శాశ్వతం (కథ)
కుళ్ళూరు శ్రీ కిన్నెర
కార్తీక్ మనసు మనసులో లేదు.. తన ముందున్న సమస్యలకి అతనికి తోచిన పరిష్కారం ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకొని చనిపోమని అతని మనసు పదే పదే పోరుతోంది. చేతిలో నిద్రమాత్రల డబ్బా పట్టుకొన్నాడు. అతని ఊపిరి భారంగా వుంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆత్మహత్యే తన సమస్యకి పరిష్కారమా అని తన మనసుని పదే పదే కార్తీక్ ప్రశ్నిస్తున్నాడు. అతను ప్రశ్నించిన ప్రతి సారీ ‘‘ అవును..’’ అనే సమాధానమే అతని మనసు చెబుతోంది.
కార్తీక్ ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి..
కార్తీక్ తనెంతో తెలివైన వాడని నమ్మకం.. అతని తల్లి తండ్రులు రవి, శారదలకి ఒక్కడే కొడుకు. తనంటే శారదకి చాలా ఇష్టం. ఇప్పటివరకూ తను ఎన్ని తప్పులు చేసినా శారద తన భర్త రవి వద్ద వెనకేసుకొచ్చేది. ఒక్కమాట కూడా అనేదికాదు.
కార్తీక్ కి డబ్బంటే పిచ్చి. ఆ డబ్బు సంపాదించాలనే పిచ్చి.. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తాలన్న ఆలోచనలు.. అతన్ని అడ్డదారులు తొక్కేలా చేశాయి. క్రికెట్ బెట్టింగుల్లో వెయ్యిరూపాయలతో మొదలు పెట్టాడు. అంతే అతనికి అనుకోకుండా రెండువేలొచ్చాయి. అక్కడితో ఆగలేదు. ఆ రెండు వేలు మళ్ళీ బెట్టింగుల్లో పెట్టాడు. నాలుగు వేలయ్యాయి. ముందు డబ్బు బానే వచ్చేది. తర్వాత తర్వాత డబ్బులు పోవటం మొదలయ్యాయి. అతన్ని బెట్టింగు వ్యసనం వదల్లేదు. వెంటాడుతోంది. పోయిన డబ్బుని రాబట్టుకోవాలనే ప్రయత్నం.. అతనికి సంబంధించినవన్నీ ముందు తాకట్టుపెట్టాడు. అతని అదృష్టమో.. దురదృష్టమో డబ్బులు రెట్టింపై తిరిగి వచ్చేవి.. దాంతో తాకట్టు విడిపించుకుంటూ తిరిగి తాకట్టు పెట్టుకుంటూ క్రికెట్ బెట్టింగులు కాసేవాడు.
జూదం అనేది ఎప్పుడూ ఒకలా వుండదు.. అదృష్టాన్ని నమ్ముకుంటుంది. కార్తీక్ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది. తాకట్టు పెట్టినవి విడిపించుకోలేక వున్నవస్తువులు అమ్ముకోవటం మొదలు పెట్టాడు. ఓడిపోయిన ప్రతిసారీ గెలవాలనే తపనతో వస్తువులు అమ్ముకోవటం మొదలు పెట్టాడు.. వస్తువులు పోతున్నాయి.. డబ్బులు పోతున్నాయి. చివరికి అతనికి అర్ధమైంది అతనికి తను వ్యసనంలో వున్నానని.. దానిని వదిలించుకోటానికి ఎవరో స్నేహితుడు చెప్పాడు.. బిజినెస్ స్టార్ట్ చెయ్యమని..
హోటల్ బిజినెస్ బాగుంటుందని అతను సలహా ఇచ్చాడు. అంతే ఇంట్లో తల్లి శారదని, తండ్రి రవిని ఒప్పించి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. రవి ముంబయిలో తన ఆఖరిరోజులకోసం వుండేందుకు ముచ్చటపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న స్థలాన్ని కొడుకు భవిష్యత్తుకోసం ఇచ్చేశాడు. ఇచ్చేలా శారదే రవిని ఒప్పించింది. ఆ స్థలం అమ్మగా వచ్చిన డబ్బుతో ముంబైలోని ఒక మంచి సెంటర్ లో త్రీస్టార్ హోటల్ స్టార్ట్ చేద్దామనుకున్నాడు కార్తీక్. కానీ అది సాధ్యపడక రెస్టరెంట్ మాత్రం తెరవగలిగాడు. ఏమాత్రం హోటల్ ఫీల్డులో అనుభవంలేని కార్తీక్ సలహా ఇచ్చిన అతని స్నేహితుడిని పార్ట్నర్ గా కలవమన్నాడు. దానికి అతను మేనేజింగ్ పార్ట్నర్ గా వుంటూ బిజినెస్ చూసుకుంటానన్నాడు. దానికి కార్తీక్ కూడా ఓ.కే అన్నాడు.
రెస్టరెంట్ ఆదాయం రాకపోగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. రెస్టరెంట్ నడపటం సాధ్యం కావట్లేదు. అప్పటికే క్రికెట్ బెట్టింగుల్లో పాతికలక్షలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రెస్టరెంట్ చూస్తే వర్కర్లకి జీతాలివ్వటం కూడా కష్టంగా వుంది. ఆరునెలల్లో పదిలక్షలు అప్పులు చూపించాడు పార్ట్నర్.. అప్పటికే రెస్టరెంట్ మెయింటేనెన్స్ కోసం తల్లితండ్రులకి తెలీకుండా రహస్యంగా ఇంటి పత్రాలు బ్యాంకులో తాకట్టు పెట్టాడు. అయినాసరే కస్టమర్లు వస్తున్నారు, తింటున్నారు, డబ్బులిస్తున్నారు, వెల్తున్నారు.. కానీ డబ్బు ఎటుపోతోందో అస్సలు కార్తీక్ కి అర్థవ్వలేదు. దీంతో రెస్టరెంట్ మూసేయాలన్న నిర్ణయానికి వచ్చాడు కార్తీక్.. అలాగే మూసేశాడు.
కొడుకు లక్షలు పోగొట్టినా శారద ఒక్కమాట కూడా అనలేదు. రవి మాత్రం కొడుకుని నిలదీశాడు. పోగొట్టిన డబ్బులకి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగాడు. శారద కొడుకు మీదున్న ప్రేమతో రవినోరు మూయించింది. తల్లీ కొడుకు ఒకటయ్యే సరికి రవికూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు.
కార్తీక్ మనసంతా డబ్బుమయమే అయిపోయింది. స్నేహితుడ్ని నమ్మి డబ్బులు పోగొట్టుకున్నానని నిర్ణయానికి వచ్చాడు. వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. తిరిగి వ్యాపారం చేసే డబ్బులు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి మంచి ఫ్యూచర్ వుందని దానిలో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయని ఎవరో చెప్పగా విన్నాడు. దాని గురించి గూగుల్ లో సెర్చ్ చేశాడు. మొత్తానికి ఒక అంచనాకొచ్చాడు. అయితే లక్షల్లో కాదు.. ఈ సారి కోట్ల రూపాయలు కావాలి. కానీ అంత డబ్బు తనదగ్గరలేదు. తల్లితో తన ప్రపోజల్ చెప్పాడు. తల్లి తాలూకూ ఆస్తులు ఆంద్రప్రదేశ్ లోని అమరావతికి దగ్గరలో పదెకరాల పొలముందని మాటల్లో చెప్పింది. రాజధాని అనౌన్స్ చేయటంతో భూమికి బూం వచ్చిందని, ఎకరం కోట్లల్లో పలుకుతోందని చెప్పింది.
రవితో మాట్లాడి మనీ అడ్జెస్ట్ చెయ్యమని తల్లి చెవిలో జోరీగలా పోరాడు కార్తీక్.. కొడుకు మీద సహజ ప్రేమతో కాదనలేకపోయింది శారద. ఈ విషయంలో రవిని ఒప్పించింది.
‘‘ నాకు ఆ ఊరు వెళ్ళి అన్ని రోజులుండి ప్రాపర్టీని సేల్ చెయ్యటం కుదరదు. కావాలంటే కార్తీక్ ని వెళ్ళి అమ్ముకోమను.. కావాల్సిన ఏర్పాట్లు ఫోన్లోనే చేశాను. అక్కడ దాసని సర్పంచ్ వున్నాడు. ఆయన్ని కలిస్తే ఇరవై రోజుల్లో ల్యాండ్ ని అమ్మిపెడతాడు.’’ అని చెప్పి రవి తప్పించుకున్నాడు.
అలా కార్తీక్ నారాయణ దగ్గరికి రావటం జరిగింది.. కార్తీక్ గతంలోంచి బయటికి వచ్చాడు.
రేపు బ్యాంకు వాళ్ళు ఇంటికి నోటీసులు పంపిస్తారు. అప్పుడు తనమీద ఇన్నేళ్ళూ తన తల్లి, తండ్రి పెట్టుకున్న నమ్మకం ఏమైపోతుంది.?
ఒకవైపు తల్లి సూచనతో తన ఊరిలోని పొలాన్ని అమ్మేద్దామని ఊరు వచ్చాడు. ఆ పొలాలు అమ్మే బాధ్యత తీసుకున్న సర్పంచ్ దాసు ఇరవై రోజులైనా అయిపులేడు. అతను వచ్చిందాకా బ్యాంకు వాళ్ళు ఆగరు. కొత్తగా అతను స్టార్ట్ చేద్దామనుకున్న స్టార్టప్ కంపెనీ ఆఫీసు బిల్డర్స్ నుంచి ఫోన్లు.. మెటీరియల్ తెప్పించాలంటూ డబ్బులకోసం వేధింపులు.. లేకపోతే పనులన్నీ ఎక్కడి వక్కడ ఆపేస్తామని బెదరింపులు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నాడు కార్తీక్..
పాతిక సంవత్సరాల కార్తీక్ మనసంతా కూడా ఈ ఆలోచనలతో గందరగోళంగా వుంది. తను కష్టాల్లోంచి బయటపడాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గం.. ఇలా ఆలోచిస్తూ నిద్రమాత్రల డబ్బాని ఓపెన్ చేశాడు. చేతిలోకి నిద్రమాత్రలు తీసుకున్నాడు.. గ్లాసులో నీళ్ళు పోసుకొని మాత్రలన్నీ అందులో పోసుకొని కలుపుకున్నాడు. అప్పటి వరకూ ఏదేవుడికీ దణ్ణం పెట్టి ఎరుగని కార్తీక్ మొదటిసారిగా ‘‘ భగవంతుడా ! నువ్వు నాకు మంచి తల్లిదండ్రుల్నిచ్చావ్.. మంచి జీవితాన్నిచ్చావ్. కానీ దాన్ని నిలబెట్టుకోలేక పోయాను. మరుజన్మంటూ వుంటే నాకు ఇలాంటి తల్లితండ్రుల్నే ఇచ్చి.. మంచి జీవితాన్ని నిలబెట్టుకునే బుద్ధిని కూడా ప్రసాదించు.. ’’ అంటూ నిద్రమాత్రలు కలిపిన నీటిని తాగేశాడు.
ప్రశాంతంగా నేలమీద పరిచిన తుంగచాపపై పడుకున్నాడు.
‘‘తుంగచాప.. తుంగచాప.. ’’ అంటూ దాన్ని తడిమాడు..
తనకీ ఊర్లో అవకాశమిచ్చిన నారాయణగారు ఆక్షణంలో అతని మనసులో మెదిలాడు. నారాయణ ఒక విచిత్రమైన మనస్థత్త్వం కలిగిన పాతకాలం నాటి మనిషి. ఆయన ఏవిషయాన్నీ సూటిగా చెప్పడు. ప్రతి విషయాన్నీ తన అనుభవంలోంచి ఎదుటివారికి అనుభవమయ్యేలా విశ్లేషిస్తాడు. డబుల్ కాట్ బెడ్డు, ఏసీ రూముల్లో తప్ప పడుకోని తనకి తుంగచాపని పరిచయం చేశాడు. ఎన్నో అనుభవాల్ని ఆయన ద్వారా తను తెలుసుకున్నాడు. నిజానికి ఈ విషయంలో నారాయణ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనకీ ఆశ్రయమిచ్చిన నారాయణ గారికి క్షమాపణలు కూడా చెప్పుకోవాలి. తన శవాన్ని తన తల్లిదండ్రులకి అప్పజెప్పేలా ఆయనకి చెప్పాలి.. లేకపోతే ఆయనసలే పాతకాలం నాటి మనిషి తన తల్లిదండ్రుల్ని ఏమైనా అంటాడేమో.. శవాన్నివ్వను పొమ్మన్నా అనచ్చు.. ఇలా ఆలోచిస్తూ కార్తీక్ మెల్లిగా నారాయణ వద్దకు వెళ్ళాడు.
నారాయణ కటిక నేలపై పడుకొని తన చేతినే తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఏబాధలూ లేనివాళ్ళకే సుఖమైన నిద్రపడుతుందంటారు.. ఈయన్ని చూస్తే కార్తీక్ చాలా జలస్ ఫీలయ్యాడు. కానీ అంతలోనే తేరుకొని తనకూడా అన్ని బాధలనుండి విముక్తి పొందుతున్నాడు కదా.. చచ్చే ముందు జలస్ అవసరమా అనుకున్నాడు.
అతనలా ఆలోచిస్తుండగానే అనుకోకుండా కార్తీక్ కన్నీళ్ళు నారాయణ పాదాలపై పడ్డాయి.. నారాయణ కళ్ళు మూసుకొనే ‘‘కార్తీక్.. ఇంకా నిద్రపోలేదా.. అన్ని నిద్రమాత్రలు నీళ్ళల్లో కలుపుకున్నా నిద్రరాలేదా’’ అన్నాడు.
దానికి కార్తీక్ ఆశ్చర్యపోయాడు..
నారాయణ లేచి కూర్చుంటూ..
‘‘ నువ్వు నీ తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడింది విన్నాను. మెడికల్ షాపు వాడు నా మనిషే.. నిద్రమాత్రలు అన్ని కావాలని నువ్వు అడగ్గానే అతనికి అనుమానమొచ్చి పిప్రమెంటు బిళ్ళల్ని నిద్రమాత్రల డబ్బాలో పోసిచ్చాడు. నాకు విషయం చెప్పాడు. నీ విషయాలన్నీ నువ్విక్కడికి రాకముందే నాకు తెలుసు. ’’ అన్నాడు.
‘‘ ఎలా ? ’’ అన్నాడు కార్తీక్
‘‘ మీ నాన్న నాకు ఫోన్ చేసి చెప్పాడు.’’
‘‘ మానాన్న నీకు ఫోన్ చెయ్యటమేంటి? మా నాన్న నీకెలా తెలుసు?’’
‘‘ ఎందుకంటే నువ్వు నా రక్తానివి రా మనవడా? మనవడి బాధల్ని తీర్చేయటం తాతకో లెక్కా చెప్పు. ఇంకో విషయం నువ్వు ఊరెళ్ళాడు అనుకునే దాసుని కూడా నేనే.. నీ సమస్యకి పరిష్కారం డబ్బిస్తే సరిపోదురా.? నువ్వేంటో నీకు తెలియాలి.. అందుకే ప్రతి విషయాన్నీ నీ గుండెకి గాయమయ్యేలా అనుభవంలోకి తీసుకొచ్చి మరీ చెప్పాను. నిన్ను ఈ ఊరు పంపిన మీ అమ్మ.. తనే ఎందుకు రాలేదో తెలుసా? మీ అమ్మ స్వార్థపరురాలు. ఈ ఊరునుంచి, ఈ ఇంటి నుంచి తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయింది. దానికి మొహం చెల్లక నిన్ను పంపించింది.’’
‘‘ మా అమ్మ నీకు...’’
‘‘ కూతురు.. తను ప్రేమపెళ్ళి చేసుకుంటానంటే ముందు వద్దన్నాను. నామాట వినకుండా మీ నాన్నని పెళ్ళిచేసుకుంది. ఆ తర్వాత అడపా దడపా మీ నాన్న కొట్టాడనో, హింసిస్తున్నాడనో కల్లబొల్లి మాటలు చెప్పి ఏడ్చి నాదగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయేది. ఒక రోజు మీనాన్నని నేను నిలదీస్తే నాకు తెలిసింది.. మీ నాన్న అమాయకుడనీ.. మీ అమ్మ చేతిలో అతను కీలుబొమ్మ అయ్యాడని.. నిజానికి నా బంగారమే మంచిది కాదని అర్థమైంది. మరోసారి మీ అమ్మ వాళ్ళమ్మ నగలకోసం, భూమికోసం వచ్చింది..అదేరా నువ్విప్పుడు అమ్మాలనుకుంటున్నావే ఆ పొలాలకోసం.. నేనివ్వనన్నాను. కావాలంటే నగలవరకూ ఇస్తానన్నాను. మాటామాటా పెరిగింది. నగలు దాని మొహాన కొట్టాను. పొలాలు మాత్రం నేను బతికుండగా ఇవ్వనని చెప్పాను. నువ్వు చచ్చాక ఎలాగూ అవి నావే అవుతాయని చెప్పి వెళ్ళిపోయింది. ఇదిగో ఇప్పుడు నువ్వు వాటికోసం వచ్చావ్.. బహుశ ఇన్నాళ్ళూ ఈ ముసలాడు బతికుండడులే అని అది అనుకొని వుండచ్చు.. ’’ అంటూ నిట్టూర్చాడు నారాయణ.
దీంతో తన తల్లంటే ఏంటో కార్తీక్ కి అర్థమైంది. తను ఎక్కడ తప్పు చేశాడో అర్థమైంది.
మనిషి దేన్నైనా పోగొట్టుకోటానికి క్షణకాలం పట్టదు.. సంపాదించటానికి జీవితకాలం సరిపోదు. అనుభవమిచ్చే సందేశం శాశ్వతం. ఆ అనుభవాల సారమే వృద్ధాప్యం. అలాంటి మీ అనుభవానికి శిరసువంచి నమస్కరిస్తున్నాను. స్నేహితులని నమ్మి మోసపోయానని అనుకున్నాను. కానీ అనుభవంలేక జీవితంలో ఓడిపోయానని అర్థమైంది. అనుభవం సంపాదించాకే అద్భుతాలు సృష్ఠిస్తాను. అన్నాడు.
అంతే నారాయణ కాళ్ళమీద పడి కార్తీక్ తను చనిపోననీ, ఉద్యోగం చేసి అనుభవం వచ్చాకే వ్యాపారం చేస్తానని చెప్పి సెలవు తీసుకున్నాడు.
శుభం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి