నీతోటే నేనుంటా!

 నీతోటే నేనుంటా!

తెలికిచర్ల విజయలక్ష్మి
హైదరాబాద్.


వాకిలి ఊడ్చటానికి వచ్చిన అప్పమ్మ, అలవాటు ప్రకారం  కిటికీలోనుంచి తొంగి చూసి...

"బాబుగారు, ఆయాస పడుతున్నారమ్మా!" అంటూ అరుస్తున్న పనిమనిషి  అరుపులకి, ఒళ్ళు స్వాధీనం చేసుకుని మెల్లిగా లేచి...

"ఏమండీ.." అంటూ భర్త గుండెలమీద రాస్తూ...

"అయ్యో, పాడునిద్ర ఎంత పట్టేసిందో? వేడి కాఫీ తాగించితే సర్దుకుంటుంది" అంటూ భర్తకుపచారాలు చేస్తోంది డెబ్భై రెండేళ్ల  పార్వతమ్మ.


ఒక్కసారిగా ఆయాసం ఆగి, చలనం లేకుండా ఉన్న భర్తను చూస్తూ...

"ఏమండీ.." అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటోంది ఆమె.


అప్పమ్మ, పరుగున పక్కింటికి పరుగెత్తి తలుపు తట్టి...

"పెద్దబాబుగారికి బాగులేదు. అమ్మగారు ఏడుస్తున్నారు" అంటూ కేకలు పెట్టింది. అప్పమ్మ, అరుపులు విన్న వీరేశం..

"ఇదొకర్తి, ఊరు తెల్లవారుతుందో లేదో సమాచారం సేకరిస్తుంది" అని విసుక్కుంటూ...

"ఏమే, అన్ని గదులకూ గడియలు పెట్టు. ముసలాయన పోతే, మనకి  పదిరోజులూ మైల తప్పదు. నే వెళ్ళి చూసొస్తాను" అంటూ పక్కింట్లో ఉండే పెదనాన్న వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అప్పమ్మ అరుపులకి చుట్టుపక్కలందరూ చేరుకున్నారు. ఆరునెలల నించీ మంచం పట్టిన ఎనభై ఏళ్ళ పెదనాన్న, నిర్జీవంగా ఉండటం చూసి...మళ్ళీమళ్ళీ కదిపి చూసేడు వీరేశం. శ్వాస ఆడటంలేదు. పెద్దమ్మ వైపు చూస్తూ...


"పెదనాన్న పోయేరు" అంటూ బల్లమీదున్న పంచాంగం చేతిలోకి తీసుకుని చూస్తూ, లెక్కలు వేసి...

"త్రిపాద నక్షత్రంలో పోయారు. మంచి నక్షత్రం కాదు. ధనిష్టా పంచకాలు. పెదనాన్న తనతోపాటూ మందీ మార్బాలం తీసుకు వెళతారు. ఎవరికి కాలం  మూడుతుందో మరీ?" అన్న వీరేశం మాటలు చుట్టూ మూగిన ఊరివాళ్ల చెవిన పడి, మొహాలు చూసుకున్నారు. రెండేళ్ళ క్రితం, ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు కూడా చెడు నక్షత్రం అవటంతో ఊరికరిష్టం పట్టుకోవటం గుర్తువచ్చి, ఒకరి వెనుక ఒకరు ఇంటితోవ పడుతుంటే... వీరేశం వదనంలో ఆనందం తాండవించింది.


"ఏ నక్షత్రంలో పోయినా, చనిపోయిన మనిషిని కాటికి పంపి బూడిద చెయ్యక తప్పదు కదరా! జరవవల్సిందాని గురించి ఆలోచించు" అంటూ  కన్నీళ్ళు పెట్టుకుంటున్న పెద్దమ్మను చూస్తూ...

"సరేలే, ఏడవకు. ముందు నీ కొడుక్కి ఈ వార్త చెప్పనీ" అంటూ అమెరికాలో ఉండే పార్వతమ్మ కొడుకుతో మాట్లాడేడు.


"అయ్యో, నాన్న పోయేరా! నేను క్రితంనెలే వచ్చి నెలరోజులు వుండి వెళ్ళాను. ఇప్పుడే మరి సెలవు ఇవ్వరు. తమ్ముడూ, నాన్న తలకి కొరివి పెట్టి ఉపకారం చెయ్యరా!" అంటూ బతిమాలుతున్న పార్వతమ్మ కొడుకు మాటలు విని...

"సరేలే, తప్పదుకదా!" అని,  ఒప్పుకున్నాడు వీరేశం.

"పెద్దమ్మా! నీ కొడుకు వంక చెప్పి, రాలేనని తప్పించుకున్నాడు. నేను మరి కాదనలేను! ఎక్కడికో తీసుకువెళ్ళి బాక్సుల్లో పెట్టి, పాచి పడిన శవాన్ని మూడురోజుల దాకా వుంచినకన్నా సూర్యాస్తమంలోపు అంత్యక్రియలు చెయ్యడం వుత్తమం" అంటూ  పెదనాన్న అంత్యక్రియలు పూర్తి చేసేడు వీరేశం. 


