4, అక్టోబర్ 2023, బుధవారం

ప్రమోషన్

ప్రమోషన్

గోళ్లపాటి నాగేశ్వరరావు

ఎక్కడో దూరాన గుర్రపు డెక్కల చప్పుడు లీలగా వినిపిస్తున్నాయి. లోకానికి ఆ చప్పుళ్లకు పుంజలు పురులు విప్పి కూస్తున్నాయి. పక్షులు పాటలలో పోటీపడుతున్నాయి. మెల్లమెల్లగా భక్తి గీతాలాపనలు మొదలైనాయి గుడుల్లో. గుర్రపు డెక్కల చప్పుడు ఎక్కువైంది. ఉదయభానుడు అశ్వరధంపై వెలుతురు కక్కుతూ వస్తున్నాడు. పద్మనాభానికి మాత్రం ఇవేమి పట్టలేదు. రాత్రంతా మంచం మీద అటుఇటు మెసులుతూనే ఉన్నాడు.ఎంత ప్రయత్నించిన నిద్ర పట్టటం లేదు. కళ్లుమూస్తే తన భార్య కలలోకి వస్తుందేమోనని భయం.

పద్మనాభానిది ఒక మధ్యతరగతి కుటుంబం. గవర్నమెంట్ సెక్టార్ లో ఒక మోస్తరు ఉద్యోగం . చాలిచాలని జీతంతో పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఎలాగో తిప్పలు పడుతూ. పైగా iఇంటి అవసరాలతో పాటు భార్య గొంతెమ్మ కోర్కెలు తీర్చటం కత్తి మీద సాము అవుతుంది నెలనెలా పద్మనాభానికి. ప్రతినెలా ఒకటో తారీఖున ఇంట్లో చిన్న సైజ్ యుద్ధమే జరుగుతుండేది. నీ చాలిచాలని సంపాదనతో ఎంత కాలం ఇలా బ్రతకాలి అని సతాయిస్తుంటుంది భార్య లక్ష్మి. ఈ సారి మాత్రం ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. ఉన్న ఫళంగా పట్టు చీర కావాలంటే తను మాత్రం ఏం చేయగలడు పాపం. కొంటావా ! లేదా ! అని కూర్చుంది. వాళ్ళ మేనమామ కూతురు పెళ్ళంటా. పెళ్ళికి అందరు పట్టుచీరలు, నగలతో రిచ్ గా వస్తారు. మా బంధువులలో నేనెందుకు హీనంగా ఉండాలి అని తన  ఆర్గుమెంట్. వచ్చే నెలలో పిల్లల ఫీజులు కట్టాలి కొంచం టైట్ గా వుంది. ఈ సారికి ఉన్నవాటితో సర్దుకుంటే ఓ రెండు నెలల తరువాత కొంటాను అని పద్మనాభం రిక్వెస్ట్. చిరుగాలిలా మొదలైన గొడవ చివరకు ప్రళయంగా మారింది.. లక్ష్మి తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా చెప్పేసింది మొగుడికి బట్టల బ్యాగ్ తో బయలుదేరుతూ బాగా సంపాదించి సంతృప్తిగా నన్ను చూసుకోగలిగితేనే మళ్లీ ఇంట్లోకి అడుగుపెట్టేది అంటూ వెళ్ళిపోయింది పుట్టింటికి. భార్య రావాలంటే సంపాదించాలి. బాగా సంపాదించాలి. దీనికి ఒక్కటే మార్గం. రెండు సంవత్సరాలనుంచి తాను ప్రయత్నిస్తున్న ప్రమోషన్ ఎలాగైనా కొట్టేయాలి. అదే ఇప్పుడు పద్మనాభం ముందున్న టాస్క్ ఎలాగైనా వాళ్ల బాస్ ని ఒప్పించి ప్రమోషన్ సంపాదించాలి.

బాస్ ని ఒప్పించటం అంత ఈజీ అయిన పని కాదు. లంచానికి లొంగేవాడైతే తల తాకట్టు పెట్టయినా అప్పు తెచ్చి ప్రమోషన్ కొట్టేసేవాడే కాని కామేశ్వరరావు మాత్రం లంచానికి లొంగడు. మందుకు మగువకు మాత్రమే లొంగుతాడు. కానీ బాస్ ని ఎలా డీల్ చేయాలో పద్మనాభానికి తెలియదు. మగువ లేనిదే మందు ముట్టడు ముండాకొడుకు ఎం చేయాలి ఎలా చేయాలి రకరకాలుగా ఆలోచించాడు. ఏమి పాలుపోలేదు పద్మనాభానికి.

ఎలాగోలా అమ్మాయిని అరేంజ్ చేయగలిగితే తన ప్రమోషన్ కొట్టేసినట్టే. కానీ ఎలా... బుర్ర వేడెక్కిపోతుంది పద్మనాభానికి. అటుఇటు తిరుగుతూ ఆలోచిస్తుండగా తన మిత్రుడు శివరాం గుర్తొచ్చాడు. అంతే వెంటనే ఫోన్ చేశాడు

శివ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటులో సీనియర్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నాడు. ఉన్నత విలువలు కలిగిన మనిషి. ఇంకా పెళ్ళికాలేదు. పద్మనాభం, శివరాం ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పట్లో శివరాం ఆర్ధిక పరిస్థితిబాగుండేది కాదు శివరాంది వ్యవసాయ కుటుంబం. అనేకసార్లు శివరాంకి పరీక్ష ఫీజులకు, మెస్, బుక్స్ కొనటానికి పద్మనాభం సహాయపడుతుండేవాడు. కాలేజీ ఫెస్ట్ లో సరదాగా వాళ్ళిద్దరికీ కలిపి బెస్ట్ ఫ్రెండ్స్ అని అవార్డు కూడా ఇచ్చారు వాళ్ల సీనియర్స్. ఆ స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. శివరాం ఎప్పుడూ కళలు, నాటకాలు ప్రదర్శనలు అంటూ తిరుగుతుండేవాడు. అది పద్మనాభానికి నచ్చేది కాదు. ఈ విషయంలో ఇద్దరకీ అభిప్రాయ బేధాలుండేవి. పద్మనాభం శివరాం రాక కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. రారా శివ నీ కోసమే ఎదురుచూస్తున్నాను. ఏంట్రా అంత అర్జంటుగా రమ్మని ఫోన్ చేశావు అంటూ కంగారుగా వచ్చాడు శివరాం. పద్మనాభం మొహం చూడగానే ఏదో బలమైన సమస్యే వేధిస్తోందని గ్రహించాడు. పద్మనాభం కళ్ళొత్తుకుంటూ జరిగింది చెప్పాడు. మిత్రుడి కష్టాన్ని విన్న శివరాం చలించిపోయాడు. ఈ విషయంలో నా సహాయం ఏమైనా కావాలంటే మొహమాటపడకుండా అడగమని చెప్పాడు, ఏదైనా ఆర్ధికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కాని పద్మనాభం నాకు డబ్బు అవసరం లేదని చెప్పడంతో శివరాం ఆశ్చర్యపోయాడు.

శివరాం నాటకాలని తిరుగుతుంటాడు అనేక నాటక సమాజాలలో పరిచయం ఉంది. అనేకసార్లు ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో నాటకాలలో నటించే లేడి ఆర్టిస్టులతో పరిచయాలు ఉంటాయి. ఎలాగైనా శివరాంని అడిగి వాళ్ల నాటకాలలో నటించే అమ్మాయిని అరేంజ్ చేయమని అవసరమైతే నాటకాలలో ఇచ్చే దానికన్నా రెట్టింపు డబ్బులు ఇద్దామని ఆ అమ్మాయిని వాళ్ల బాస్ దగ్గరకు పంపించి తన ప్రమోషన్ కొట్టేయాలని పద్మనాభం ఆలోచన. శివ తన మాట కాదనడని తనకు సహాయం చేయటానికి కాదనడని ఎలాగైనా తనని ఈ గండం నుంచి గట్టెక్కిస్తాడని పద్మనాభం నమ్మకం. అదే విషయాన్నీ శివరాం తో చెప్పి ఎలాగైనా మీ నాటకాలలో నటించే అమ్మాయిని అరేంజ్ చేయమని అడిగాడు పద్మనాభం. పద్మనాభం మాటలు వినగానే శివరాం ఆవేశంతో రియాక్ట్ అయ్యాడు. అప్పటివరకు పద్మనాభం మీద ఉన్న జాలి కాస్తా కోపంగా మారింది. నాటకమనే తన ప్రవృత్తిని, తన ఆశయాల్ని అవహేళన చేస్తున్నాడని నాటక సమాజాలలో నటనే జీవనంగా మార్చుకున్న స్త్రీలను అవమానిస్తున్నాడని తన ప్రమోషన్ కోసం తప్పుడు దారులు వెదుకుతున్నాడని పద్మనాభం పైన అసహ్యం వేసింది శివరాంకి.

అంతే కాదు కామవాంఛ తీర్చుకోవటానికి క్రింది ఉద్యోగుల అవసరాలను అడ్డంపెట్టుకుంటున్న వాళ్ల బాస్ ను చొక్కాపట్టుకుని నిలదీయాలన్నంత కోపం వచ్చింది శివరాంకి. పద్మనాభం చొక్కా పట్టుకుని ఇంకోసారి ఇలాంటి ప్రస్తావన నా దగ్గరకు తీసుకురావొద్దు.. స్నేహితుడని నిన్ను చెంప పగలగొట్టకుండా వదిలేస్తున్నా అని ఆవేశంతో పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు శివరాం.

ఈ హఠాత్తు పరిణామానికి నిర్ఘాంతపోయాడు పద్మనాభం. ఒళ్ళంతా చమటలు పట్టినాయి. శివరాం కళ్ళలోకి చూడలేకపోయాడు. వేసుకున్న పధకం ఫెయిల్ కావటంతో తలపట్టుకుని తనూ కుర్చీలో కూలబడ్డాడు. ఒక నాలుగు నిమిషాలపాటు వాళ్ళిద్దరి మధ్య మౌనం విలయ తాండవం చేసింది. శివరాం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సోఫా హ్యాండీల్ని నలిపేస్తున్నాడు. ఎలాగైనా వీడికి వీడి బాసుకి బుద్ది చెప్పాలనే నిర్ణయానికి వచ్చి తన కోపాన్ని తమాయించుకొని పైకి లేచి మెల్లగా పద్మనాభం దగ్గరకు వచ్చాడు. భుజం మీద చెయ్యి వేసాడు.  బరస్ట్  అయిన పద్మనాభం పైకి లేచి క్షమించమంటూ శివరాంని కౌగిలించుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. శివరాం పద్మనాభాన్ని ఓదార్చుతు  ఒరేయ్ పద్మనాభం నువ్వు నన్ను నా ప్రవృత్తిని నటీమణులను అవమానిస్తున్నావన్న బాధలో కోప్పడ్డాను. సరే ఎంతైనా నువ్వు నా మిత్రుడివి. నీ సమస్యని పరిష్కరించే క్రమంలో నాకు చేతనైన సహాయం చేస్తాను. కానీ నువ్వు అడిగినట్లు నాటక సమాజాల్లో ఆడవాళ్లను చిన్న చూపు చూడలేను. కానీ నువ్వేదైనా ఏర్పాటు చేసుకుంటే ఆ క్రమంలో నీకేమైనా సమస్యలు వస్తే నాకు ఫోన్ చేయి. నేను నటుడ్ని కాబట్టి ఏదో ఒక వేషంలో నీకు సహాయం చేస్తాను అని చెప్పి శివరాం వెళ్ళిపోయాడు.

పద్మనాభానికి ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తూ కుర్చీలో కూలబడ్డాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి డోర్ తీశాడు. ఎదురుగా ఓ పాతికేళ్ల యువతి నిలబడి వుంది. సార్ ఇక్కడ ఇల్లేదో అద్దెకు ఇస్తారు అని చెప్పారు అనగానే తేరుకున్నాడు పద్మనాభం. మీరెవరండి అని ఎదురు ప్రశ్న వేశాడు . మాది హైదరాబాద్. ఇక్కడికి డిప్యుటేషన్ వేశారు. అనుకోకుండా అయన దుబాయ్ క్యాంపుకి వెళ్లారు. వారు వచ్చేసరికి మూడు నెలలు పడుతుంది. ఈ మూడు నెలల పాటు ఇక్కడే ఉంటాను. అందుకే  అద్దె ఇల్లు కోసం వెతుకుతుండగా ఈ అడ్రస్ చెప్పారు. ఆ మాట వినగానే పద్మనాభానికి ఒక ఐడియా తట్టింది. ఆమెను ఇంట్లోకి ఆహ్వానించి మర్యాదలు చేశాడు. నువ్వు నా తోబుట్టువు లాంటిదానివని నమ్మకం కలిగించాడు. నేను నీ నుండి ఒక్క రూపాయి కుడా తీసుకోకుండా ఇల్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నువ్వు నాకొక సహాయం చేయాలి అని తన పరిస్థితిని అంతా ఆమెకు వివరించాడు. నా ప్రమోషన్ ఫైల్ మీద సంతకం పెట్టేవరకు మా బాస్ దగ్గర నువ్వు ఒక కాల్ గర్ల్ నటించాలని  ప్రాధేయపడి ఆమెను ఒప్పించాడు. మా బాస్ నీ వంటి మీద చెయ్యి వేయకుండా చూసుకునే బాధ్యత నాది అనే ఒప్పందం మీద. పద్మనాభం ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు. ఫారిన్ బ్రాండ్ మందు ఫుల్ బాటిల్ తెప్పించి వాళ్ళ బాస్ ని ఓకే రోజు ఇంటికి ఆహ్వానించాడు. అనుకున్న ప్రకారం బాస్ పద్మనాభం ఇంటికి వచ్చాడు. అమ్మాయిని చూసి తొందరగా అమ్మాయితో సరసాలాడాలని తొందరపడుతున్నాడు. అమ్మాయిని చూస్తూనే ఫుల్ బాటిల్ పూర్తీ చేశాడు

మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ బాస్ ని, అమ్మాయిని చెరోగదిలోకి పంపించి తలుపు తీశాడు . ఎదురుగా ఒక డెబ్బై ఏళ్ల ముసలాయన ప్రత్యక్షమయ్యాడు. నేను నీ భార్య లక్ష్మికి దూరపు బంధువునని, చూసి పోదామని వచ్చానని చెప్పి అమ్మాయి ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు. రూములో అమ్మాయి ఉండటం చూసి ముసలాయన పద్మనాభాన్ని అనుమానించి లక్ష్మి లేని సమయంలో నువ్విలా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావని నీ భార్యతో చెపుతానని చెప్పి వెళ్తాడు. పద్మనాభానికి పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది. ప్రమోషన్వచ్చేది దేవుడెరుగు ఇప్పుడు పెళ్ళాం విడాకులు ఇస్తుందేమోనని భయం పట్టుకుంది. ఇక్కడ జరుగుతున్న విషయం శివరాంకి ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా నువ్వే ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పాడు. ఒక పక్క అమ్మాయిని రూములోకి పంపమని బాస్ గొడవ చేస్తున్నాడు. మళ్లీ కాలింగ్ బెల్ మోగింది.. తలుపు తీయగానే ఆ ఏరియా యస్.ఐ లోపలకి వచ్చి ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి పద్మనాభం వాళ్ల బాస్ ని భయపెడతాడు. నాకు డబ్బులు ఇస్తే కేసులు లేకుండా చేస్తానని లేకపోతె కేసు పెట్టి నీ ఉద్యోగం ఊడబీకిస్తాను అని చెప్పి ఐదు లక్షలు నొక్కేసి పద్మనాభం ప్రమోషన్ ఫైల్ మీద సంతకం చేయిస్తాడు. ఇంతలో  మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. పద్మనాభం వెళ్లి తలుపు తీయగా ఎదురుగా సి.ఐ ఉన్నాడు. అందరు ఖంగు తిన్నారు సి.ఐ  ని చూసి. సి.ఐ అందర్నీ అరెస్ట్ చేసి స్టేషనుకి తరలించే సిద్ధపడుతున్న సమయంలో పద్మనాభం, వాళ్ల బాస్ సి.ఐ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారు. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమని పెళ్ళాం పిల్లలతో గౌరవంగా బ్రతుకుతామని అరెస్ట్ చేస్తే ఉద్యోగం పోతుందని ప్రాధేయపడతారు.

వాళ్ల పశ్చాత్తాపాన్ని గమనించిన శివరాం ఇదంతా నాటకమని మీలో మార్పు రావటం కోసమే నా మిత్రుడు చేత సి.ఐ వేషం వేయించానని, అద్దె ఇంటి కోసం వచ్చిన ఈ అమ్మాయి నాతో పాటు నాటకాలలో నటిస్తుందని, మేమిద్దరం ప్రేమించుకుంటామని పెళ్లి కూడా చేసుకోబోతున్నామని నా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు సహాయపడాలంటే మారు మాట్లాడకుండా ఈ నాటకం ఆడటానికి ఒప్పుకుందని చెప్పగా పద్మనాభం నటులను అవమానించినందుకు సిగ్గుతో తలదించుకున్నాడు. మళ్లీ కాలింగ్ బెల్ మోగింది.తలుపు తీయగానే విడాకుల పత్రాలతో పద్మనాభం భార్య నిలబడి ఉంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావో మా తాతయ్య నాకు చెప్పాడు. అందుకే విడాకులతో వచ్చాను అని చెప్పగానే పద్మనాభం క్షమించమని కాళ్ళమీద పడ్డాడు. శివ పద్మనాభాన్ని పైకి లేపి లక్ష్మి నేను కలిసే ఈ నాటకం ఆడాం. ఆ ముసలాడిగా వచ్చింది కూడా నేనే అని చెప్పి నా నాటకమే ఈ రోజు నీ కుటుంబాన్ని నిలబెట్టింది. నీ భార్యలో మార్పు తెచ్చింది. నీ బాస్ లో మార్పు తెచ్చింది. ఇకనుండి తప్పుడు మార్గాలలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించవద్దని నాటక కళ యొక్క గొప్పదనాన్ని వివరిస్తాడు.