ఫినిష్ చేద్దాం..!’’ అంతే..
వాడెప్పుడూ అంతే
చెప్పదలచుకుంది సూటిగా సుత్తిలేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. అవతలి
వారు ఏమనుకుంటారని ఆలోచించడు.
నాభార్య మొహంలో
నెత్తురు చుక్కలేదు.
‘‘ ఎన్నోఆశలు
పెట్టుకున్నానండీ.. నా మేనకోడల్ని నాకు కోడలుగా తెచ్చుకుందామని.. వీడేంటండీ ఇలా
చేస్తున్నాడు ’’ అని నా భుజంమీద తలపెట్టి బావురుమంది.
అప్పుడు నేను
పద్మని ఓదారుస్తూ.. ‘‘ మన పెళ్ళి ఎలా జరిగింది? అప్పుడు నా పరిస్థితేంటి? తర్వాత నేను
నిన్నెలా పెళ్ళిచేసుకున్నాను? పెళ్ళి అనేది పిల్లల ఇష్టం. కలిసుండాల్సింది వాళ్ళు.
మనం ఇంకెన్నాళ్ళుంటాం చెప్పు? నీకు నేను నాకు నువ్వు మనం ఉన్నన్ని రోజులు. ఆతర్వాత
ఎవరో ఒకరిదగ్గరుండాల్సిందే. ఇప్పుడు వాళ్ళ ఇష్టానికి మనం విలువిస్తే వాళ్ళు మనకి
విలువిస్తారు. అదే మనం అడ్డం చెప్పామనుకో.! వాళ్ళు అనుకున్నది ఎలాగూ చేస్తారు. ’’
గుడిగంటలు మోగాయి.
పద్మ ‘‘
అంతేనంటారా?’’ అన్నది నిస్సహాయంగా.
నేను చిరునవ్వుతో
తన కన్నీళ్ళు తుడుస్తూ ‘‘ పరిస్థితులు మనం కోరుకున్నట్లుండవు. పరిస్థితుల్ని బట్టి
మనమే సర్దుకు పోవాలి. అదే జీవితం. ఈ వయసులో మనక్కావాల్సింది బాధకాదు. ఆనందం.’’
మరోసారి గుడిగంటలు
మోగాయి..
శుభం
ఆసాంతం కధ చదివించింది. బాగుంది.
రిప్లయితొలగించండికథలో రచయిత్రి చెప్పదలచుకున్న అంశం చాలా నర్మగర్భంగా వుంది. పైకి చదవటానికి కధే.. సందేశం మాత్రం అంతర్లీనంగా ఆకట్టుకునేలా వుంది. వసంతయామినిగారూ మీరు మరిన్ని మంచి రచనలు చేయాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిkadha chala bagundi. Tanavishayam lo prema ok anukunna padma koduku preminchadu anagane tattukoleka poyindi. modatinunchi kuda okela unna vasanth carector bharyaki nacha cheppatam bagundi.
రిప్లయితొలగించండిరచయిత్రి తన కధ ద్వారా ఏం చెప్పదలచుకున్నారనే విషయం అర్ధంకాలేదు. ఒక కధని చెప్పినప్పుడు ఆ కధ ద్వారా ఏం చెప్పదలచుకున్నారో అర్థంకావాలి. అయితే ఎవరో నర్మగర్భంగా అన్నారు. మరా గర్భం ఏమిటో.?
రిప్లయితొలగించండికధ చాలా చక్కగా వుంది. వసంతరావు జీవితం మాత్రమే కాదు. చాలా మంది జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయి. గుడిగంటలు మోగటం చాలా గమ్మత్తుగా అనిపించింది. టైటిల్ కు న్యాయం చేసినట్లు అనిపించింది.
రిప్లయితొలగించండివసంతరావు జీవితంలో ఏం జరిగినా సంతాన వేణుగోపాలస్వామి గుడి గంటలు మ్రోగిన తరువాతే !
రిప్లయితొలగించండితమ పెళ్లి ఎలా జరిగిందో తెలిసీ – చిన్నోడి ఇష్టానికి తలవొగ్గిన ఆ దంపతులది అనుభవం ఇచ్చిన నిర్ణయం. అయితే గుడి గంటలూ మ్రోగాయి.
కథ బాగా వ్రాసిన రచయిత్రి గారికి అభినందనలు.