26, సెప్టెంబర్ 2023, మంగళవారం

రాజు గారి గోచి

రాజు గారి గోచి

కథ

ఎన్. శివన్నారాయణ

9848361678

నేరమూ శిక్ష గురించి చాలా వాదనలు జరగటం నాకు తెలుసు. శిక్షల వల్ల నేరాలు తగ్గుముఖం పడతాయా అంటే నాకు అనుమానమే. పూర్వకాలంలో చిన్న చిన్న నేరాలకు కూడా తీవ్రమైన శిక్షలు వేసిన రాజుల గురించి నేను చదివాను. మరి నేరాలు తగ్గాయా? ఒక చిన్న చిత్రం చెప్పనా? చిన్న దొంగతనం కేసులో రెండు మూడు  నెలలు జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తరువాత పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ల గురించి నాకు తెలుసు. జైలనేది నేరస్తులకు సత్ప్రవర్తనా పాఠశాలలా ఉండాలని గాంథీగారు కలలు కంటూ చెప్పారు. ఆయన అన్నట్టుగానే అవి పాఠశాలలయ్యాయి. కాకపోతే మనిషి మంచివాడుగా మారటం గురించి కాకుండా నేర ప్రవృత్తి మెరుగుపరుచుకునే విధంగా బోధనలు జరుగుతున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే నేరం చేసిన తర్వాత దానినుంచి తప్పించుకునే మార్గాలు పోలీసువాళ్లే చెప్పటం.

నేరానికీ శిక్షకూ సంబంధం ఉంటుంది. నిజమే. కానీ మనకు తెలియని మరో కోణం కూడా ఉంటుంది. శిక్షకు గురైన వ్యక్తిపై ఆధారపడిన జీవితాల మాటేమిటి? ఒక ఆడకూతురు గర్భంతో వుండగా నేరం చేసి శిక్ష అనుభవిస్తుంటే, జైల్లో పుట్టిన పిల్ల సంగతేమిటి? ఆ పసిగుడ్డు జైల్లో ఉండాలా? ఉండాలి అంటే ఆ పసిగుడ్డు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్టేగదా! ఒకవేళ ఉండనక్కరలేదు అంటే తల్లినీ బిడ్డనూ వేరు చేసిన పాపం మాటేమిటి?

ఇలాంటి సందేహాలు, సందిగ్ధతలూ న్యాయం గురించి సూక్ష్మంగా ఆలోచించే వాడి బుర్ర తినేస్తుంటాయి. అందుకే మన నాయకులు ఏదీ పెద్దగా ఆలోచించరు. ఆలోచించేకొద్దీ సమస్యలు పుడతాయని వాళ్లకు తెలుసు. సరే, ఎలాగూ ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు తెలిసిన అలాంటి ఒక రాజుగారి గురించి మీకు చెబుతాను.

అనగనగా ఒక దిబ్బరాజ్యం. అక్కడ జనం పెద్దగా లేరు. మహా వుంటే పదివేలు లోపు.  లోకంలో జనం ఎక్కడచూసినా చీమల పుట్టల్లా పెరిగిపోతూ వుంటే ఆ రాజ్యంలో జనం ఎందుకులేరని మీరు ప్రశ్న వేస్తే నా దగ్గర సమాధానం లేదు. అక్కడ మగవాళ్లూ ఉన్నారు. ఆడవాళ్లూ ఉన్నారు. కానీ జనం లేరు. అంతే!

ప్రజలకు నాయకుడు కావాలి కదా! కాబట్టి వాళ్లకో రాజుగారు కూడా ఉన్నారు. రాజుగారు ఉన్నారు కాబట్టి ఆయనకో మంత్రిగారు, సైన్యాధ్యక్షులవారు, సైనికులు, దర్బారు, అంతఃపురం అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాక వాటిని పోషించటానికి ధనం కావాలి కాబట్టి ప్రజలకు పన్నులు కూడా ఉన్నాయి. వసూలు చేసిన పన్నులతో ప్రజలకు సౌకర్యాలు కలిగిస్తారని అనుకోకండి. అవన్నీ వాళ్లు సర్వసుఖాలు అనుభవించటానికి సరిపోవటం లేదని అంటుంటారు.