పెద్దయ్యగారు చెడు నక్షత్రంలో పోయేరని తెలిసి ఊరంతా  నిశబ్దంగా ఉన్నారు. పెద్దాయన బతికి ఉన్నప్పుడు 'పెద్ద ముత్తైదువ స్వయానా పార్వతీదేవి' అంటూ నమస్కరించి వెళ్ళేవారంతా! ఇప్పుడు పలకరించటానికి కూడా ఎవరూ  రావటంలేదు. చుట్టుచుట్టూ తిరుగుతున్న అప్పమ్మను వీరేశం...

"ఏంటీ, అలా ఇల్లంతా తిరుగుతూ పెద్దమ్మను ముట్టుకుంటూ ఇల్లంతా చుట్టపెడుతున్నావు? ఫో, మీ ఇంటికి" అని వీరేశం కసిరినా వినకుండా అమ్మగారి వద్దనే ఉండేది అప్పమ్మ.


"కన్న కొడుకు తప్పించుకున్నాడు. మాకు పట్టిందీ దరిద్రం" అని, సూటీ పోటీ మాటలంటూ వీరేశం భార్య పెద్దత్తగారికి భోజనమిచ్చి వెళ్ళేది.


పదవరోజు దగ్గరపడింది.  గాజులు, బొట్టు తీసే కార్యక్రమం పార్వతమ్మ పుట్టింటి వాళ్ళు చెయ్యాలి. ఆమె అన్నయ్య, ఎప్పుడో చని పోయాడు. అన్న కొడుక్కి కబురు పంపితే...

"నేను, మతం మార్చుకున్నాను. మేమలాంటి పనులు చెయ్యకూడదు" అని కబురుచేసాడు.


భర్త, పోయిన దుఃఖంతో  బాధపడుతున్న పార్వతమ్మకు, తెల్లబట్ట కప్పటానికి ఎవరూ ముందుకు రావటంలేదు.  'ఈ వయసులో నాకీ బాధవసరమా? నామటుకు నేను తీసేసుకుంటాను' అంటూ  పార్వతమ్మ ఏడ్చింది.


పెదనాన్న కుటుంబానికి బ్రహ్మరథం పట్టే గ్రామప్రజలు, ధనిష్ట పంచకాలు అనగానే అందరూ తొంగి చూడటం మానేశారు.  పెద్దమ్మను గ్రామ ప్రజలు వెలేసినట్టు చూస్తుంటే...ఈర్ష్యతో రగిలే వీరేశం మనసు,  పైశాచికానందానికి లోనైంది.


చిన్నతనం నుంచీ అమ్మగారింట్లో పనిచేసే అప్పమ్మ  ముందుకొచ్చి...

"అమ్మా! పదండి. చెరువుగట్టుకు వెళదాము" అంటూ అమ్మగారిని చెరువుగట్టుకి తీసుకు వెళ్ళి,  బొట్టు గాజులు తీసి, తెల్లపంచె కప్పి... ఇంటికి తీసుకు వచ్చింది. 


"ఇల్లు ఆరునెలలు పాడు బెట్టాలి, లేకుంటే అరిష్టం" అనే వీరేశం మాటతో పార్వతమ్మ... "ఎక్కడకు వెళతానురా?" అంటూ దయనీయంగా అడుగుతున్న పెద్దమ్మను చూస్తూ...

"ఏమో, నువ్వే ఆలోచించు" అని చిరాకుగా అంటున్న  వీరేశంని చూస్తూ పార్వతమ్మ, సిగ్గువిడిచి...

"వీరేశం, కొన్నాళ్ళు మీ వరండాలో ఉంటానురా!" అని అడిగింది.

"పెద్దమ్మా, నా భార్య గయ్యాళితనం నీకు తెలిసిందే కదా! అనవసరమైన గొడవలెందుకని నిన్ను తీసుకు వెళ్ళలేక పోతున్నాను" అంటూ బాధ నటిస్తున్న వీరేశం వైపు చూస్తూ నిస్సహాయంగా చూస్తూ...

"పోనీలే, నేను మా ఇంట్లోనే ఉండిపోతానురా!" అంది.


"పెద్దమ్మా, నిన్ను చూసుకోవడానికి  ఎవరున్నారు? రోజూ ఈ కొంపలోకి అడుగుపెడుతూ నీ అవసరాలను చూడవలసింది నేనేకదా!" అంటున్న వీరేశాన్ని చూస్తూ మౌనంగా వుండిపోయింది పార్వతమ్మ.


భర్త, పోయిన దుఃఖం ఒకవైపు బాధిస్తుంటే...మనుషులు సృష్టించిన శాస్త్రమనే వలయంలో ఒంటరిగా మిగిలిన  అమ్మగారిని చూస్తూ వస్తున్న ఏడుపును ఆపుకుంటూ...


"అమ్మా, మీరు పెద్దింటి వాళ్ళు. మిమ్మల్ని నా గడపకి మిమ్మల్ని తీసుకువెళతానమ్మా!" అంటూ  చేతులు జోడిస్తున్న అప్పమ్మ,  పార్వతమ్మ మసక బారిన కళ్ళకు దేవతలా కనిపించింది.  


"అప్పీ, నన్ను తీసుకు వెళితే నీకు కీడు జరుగుతుందేమో?" అంది సంశయంగా పార్వతమ్మ.


"అమ్మా, నా మొగుడు ఎప్పుడో నన్ను వదిలిపోయాడు. నాకా పిల్లాజల్లా లేరు. ఇక, నాకు జరిగే కీడు ఏముందమ్మా? చిన్నప్పటినుంచీ మీ అరుగుమీద ఆడుకుంటూ పెరిగినదాన్ని. మీరిచ్చిన అన్నం తింటూ పెద్దదాన్ని అయ్యేను. కాదనకండి. మీ రుణం ఇలా తీర్చుకునే అవకాశం ఇయ్యండమ్మా!" అంటూ పెద్దావిడ కాళ్లమీద పడి ఏడుస్తున్న అప్పమ్మను  భుజాలు పట్టుకుని లేపి...

అప్పమ్మ వెంట అడుగులు వేస్తుంటే...

"పెద్దమ్మా! ఆ కులం తక్కువదాని ఇంటికి వెళ్ళటానికి వీలులేదు. మన ఇంటి పరువేమౌతుందో ఆలోచించు. పెదనాన్న ఆత్మ శాంతించదు. నీ కొడుకు ఏమంటాడో?" అంటున్న వీరేశం మాటలకు...

"అంత ఆలోచించే శక్తి నాకు లేదు. నా శరీరం పట్టు తప్పింది. నా కొడుకు వచ్చి, నా సమస్యను తీరుస్తాడనే ఆశ లేదు. నన్ను చూసి ఊరంతా భయపడుతుంటే...  అప్పమ్మ, దాని గుండెలో చోటిచ్చి నన్ను దాని ఇంటికి తీసుకు వెళుతోంది. నేను వెళుతున్నాను" అంటూ దృఢమైన నిర్ణయంతో అప్పమ్మ ఇంట్లోకి అడుగు పెట్టింది పార్వతమ్మ.


గుడిసెలో చేతనైనంత వరకూ అమ్మగారికి సదుపాయం  చేసింది అప్పమ్మ.  'ఆయుష్షున్నంతవరకూ నీ  పంచనే వుంటానే మొద్దు. ఇలాంటి, రోజొకటి వస్తుందనే.. నిన్ను, నా మనసుకి దగ్గర చేసేడేమో ఆ భగవంతుడు?' అనుకుంటూ...అప్పమ్మ చెప్పే కబుర్లు వింటూ అప్పమ్మతో పాటూ పల్లె పదాలకు వంత కలుపుతూ రోజులు ప్రశాంతంగా వెళ్ళదీస్తోంది  పార్వతమ్మ.

(సమాప్తము)

4 కామెంట్‌లు:

  1. మానవీయ సంబంధాలు మటుమాయమైపోతున్న తరుణంలో అప్పమ్మ లాంటి వారు ఇంకా వున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కథ, కథనం బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది మేడం

    రిప్లయితొలగించండి
  3. నీతో నేనుంటా అన్న కథ చాలా బాగుంది. ఇటీవల కాలంలో విదేశాలలో ఉంటున్న పుత్ర రత్నాలు తల్లిదండ్రుల అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడం స్థానికంగా ఉన్న బంధువులు ఎవరో ఆ కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహించడం జరుగుచున్నది మనకందరికీ తెలిసిందే ఇది ఒక దుష్ట పరిణామం ఈ విషయాన్ని రచయిత సున్నితంగా ఎత్తి చూపారు మూఢాచారాలకు బానిసలై ఆత్మీయులను ఇండ్లలో ఉంచుకొనడానికి కూడా ఇష్టపడని బంధుజనం ఎంత నిరంకుశలో తేటతెలమయింది. ఏ బాంధవ్యము లేని పనిమనిషి యజమానురాలిని నా ఇంట్లో ఉండమని కోరడం కథకు కోసమేరుపు.. చక్కటి చక్కటి సామాజిక స్పృహ ఉన్న ఈ కథను అందించినందుకు రచయిత్రికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. భర్త చనిపోయాక 72 ఏళ్ల పార్వతమ్మ ను శాస్త్రం పేరిట అదే ఇంట్లో వుణ్నియ్యక, తన ఇంటికి పెళ్ళాం గయ్యళితనం పేరుతో రానివ్వక , అప్పమ్మ ఇంటికి కులం తక్కువ అని పోనివ్వక … వీరేశం పొందే పైశాచిక ఆనందం ఏమిటో ?!
    నిజానికి మునుపటి ఇంట్లో ముగ్గురు మసలేవాళ్లు.ఇప్పుడు ఒకరు పోయారు. ఇద్దరు మిగిలారు. ఇప్పడు ఇద్దరూ ఒకేచోట వున్నారు. ఒకరికొకరు తోడుగా !!
    బాగుంది కథ. రచయిత్రి గారు అభినందనీయురాలు .

    రిప్లయితొలగించండి