అలాంటి రాజ్యంలో ప్రజలను మరింత సుఖపెట్టాలని రాజుగారు సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో రాజుగారు ఏం చెబుతారా అని అందరితోపాటు నేనూ ఎదురుచూస్తున్నాను. అరుగో, రాజుగారు వస్తున్న గుర్తుగా భట్రాజులు వచ్చేసారు.

రాజాధిరాజ, రాజమార్తాండ, రాజ కంఠీరవ, రాజ పద్మ, రాజ భూషణ, రాజా విభూషణ, రాజ రత్న....భట్రాజులు గొంతులు అలిసిపోయాయి కానీ రాజు రాలేదు. ప్రజలకోసం పాలకులు ఎదురు చూడాలా? పాలకుల కోసం ప్రజలు ఎదురుచూడాలా? గుడ్డుముందా? పెట్టముందా? అన్నట్టు ఎప్పటికీ తేలని ప్రశ్న!!

ఎట్టకేలకు రాజుగారు హఠాత్తుగా ఊడిపడ్డాడు. అవును. దండానికి తగిలించిన కట్ డ్రాయరు గాలికి కిందపడినట్టు రాజుగారు ఒంటిమీద నూలుదారం కూడా లేకుండా సభలోకొచ్చి పడ్డాడు. పబ్లిక్కులో న్యూసెన్స్ చేస్తున్నాడని రాజుగారిని మందలించడంపోయి చుట్టూ వున్న వాళ్లు ఎలా పొగుడుతున్నారో చూడండి.

ఆర్యా, మీరు యీ విధంగా బహు సౌందర్యంగా వున్నారు ప్రభూ!

అవును మన రాజుగారు ఏం కట్టినా ఆ వస్త్రమునకే సౌందర్యం చిక్కును

అసలు వారి దివ్యమంగళ రూపంలోనే రహస్యం ఉంది

రాజుగారికి కోపం వచ్చింది. “ఆపండి మీ సొల్లు స్తోత్రాలు.. కళ్లేమైనా దొబ్బాయా మీకు? ఓ పక్క సభకి సమయమవుతుంది, సమయపాలన మమ్మల్ని హెచ్చరిస్తూ వుంది.

అలంకరణ సిబ్బంది ఎంతకూ రారు. మరేం చెయ్యను? ఎదురుగా కనిపించిన పూలబుట్టఅడ్డుపెట్టుకుని అమాంతం వచ్చేసాను

ఆహా.. ఆహాహా.. ఆహాహాహా.. మహారాజుగారి సమయపాలన అద్భుతం! మహాద్భుతం!!

అద్భుతం! మహాద్భుతం!!

మళ్లీ భజన మొదలయ్యింది. రాజుగారి తెగ చిరాకుపడిపోయాడు.

అలంకరణ సిబ్బంది సమయపాలన ఎందుకు పాటించలేదు? నా అంగవస్త్రం సమయానికి ఎందుకు ధరింపజెయ్యలేదు?”

ఖజానాలో సొమ్ములేక సేవకులందరికీ స్వస్తి చెప్పితిమి ప్రభూరాజుగారు దిగులుపడ్డాడు.

తండ్రి చచ్చాడు, నువ్వే రాజువి అన్నారు. పట్టాభిషేకం అన్నారు. ఏనుగు ఎక్కి ఊరేగిస్తారనుకున్నా. ధనం సమకూరాక ఉత్సవం చేస్తాం అన్నారు. అది సమకూరి సచ్చింది లేదు - ఉత్సవం చేసింది లేదు. ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై పన్నులు విధించడం లేదా యేమి?”

లేకేమి ప్రభూ! మన రాజ్యంలో జుట్టుసుంకం కూడా తప్పనిసరి

మరి ప్రజలు చెల్లించుట లేదా?”

జుట్టు మీద టాక్స్ అనగానే జనాలు జులపాలతో తిరగడం మొదలుబెట్టారు

మద్యపానంపై పన్ను విధించినారా?”

మద్యం మానినారు ప్రభూ

రాజు తల విదిలించుకున్నాడు.

ఇది మరీ విడ్డూరంగా వుంది; ప్రజలు బుద్ధిమంతులైతే ప్రభుత్వాలెలా నడుస్తాయి? అయితే మీరు ఒకపని చేయండి. కష్టపడకుండా డబ్బు సంపాదించేయాలని ప్రతి వెధవా అనుకుంటాడు

మనం అనుకున్నట్టే!”

నువ్ నోరుముయ్. చెప్పింది విను. కనుక తక్షణమేప్రజలను జూదాలకు బానిసల్ని చేయండి

జూదం ఆడతారా ప్రభూ?”

ధర్మరాజు ఆడాడని చెప్పండి. కృష్ణుడు కూడా ఒప్పుకున్నాడని ప్రకటించండి. అదే భారతీయ ధర్మమనిఅరిచి చెప్పండి. రకరకాల జూదశాలల పరిశీలించటానికి కావాలంటే లాస్ వేగాస్ వెళ్లిరండి

అవును ప్రభూ, వాళ్లు వారంలో ఐదు రోజులు పనిచేసి మిగిలిని రెండు రోజులు విలాసంగా బ్రతుకుతారు. మనం పనులు మానుకుని విలాసంగా బ్రతకటం అలవాటుచేస్తే మన రాజ్యం ఎక్కడికో వెళ్లిపోతుంది

రాజుగారు చెప్పినట్టుగానే రాజ్యంలో విలాసవంతమైన జూదశాలలు పుట్టుకొచ్చాయి. జూదశాలలకు అనుబంధంగా పునుగులూ, బజ్జీలు అమ్మేవాళ్లొచ్చారు. సిగరెట్లూ, మద్యం అమ్ముకునే వాళ్లు చేరారు. జూదశాలలన్నీ స్వర్గధామాలైపోయాయి. స్వర్గంలో ఉన్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన వందలమంది దేవవేశ్యలూ అనసూయ, అరుంధతిలాంటి పేర్లు మార్చుకుని దిగిపోయారు. వీళ్లందరికీ బాడీ గార్డుల పేరుతో రౌడీలు మకాం పెట్టారు. రౌడీలతోపాటు ఆయుధాలు కూడా అలంకారానికి వచ్చేసాయి. సందట్లో సడేమియా అన్నట్టు ఒకరోజు సందడిలోఢామ్మనితుపాకి పేలింది. ఎవరిదో శరీరం నేలమీద పడింది.

రాజుగారి పరివారం అద్భుతమైన తెలివితేటల్ని ప్రయోగించి నేరస్తుణ్ణి క్షణంలో పట్టేసారు.

నేను చంపలేదయ్యా.. స్నేహితుడే గదాని చనువుగా అతని దగ్గరి పైకం తీసుకోబోయాను. అతను అవకాశం ఇవ్వకుండా జేబు గట్టిగా పట్టుకున్నాడు. ఆ గడబిడలో ఒకరినొకరు తోపులాట చేసుకున్నాం. తోపులాటలో నా స్నేహితుడు ఎవరిమీదనో పడిపోయాడు. అతని జేబులో వున్నదేదో ఢామ్మని పేలిందిఅని చెప్పి పెద్దగా ఏడ్చాడు.

న్యాయాధికారి కోపంతో రెచ్చిపోయాడు. “ఏక కాలంలో ఎన్ని నేరాలు చేసావురా? స్నేహితుడ్ని చంపి నమ్మకద్రోహం చేసావా? ఇతరుల మీద పడి ధనం దోచుకోబోయావా? ఆపబోతే దౌర్జన్యం చేసావా? ఆయుధాలను దాచుకున్నావా? చివరికి హత్య కూడా చేసావు. హమ్మామ్మా నీకు మామూలు శిక్ష సరిపోదు. భూగోళంలో వున్న అన్ని దేశాల న్యాయశాస్త్రాలను పిండి రుబ్బినట్టు రుబ్బాలి

మంత్రిగారు అసలు నిజం చెప్పేందుకు నోరు విప్పాడు. “మన రాజ్యంలో నేరస్మృతి శిక్షాస్మృతిలేనే లేవు ప్రభూ?”

ఎందువల్ల?”

ప్రజలకు నేరం చేసే తీరిక లేదు. మనం విధించిన పన్నులు చెల్లించటానికి చాకిరీ చేస్తేనేగానీ కుదరదు. నేరం చేసేది రాజ పరివారం కాబట్టి మనకు శిక్షాస్మృతి లేనే లేదు

నేరం చేసాడని అభియోగం చేసిన వాడు భోరుమని యేడ్చాడు. “అవునయ్యా, నా పనేందో చేసుకుంటూ పొట్టపోసుకునేవాణ్ణి. ఈ మహమ్మారి జూద శాలలు వచ్చాకే డబ్బూ పరువూ అంతా పోయింది. మీ గోచీమీద ఒట్టు. మా కుటుంబంలో ఎప్పుడూ ఎవరూ ఏ నేరమూ చేయలేదు ప్రభూ

హత్య చేసిందికాక మన జూదశాలలమీదనే తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభూ. పైగా మీ గోచీ మీద ఒట్టుపెట్టి గోచీని అవమానించాడు. ఇతని బుర్రనిండా రాజద్రోహపు ఆలోచనలే

అసలు ఆలోచించే వాళ్లే దేశానికి చీడ పురుగులు. వీడు యిన్ని ఆలోచిస్తే మరింత నష్టం. వీడికి మరణదండనఅన్నాడు రాజుగారు గోచీని పైకి ఎగరేస్తూ. “శిక్షను వెంటనే అమలుపరచండిఅని వేగంగా నడవబోయి ముందుకు పడిపోయాడు.

శిక్ష అమలుచేసేందుకు కావల్సిన పరికరాలేమీ రాజ్యంలో లేవు. పక్క రాజ్యాలవారిని అడిగితే తమ పరువు దక్కదని నోరు తెరవకుండా ఉండిపోయారు.

ఇంతలో ఒకరోజు చనిపోయినవాడి తల్లి మహారాజుల వారి దగ్గరకు వచ్చి భోరుమని ఏడ్చింది. ఒక్కగానొక్క కొడుకూజూదశాలలో చనిపోతే తనకు దిక్కెవరని విలపించింది.

రాజుగారికి మళ్లీ చిరాకొచ్చింది. “మనమే ప్రజల్ని పన్నులు కట్టమని అడుక్కుంటుంటే, ఇదెవరో మనల్ని అడుకుంటుంది. ఈడ్చి అవతల పారేయండి

అప్పుడే అక్కడికి వచ్చిన మాజీ మంత్రికి రాజుగారు చేస్తున్న తప్పు గురించి చెప్పాలని అనిపించింది.

ఆవిడ అడిగేది భిక్ష కాదు, ధర్మం. ఆవిడ చనిపోయినవాడి తల్లి. అంధురాలు. కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో అనాధ అయింది. మీరు నేరస్తుడికి శిక్ష వేసినట్టే యీ ముసలమ్మకూ బ్రతుకుతెరువు చూపించి న్యాయం చేయాలిఅన్నాడు.

మేం నేరస్తుణ్ణి యింకా శిక్షించలేదు కాబట్టి ముసలమ్మ బ్రతుకుతెరువుకు మాకు బాధ్యత లేదుతెలివిగా అన్నాడు రాజు.

చూసారా ప్రభూ, ఎవరో నేరంచేశారు. శిక్ష ఆవిడ అనుభవిస్తుంది. అది ఆలోచించాలి కానీ వాడి శిక్ష గురించి ఆందోళన దేనికి? ప్రస్తుతానికి మరణశిక్షను జైలుశిక్షగా మార్చండి

నా గోచీని చూసే సేవకుడే లేడురా అంటే, మీసాలకి సంపెంగ నూనె అన్నట్టు ఇప్పుడు వీడికోసం జైలు కట్టాలా?” తల చేత్తో పట్టుకున్నాడు రాజు.

మరణశిక్ష జైలు శిక్షగా మారిన తర్వాత అన్నీ సమయానికే జరిగిపోతున్నాయి. భోజనం, మంచి నిద్ర, చిన్న చిన్న పనులు చేసి పెట్టేందుకు ఒక నౌకరు, పాడుబడిపోయిందైనాగానీ, తనకంటూ ఒక యిల్లు. నేరస్తుడికి నేరం చేయటంలో ఎంతో సుఖం ఉందనుకున్నాడు. అందుకే నేరస్తులు జైలు నుంచి వచ్చాక తిరిగి జైలుకే వెళ్లేందుకు ఎందుకు నేరాలు చేస్తారో వాడికి పూర్తిగా అర్ధమైంది.

రాను రాను వాడి ఖర్చులు భరించడం రాజ్యానికి భారమైపోయింది. ఒకరోజు మంత్రిగారు వచ్చిఇవ్వాళ నువ్వు పారిపోయే ఏర్పాట్లు చేస్తాంఅన్నాడు.

నేరస్తుడు ఎగాదిగా చూసినాకు శిక్ష వేయకుండానే ఎలా వదిలిపెడతారు?” అన్నాడు.

మంత్రికి ఎక్కడో కాలింది. “వీడొకడు తప్పించుకు పారిపోరా అంటే లాజిక్కు లడుగుతాడుఅని మనసులో విసుక్కున్నాడు. “యేవో చిన్నచిన్న నేరాలు చేసినోళ్లని ఐతే నాలుగు బెత్తెము దెబ్బలో కొరడా దెబ్బలో వేసి పంపిస్తాం. పెద్ద పెద్ద నేరాలు చేసినోళ్లని, ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేసినోళ్ళని, ఏం చేస్తాం? మేము కళ్ళు మూసుకుంటాం, మీరు పారిపోండి అంటాం. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. నువ్వే అర్ధం చేసుకుని పారిపోవాలి

మరి నా హక్కుల సంగతిఅన్నాడు నేరస్తుడు.

హక్కులా?”

ఏం ఖైదీలకు హక్కులుండవనుకున్నారా? సర్లే, మీరు ఎట్టా చస్తే నాకెందుకు? ఇహనుంచి వాటిని రోజూ రెండుసార్లు కడిగించి క్రిమి సంహారక సువాసనా ద్రవాలు పిచికారీ చేయించండి. దోమతెరలు కట్టించండి. ఎలుకలు పందికొక్కుల్ని అరికట్టండి. ముప్పూటలా భోజనం, రెండుసార్లు టీ స్నాక్స్ వేళ తప్పకుండా అందించండి. భోజనంలో అన్ని పోషకాలూ

ఉంటే నోటికి సహించదు. మెనూ మారుస్తూ వుండండి. వారానికో వినోద కార్యక్రమం, నెలనెలా వైద్య పరీక్షలు తప్పనిసరి. కట్టుకోటానికి రెండు పూటలా ఉతికిన బట్ట లివ్వాలి. ఆరు నెలలకోసారి వాటిని మార్చెయ్యాలి. మంచాలు బెడ్డింగులు పరిశుభ్రంగా ఉంచాలి. జమకాణాలు దిండు గలీబులు ఏరోజు కారోజు ఉతికిన వాటితో మార్చాలి.మరో ముఖ్యమైన విషయం - ఖైదీని ఒంటరిగా ఉంచితే కుంగుబాటుకు గురవుతాడు. ఓ తోడుండేలా చూడాలి.వీలైతే నెలకోసారి ఒక ఆడతోడు ఏర్పాటు చేయండి

మంత్రి అలా నిలువుగుడ్లు వేసుకుని చూస్తూనే ఉన్నాడు.

విచారణ అంటే చిన్నపిల్లలాట అనుకున్నారా? అసలు విచారణలో ఎన్ని విషయాలుంటాయో మీకు తెలుసా? అప్పటి దోషి మానసికస్థితి ఏంటి? ఆర్ధిక స్థితి ఏంటి? సామాజికస్థితి ఏంటి? ఇంటా బయట వాడి స్థితి గతులు ఏంటి? దోషికి హతుడికి వున్న సంబంధం ఏంటి? అదెలా ఏర్పడింది? ఎలా పరిణామం చెందింది? ఇప్పుడెలా వుంది? ఇది హత్యా? ఆత్మహత్య? హత్య అయితే, హతుడు నిజంగా దోషి చేతుల్లోనే చనిపోయాడా? దోషి చేతుల్లోనే పొతే, దోషి కావాలని చంపాడా? పొరపాటున చంపాడా? కావాలనే చంపితే, ఎందుకు చంపాడు? పొరపాటున చంపితే, పొరపాటుకు కారణాలేంటి? ఈ సంఘటనకి ఎవరైనా సాక్షులున్నారా? ఉంటే, ఆ టైంకి అక్కడ ఎందుకు వున్నారు? కావాలనే ఉన్నారా? అనుకోకుండా ఉన్నారా? ఎంతసేపటి నుంచి వున్నారు? వారికి ఆ హత్య జరుగుతుందని ముందే తెలుసా? హత్య జరుగుతుంటే చూస్తూ వూరుకున్నారా? ఆపే ప్రయత్నం ఏమైనా చేశారా? చేస్తే, ఎందుకు చేశారు? చేయకుంటే, ఎందుకు చెయ్యలేదు? సాక్ష్యం వాళ్ళంతట వాళ్ళే చెప్పారా? ఎవరి బలవంతం మీదైనా చెప్పారా? వారంతట వారే చెబితే, వారికి దోషిపై ద్వేషమున్నదా? హతుడిపై ప్రేమున్నదా? సాక్షులకి హతుడికి హంతకుడికి ఏదైనా సంబంధం ఉన్నదా?}} ఈ విధంగా ప్రశ్నల్లోంచి ప్రశ్నలు, సమాధానాల్లోంచి అనుమానాలు, కూపీలు లాగి లాగి లాగి.. సమాధానాలు రాబట్టి వాటికి ఆధారాలు సేకరించిఅందులో నిజానిజాలు తెలుసుకుని వాదోపవాదాలు సాగించి సాగించి సాగించి... అలసి సొలసి.. తాపీగా తీర్పు చెప్పటానికి ఎంతలేదన్నా ఒకటి రెండు దశాబ్దాలైనా పట్టాలి.బోఫర్స్ కేసు.

అవినీతి విలువ అరవై కోట్లు. విచారణా వ్యయం 250 కోట్లు. విచారణా సమయం 25 సంవత్సరాలు

ఇంతలో ఎవరో అటువైపు వెళ్తూ అరిచాడు. “రాజుగారు వ్యాహ్యాళికి వెళుతున్న సమయంలో వచ్చిన పెనుగాలికి ఆయన గోచీ ఎగిరిపోయిందట. ఇటువైపుగానీ వచ్చిందా?”

ఖైదీ పకపకా నవ్వాడు. “ముందు రాచ పరివారం అందరూ గోచీని వెతకండి. తర్వాత నా శిక్ష గురించి ఆలోచిద్దురుగానీ

అతనలా నవ్వుతూనే ఉన్నాడు.

                                                      ***


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి